Viral Video: ఈమె ఏంది సామీ ఇలా ఉంది.. మొన్న క్యాబ్ డ్రైవర్ .. ఇప్పుడు పొరుగింటి వాళ్లు..

Photo Credit : Twitter

Viral Video: ప్రియదర్శినికి సంబంధించిన మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో.. పొరిగింటివాళ్ళు తమ సొంత ఇంటి గోడలకు నలుపు రంగు వేసుకున్నారనే కారణంతో గొడవపడుతూ కనిపించింది.

  • Share this:
ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో కేసరి ఖేడా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రియదర్శిని అనే యువతి సృష్టించిన బీభత్సం గురించి తెలిసిందే. ఈమె సాదత్ అలీ సిద్ధిఖీ అనే క్యాబ్ డ్రైవర్‌ను నడిరోడ్డుపై పట్టుకుని చెంపదెబ్బలు కొట్టింది. ఆ దృశ్యాలు భారతదేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. జీబ్రా క్రాసింగ్ పై రోడ్డు దాటుతున్న తనని క్యాబ్ డ్రైవర్‌ సిద్ధిఖీ కారుతో ఢీకొట్టబోయాడని ఆమె చేతివాటం ప్రదర్శించింది. అయితే ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తరువాత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి యువతిదే తప్పని తేల్చారు. ఆమే ప్రమాదకర రీతిలో రద్దీగా ఉన్న రోడ్డుని దాటి తప్పు చేసిందని.. డ్రైవర్ తప్పేం లేదని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమెను అరెస్టు చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. ప్రియదర్శినికి సంబంధించిన మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో.. పొరిగింటివాళ్ళు తమ సొంత ఇంటి గోడలకు నలుపు రంగు వేసుకున్నారనే కారణంతో గొడవపడుతూ కనిపించింది. ఆమెకు సంబంధం లేకపోయినా సరే.. పొరుగింటి వారు తమ సొంత ఇంటి గోడకు వేసుకున్న నల్ల రంగును మార్చేయాలని వాగ్వివాదానికి దిగింది.

నలుపు రంగు గోడ "ఇంటర్నేషనల్ డ్రోన్‌లను" ఆకర్షిస్తుందని ఆమె ఆరోపించింది. దీనివల్ల పొరుగున నివసిస్తున్న ఇతరుల జీవితాలు ప్రమాదంలో పడతాయని గట్టిగా కేకలు వేసింది. దీంతో పోలీసులతో పాటు అక్కడ గుమిగూడిన స్థానికులు నవ్వాలో ఏడవాలో తెలియక జుట్టు పీక్కున్నారు.ఆమె ఎంతకీ ఆగకుండా అలానే వాగుతుంటే ఒక పోలీసు అధికారి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. పొరిగింటి వారికి అర్థమయ్యేలా చెప్తానని.. మీరు ఇంటికి వెళ్ళండని పరిస్థితిని శాంత పరచడానికి పోలీసు ప్రయత్నించారు. ఆమె మాత్రం వెనుకడుగు వేయలేదు.


పొరుగింటి వ్యక్తి తనని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా కూతురు అని పిలిచాడని.. అలా మాట్లాడొచ్చా? అని ఆమె అగ్గి మీద గుగ్గిలమైంది. తనని కర్రలతో కొడతానని బెదిరించాడని.. ఇతరులతో కూడా కొట్టిస్తానని అన్నాడని ఆమె ఆరోపించింది. అతనికి గుణపాఠం చెప్పాలని ఆమె పోలీసును డిమాండ్ చేసింది. తాను భారతదేశ యువత గురించి బాధపడుతున్నానని భారీ లెవెల్ లో డైలాగులు చెప్పింది.


ఈ వీడియో పాతది కాగా.. ఎప్పుడు జరిగిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈమెకు గొడవలు పెట్టుకోవడం తప్ప మరేతర పని లేదనుకుంటా అని నెటిజన్లు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. పాపం, ఈమె చేతికి చిక్కి క్యాబ్ డ్రైవర్ బలయ్యాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అమ్మాయిలను జైల్లో వేసి బుద్ధి వచ్చేంతవరకూ చితక్కొట్టాలని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published: