కొన్నేళ్ల క్రితం మహిళ ముక్కులో ఇరుక్కుపోయిన చిన్న ఆట వస్తువును తాజాగా గుర్తించారు న్యూజిలాండ్ వైద్యులు. గత ఏడాది కోవిడ్ టెస్టు కోసం స్వాబ్ తీసినప్పటి నుంచి సదరు మహిళ సైనస్ సమస్యతో బాధపడుతుంది. తాజాగా చేసిన పరీక్షల్లో.. ఆమె ముక్కులో బోర్డు గేమ్ ఆడే డైస్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. దీంతో సర్జరీ చేసి, దాన్ని బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. న్యూజిలాండ్‌కు చెందిన 45 ఏళ్ల మేరీ మెకర్తీ అనే మహిళకు చిన్నప్పటి నుంచి సైనస్ సమస్య ఉండేది. ఆమె కుడి నాసికా రంధ్రం నుంచి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండేది. అయితే సమస్య మరీ పెద్దది కాకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. గత సంవత్సరం కోవిడ్-19 పరీక్ష తర్వాత సైనస్ సమస్య తీవ్రమైంది. దీంతో ఇటీవల క్రైస్ట్ చర్చి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా అసలు విషయం బయట పడింది. భరించలేని నొప్పి ఉన్నందువల్ల సైనస్‌కు సర్జరీ చేయాలని మేరీ డాక్టర్లను కోరింది. కానీ ఆమె సమస్యకు అసలు కారణం సైనస్ కాదని పరీక్షల్లో తేలింది. ముక్కులో ఏదో చిన్న వస్తువు ఇరుక్కుపోవడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు, తీవ్రమైన నొప్పి వస్తున్నట్లు డాక్టర్లు గుర్తించారు. సీటీ స్కానింగ్ చేసి చూడగా.. ఆమె ముక్కులో టిడ్లీ వింక్ అనే బోర్డు గేమ్ ఆడేందుకు ఉపయోగించే డైస్ ఉన్నట్లు తెలిసింది. తన ముక్కులో ఈ టిడ్లీవింక్స్ పీస్ ఉన్నట్లు తెలుసుకొని మేరీతో పాటు వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు.
టిడ్లీవింక్ బోర్డు గేమ్‌ను "వింక్స్" అని పిలిచే చిన్న డిస్క్‌లు లేదా డైస్ సెట్‌లతో ఆడతారు. కొంత దూరంలో నిల్చొని.. "స్క్విడ్జర్" అనే వస్తువుతో వింక్స్‌ను ఒక డబ్బాలో వేస్తారు. ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే, వారు గెలుస్తారు. ఇలాంటి వింక్ పీస్ చిన్నప్పుడే మేరీ ముక్కులో ఇరుక్కుపోయింది. దాదాపు 37 సంవత్సరాల క్రితం తన ముక్కులో అది ఇరుక్కుపోయిందని మేరీ గుర్తుచేసుకుంది. తనకు ఎనిమిదేళ్ల వయసులో.. టిడ్లీ వింక్ పీస్‌ను ముక్కులో పెట్టుకొని ఆడుకుంటున్నప్పుడు ఇలా జరిగినట్లు చెప్పింది.
‘ముక్కులో ఒక వింక్ పీస్ పెట్టుకొని, గట్టిగా ముక్కు నుంచి గాలి ఊదాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలా ఊదినప్పుడు ఎవరి వింక్ ఎక్కువ దూరం వెళ్తే వారు గెలుస్తారు అనుకున్నాం. అయితే నేను ముక్కులో పెట్టుకున్న వింక్ పీస్‌ను బయటకి వదలడానికి బదులుగా లోపలికి పీల్చుకున్నాను. దీంతో అది లోపలికి వెళ్లిపోయింది. అప్పట్లో ధైర్యం లేక జరిగిన విషయాన్ని అమ్మకు చెప్పలేదు’ అని మేరీ వివరించింది. మొదట్లో ఆ టిడ్లీవింక్ ముక్కు లోపలి నుంచి ఎక్కడికి పోయిందో అని మేరీ ఆశ్చర్యపోయిందట. కానీ దానితో పెద్దగా సమస్య లేకపోవడంతో, ఆ విషయాన్ని మర్చిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid-19 test, Newzealand, VIRAL NEWS