VIRAL NEWS WEDDING CARD AND LOVE JIHAD PROTESTS LEADING TO CANCELL A MARRIAGE IN MAHARASHTRA NK GH
Love Jihad: వివాదాస్పదమైన ఆహ్వాన పత్రిక... ఆగిపోయిన పెళ్లి వేడుకలు
ప్రతీకాత్మక చిత్రం
ఎక్కడైనా పెళ్లి శుభలేఖ... పెళ్లి గురించి మరింత ఎక్కువ మందికి తెలిసేలా చేస్తుంది... కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా... ఆ శుభలేఖే పెళ్లి ఆగిపోయేందుకు కారణం అయ్యింది. ఎలాగో తెలుసుకుందాం.
ఓ వివాహ ఆహ్వాన పత్రిక... ఏకంగా పెళ్లి వేడుక రద్దు కావడానికి కారణమైంది. మహారాష్ట్ర... నాసిక్‌లోని మతాంతర వివాహానికి సంబంధించిన ఈ పెళ్లికార్డు పెద్ద సంచలనమే అయింది. ఈ వివాహం లవ్ జిహాద్ అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో... వధువు కుటుంబం పెళ్లి వేడుకలను రద్దుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... నాసిక్‌కు చెందిన ప్రసాద్ అద్గాంకర్ ప్రసిద్ధ స్వర్ణకారుడు. ఆయనకు రశిక అనే కూతురు ఉంది. ఆమె దివ్యాంగురాలు కావడంతో పెళ్లి పెద్ద సమస్యగా మారింది. ఎన్నో సంబంధాలు చూసినా ఎవరూ రశికను వివాహం చేసుకోవడానికి సుముఖత చూపలేదు. ఈ క్రమంలో రశిక తన ఒకప్పటి క్లాస్మేట్ అయిన ఆసిఫ్ ఖాన్‌ను ఇష్టపడింది.
చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న రశిక అంటే ఆసిఫ్‌ఖాన్ కూడా ఇష్టపడ్డాడు. దీంతో మతాల విషయాన్ని పట్టించుకోకుండా ఇద్దరికీ పెళ్లి చేయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఉభయకుటుంబాల పెద్దలు నాసిక్ స్థానిక న్యాయస్థానంలో వీరి వివాహ విషయాన్ని ఈ ఏడాది మే నెలలోనే నమోదు చేశారు. వధువును అత్తవారింటికి పంపేలోపు వివాహ మహోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. జులై 18న వివాహ వేడుకలను జరపాలని ప్రసాద్ కుటుంబం భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంది. దగ్గరి బంధువులతో నాసిక్‌లోని ఓ హోటల్లో వేడుకలకు ఏర్పాట్లు చేశారు.
అయితే ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రిక వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేయడం ప్రారంభమైంది. ఈ పెళ్లి కచ్చితంగా లవ్ జిహాద్ అంటూ వివాదం రేగింది. దీనిపై అనేక నిరసనలు, నెగెటివ్ కామెంట్స్ వెల్లువెత్తాయి. యువతిని బలవంతంగా వేరే మతానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారనే వాదనలు వినిపించాయి. దీంతో ఈ వేడుకను రద్దుచేయాలంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పెళ్లి కుమార్తె కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విచిత్రం ఏమంటే ఈ కుటుంబానికి సంబంధం లేని కొత్తవారు కూడా వీరిని బెదిరించారు.
ఈ పెళ్లి వేడుకలను రద్దు చేసుకోవాల్సిందిగా ప్రసాద్ అద్గాంకర్కు స్థానిక సువర్ణకార్ సంస్థ సభ్యులు సూచించారు. ఈమేరకు ప్రసాద్ ఈ సంస్థకు ఒక లేఖను కూడా రాశారు. స్థానికుల నుంచి ఎదురవుతున్న నిరసనలు, ఒత్తిడి కారణంగా తమ కూతురి పెళ్లి వేడుకను రద్దు చేసుకుంటున్నట్లు ప్రసాద్ రాసిన లేఖ అందిందని సువర్ణకార్ సంస్థ అధ్యక్షుడు సునీల్ తెలిపారు. ఈ రచ్చపై పోలీసులను ఆశ్రయించకూడదని పెళ్లి కూతురు కుటుంబం నిర్ణయించుకుంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.