2020లో ఎన్నో విచిత్రమైన, ఊహాతీత విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో మరో వింతైన విషయం జరిగింది. శరీరంపై దుస్తులు లేకుండా ఓ వ్యక్తి రహదారిపై రోలర్ బ్లేడింగ్ చేశాడు. ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో చూసినవారంతా రకరకాలుగా స్పందిస్తుండగా.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అమెరికాలో ఓహియోలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి సడన్ గా రోడ్డుపై దుస్తులు లేకుండా రోలర్ బ్లేడింగ్ చేస్తూ ముందుకు సాగాడు. కేవలం తలకు మాత్రం పాండా మాస్క్ వేసుకున్నాడు. చుట్టూ ఎంత మంది చూస్తున్నా.. వాహనాలు ఎన్ని వెళుతున్నా అతడు నగ్నంగానే ముందుకు సాగాడు. అతడి చేతిలో సెల్ఫీ స్టిక్ కూడా ఉంది.
ఈ విషయంపై ఓహియో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి స్పందించారు. ఆ హైవేపై పాదాచారులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. “ఇంటర్ స్టేట్ హైవేల్లో పెడెస్ట్రైన్స్(పాదాచారులు)కు అనుమతి లేదు. దీని గురించి అన్ని చోట్లా బోర్డులు సైతం పెట్టాం. అయితే రోబల్ బ్లేడింగ్ చేసిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదు” అని ఆయన చెప్పారు. ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు సైతం షాకయ్యారు. అతడికేమైనా పిచ్చా అని కొందరు అంటుంటే.. మరికొందరు మరింత విచిత్రంగా స్పందించారు.
ఈ వీడియోకు ఫన్నీ కామెంట్లతో మోతెక్కించారు. వింటర్ ఒలింపిక్స్ స్పీడ్ స్కేటింగ్ జట్టులో అతడిని చేర్పించాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. “కరోనా కాలంలో ప్రజలు వింతగా ప్రవర్తిస్తున్నారు” అని మరొకరు కామెంట్ చేశారు. “అతడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాడు.. మాస్క్ ధరించాడు, ఎక్స్ర్సైజ్ చేస్తున్నా.. ఇందులో పిచ్చి ఏముంది..?” ఓ యూజర్ ఫన్నీగా స్పందించారు.