Viral videos: పులి గురించి ప్రస్తావన రాగానే.. వామ్మో పులా! అది క్రూరమైన మృగం... దానికి దొరికితే ప్రాణాలు తీస్తుంది అని మనలో చాలా మంది అనుకుంటారు. అది క్రూరమైన జంతువే కానీ, తన కంటే బలహీనంగా ఉండే జంతువుల పైనే పులి తడాఖా చూపిస్తుంది. బలమైనవి తారసపడితే తోక ముడుచుకుని పోవాల్సిందే. ఈ వీడియో చూస్తే మనకు కూడా అదే అనిపిస్తుంది. దారికి అడ్డంగా సేదతీరుతున్న ఓ పులి.. అదే దారిలో వస్తున్న ఓ ఏనుగు... ఈ రెండూ ఎదురుపడితే భీకర యుద్ధమే జరుగుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ వీడియో చివరి వరకు చూస్తే కానీ అసలు విషయం అర్థం కాదు. ఇందుకు మరో కారణం కూడా ఉంది.
గజరాజుకు దారిచ్చిన పులిరాజు:
21 సెకన్ల పాటు సాగే ఈ వీడియోలో ఏనుగు తన మార్గంలో తాను వస్తున్నట్టు కనిపిస్తోంది. అదే దారిలో అడ్డంగా ఓ పులి పడుకొని సేద తీరుతోంది. వెనుక నుంచి వస్తున్న ఏనుగును చూసిన పులి, అక్కడ నుంచి లేచి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. దీంతో ఏనుగు తన మార్గంలో దర్జాగా వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి విశేషంగా స్పందిస్తున్నారు.
పోస్ట్ చేసిన దియా మీర్జా:
ఈ వీడియోను ప్రముఖ బాలివుడ్ నటి దియా మీర్జా కూడా షేర్ చేశారు. "చివరి వరకు ఆగి.. ఏం జరిగిందో మీరూ చూడండి" అనే ట్యాగ్‌తో ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను ఎవరు తీశారో అతడి కోసం వెతకండి అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు తగినన్ని కామెంట్లు పెట్టాలని నెటిజన్లనను కోరారు. మే 28న దియా మీర్జా ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటివరకు దీన్ని లక్ష మందికి పైగానే చూశారు. 4900 మంది లైక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కామెంట్ సెక్షన్.. నెటిజన్ల కామెంట్లతో పోటెత్తుతోంది. ఆ వీడియో ఇక్కడ చూడండి.
Watch what happens at the end! @SanctuaryAsia is looking for the person who captured this video. Kindly share in comments ? @BittuSahgal @vivek4wild @wti_org_india pic.twitter.com/H2FbIE2xYv
— Dia Mirza (@deespeak) May 28, 2021
పులి, ఏనుగు శాంతియుతంగా ఒప్పందం చేసుకున్నాయని, రెండూ గొడవ పడాలి అనుకోలేదని ఓ వ్యక్తి కామెంట్ పెట్టారు. ఏనుగే నిజమైన రాజు అని మరొకరు పోస్ట్ చేశారు. భూమిపై రెండు శక్తిమంతమైన జంతువులు ఎదురుపడ్డా ఏమీ కాలేదని, అడవిలో కారణం లేకుండా ఏదీ జరగదని ఇంకో వ్యక్తి కామెంట్ రాశారు. ఇందులో కొంత నిజం ఉంది. పులికి ఆకలి వేసినప్పుడే దాడి చేస్తుంది. అప్పుడు అవతల ఉన్నది ఏనుగైనా వదలదు. ఇప్పుడు పులి ఆకలితో లేదు. ప్రశాంతంగా సేద తీరుతోంది. అందుకే... గొడవెందుకని సైడైపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elephant, Tiger, Viral Video