ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి అధిక బరువు. ఊబకాయం సమస్య ఉన్నవారు ఎలాగైనా బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గితే బాగానే ఉంటుంది. కానీ సర్జరీ ద్వారా వెయిట్ తగ్గేందుకు ప్రయత్నిస్తే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే సమస్య ఉంది. ఇందుకు ఉదాహరణ.. అమెరికా మిచిగాన్ కు చెందిన క్యాథీ బ్లైత్(33) అనే మహిళ. సర్జరీ ద్వారా ఏకంగా 57 కేజీలు బరువు తగ్గించుకుందామె. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఈ ఆపరేషన్ కారణంగా క్యాథీ ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సర్జరీ తరువాత తన దంతాలు ఊడిపోయాయని ఆమె వెల్లడించింది.
పెళుసుగా మారి ఊడిన దంతాలు..
2011లో తాను గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నానని చెబుతోంది క్యాథీ బ్లైత్. అనంతరం చాలా వరకు బరువు తగ్గానని చెప్పింది. కానీ బరువుతో తాను ఎన్నో కోల్పోయానని స్పష్టం చేసింది. ఈ శస్త్రచికిత్స తర్వాత తాను రోజూ మందులు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. "బైపాస్ కు ముందు వరకు నా దంతాలు చాలా సహజంగా ఉండేవి. నాకు 24 ఏళ్ల వరకు కూడా దంత సమస్యలు రాలేదు. కానీ సర్జరీ పూర్తయిన కొన్నేళ్ల తర్వాత దంతాలు పెళుసుగా, బలహీనంగా మారడం గమనించా. అంతేకాకుండా క్యావిటీ సమస్యతో దంతాలు విరిగిపోవడం ప్రారంభించాయి. గత 8 ఏళ్లుగా నా పళ్లు కాపాడుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు చేశా" అని క్యాథీ వాపోతోంది.
ఇప్పటికే రూట్ కెనాల్ చికిత్సలు, క్రౌన్స్, ఫిల్లింగ్స్ చేయించుకున్నా, అవి ఏవీ తన దంతాలను రక్షించలేదని పేర్కొంది. వేల డాలర్లు ఖర్చు చేసినప్పటికీ దంతాల రక్షణ చికిత్సలు ఆమెకు హామీ ఇవ్వలేదు. కాబట్టి మిగిలిన దంతాలను తీసివేసి వాటి స్థానంలో కట్టుడు పళ్లు ఉంచాలని 2020 డిసెంబరులో నిర్ణయించుకుంది. జనవరిలో కట్టుడు దంతాలను అమర్చుకుంది. ఇంకొన్ని సంవత్సరాల్లో ఇంప్లాంట్లు అమర్చుకోవాలని భావిస్తుంది.
దంతాలు ధరించే యువత ఇబ్బందిగా భావించే సమస్యను దూరం చేయడానికి ఆమె సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తోంది. వీటి ద్వారా అవగాహన కల్పిస్తోంది. "అన్ని వయస్సుల వారికి వేర్వేరు కారణాల వల్ల దంతాలు ఊడిపోతాయి. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించడానికి నా వంతు సహాయం చేయాలనుకుంటున్నా. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ నా దంతాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వైద్యులు ముందు గుర్తించలేదు" అని క్యాథీ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Life Style, VIRAL NEWS, Weight loss