Government failure: ప్రభుత్వ తీరుతో విసిగిపోయి.. సొంతంగా వంతెన కట్టుకుంటున్న గ్రామస్తులు..!

Photo Credit : ANI Twitter

Government failure: ప్రతి ఏటా వర్షాలు పడాలని రైతులందరూ కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం వర్షం పడకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు. చిన్నపాటి వరదతో సైతం ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇలా చేస్తారు.

  • Share this:
ప్రతి ఏటా వర్షాలు పడాలని రైతులందరూ కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం వర్షం పడకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు. చిన్నపాటి వరదతో సైతం ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇలా చేస్తారు. ఇదే కోవలోకి వస్తారు ఒడిశాలోని ఒక గ్రామ ప్రజలు. అసలు వర్షం పడకూడదని ఇక్కడి ప్రజలందరూ ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే, వారి గ్రామం చుట్టూ మూడు వాగులు ఉన్నాయి. వాటిలో ప్రతి వర్షాకాలం ఆరు అడుగుల ఎత్తులో నీరు చేరుకుంటుంది. దీనివల్ల ప్రజలు గ్రామం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి. ఈ సమస్యను తీర్చేందుకు ఒక బ్రిడ్జి నిర్మించాలని నాయకుల్ని, అధికారులను వేడుకున్నా.. ఎలాంటి స్పందన లభించలేదు. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు తమ సొంత డబ్బును జమ చేసి.. వనరులను సమకూర్చుకొని ఓ చెక్క వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు.వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని బలంగిర్‌ జిల్లా, మహులపాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కుతురకేంద గ్రామం చుట్టూ మూడు పెద్ద వాగులు ఉన్నాయి. వీటిలో ప్రవాహం ఏనాడు ఆగదు. ఏడాదిలో ఆరు నెలల పాటు భారీగా నీరు ప్రవహిస్తుంటుంది. ఇక వర్షాకాలంలో నీటి మట్టం ఆరు అడుగులకు చేరుకుంటుంది. దీనివల్ల వర్షాకాలం పూర్తయ్యేంత వరకూ గ్రామస్తులు తమ ఊరు దాటి బయట అడుగు పెట్టలేరు. పురిటి నొప్పులు వచ్చినా.. ప్రాణాలు పోతున్నా.. గ్రామం నుంచి పట్టణాలకు వెళ్లడం సాధ్యపడదు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడం కూడా కుదరదు. ఇక నిత్యవసర సరుకులు కూడా కొనటానికి వీలుపడదు.

ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆ గ్రామస్తులు.. తమ కోసం ఒక చెక్క వంతెన నిర్మించాలని ఏళ్లుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు వారి డిమాండ్ ను పెడచెవిన పెట్టారు. ఎన్నికల సమయంలో మాత్రం బ్రహ్మాండమైన చెక్క వంతెన నిర్మిస్తామని రాజకీయ నేతలు హామీ ఇచ్చారు. కానీ ఒక్కరూ కూడా తమ హామీలు నెరవేర్చలేదు.


అయితే గ్రామస్తులు విసిగిపోయి.. తామే సొంతంగా చెక్క వంతెనను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అనంతరం తమ సొంత ఇళ్లు, సమీప అడవుల నుంచి వెదురు, కలప సేకరించారు. తదనంతరం వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. వంతెన నిర్మాణం ఇప్పటికే సగం పూర్తి కాగా దానిని త్వరలోనే ప్రారంభించొచ్చని తెలుస్తోంది. అధిక స్థాయిలో నీరు ప్రవహిస్తున్నా కూడా ఈ వంతెనను ఉపయోగించవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు.

ప్రభుత్వాలను నమ్ముకోకుండా సొంతంగా వంతెన నిర్మాణాన్ని ప్రారంభించిన ఈ గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు, WODC చైర్మన్ అసిత్ త్రిపాఠి స్పందించారు. గ్రామస్తుల ప్రయత్నాలను తాను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఈ చెక్క వంతెన తాత్కాలికమైనదని, త్వరలో నీటి ప్రవాహంపై శాశ్వత వంతెనను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Published by:Sridhar Reddy
First published: