Viral Video: ఇదేందయ్యా ఇది.. ఇది నేను సూడలా.. పెళ్లి కూతురైతే ‘నవ్వాపుకుంటున్నావ్ కదా’ అన్నట్టే నవ్వుతోందిగా..

వీడియోలోని దృశ్యాలు

మహారాష్ట్రలో ఓ పెళ్లి కొడుకు ‘వర్క్ ఫ్రం వెడ్డింగ్’ చేస్తూ పెళ్లి పీటలపై ల్యాప్‌టాప్‌తో కుస్తీ పడుతున్న ఫొటోలు, వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఓ పేరున్న వెడ్డింగ్ సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఈ వీడియోను షేర్ చేసింది.

  • Share this:
    కరోనా వైరస్ పుణ్యమా అని మనిషి జీవన విధానమే మారిపోయింది. లేచిన దగ్గర్నుంచి లాక్‌డౌన్.. పక్కపక్కన కూర్చోవాలంటే పరేషాన్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇక.. ఉద్యోగుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో కూర్చుని ‘వర్క్ ఫ్రం హోం’ చేసేందుకు చాలానే అవస్థలు పడుతున్నారు. టెకీల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో.. బగ్ వచ్చిందని ఏ క్షణాన కాల్ వస్తుందోనని ల్యాప్‌టాప్‌ను పక్కలో పెట్టుకుని పడుకుంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎందరో. ఎక్కువ చెబుతున్నట్టు అనిపించొచ్చు గానీ పెళ్లి పీటలపై కూర్చుని కూడా ‘వర్క్ ఫ్రం హోం’ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయంటే నమ్మండి. నమ్మబుద్ధి కావడం లేదా. కానీ.. నమ్మక తప్పని నిజమిది. మహారాష్ట్రలో ఓ పెళ్లి కొడుకు ‘వర్క్ ఫ్రం వెడ్డింగ్’ చేస్తూ పెళ్లి పీటలపై ల్యాప్‌టాప్‌తో కుస్తీ పడుతున్న ఫొటోలు, వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఓ పేరున్న వెడ్డింగ్ సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఈ వీడియోను షేర్ చేసింది.

    పాపం.. పెళ్లికొచ్చిన బంధువులు, పెళ్లి జరిపించాల్సిన పురోహితుడు ఆ బిజీ పెళ్లి కొడుకు తన షెడ్యూల్‌లో పెళ్లికి ఎప్పుడు సమయం కేటాయిస్తాడోనని ఆశగా ఎదురుచూస్తున్న ఆ వీడియో నవ్వులు పూయిస్తోంది. ఆ పెళ్లి కుమార్తె అయితే తనకు కాబోయే వాడి తిప్పలు చూసి నవ్వులే నవ్వులు. ఎట్టకేలకు కొంతసేపటికి ఆ పెళ్లి కొడుకు తన ల్యాప్‌టాప్‌ను ఇచ్చేసి పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ వీడియోపై నెట్‌లో పంచ్‌లు, సెటైర్లు మాములుగా పేలడం లేదు. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏంటంటే.. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ పెళ్లికెళ్లిన కొందరు అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చారు.



    అందరూ అనుకున్నట్టు ఆ పెళ్లి కొడుకు ల్యాప్‌టాప్ తీసుకుని చేస్తోంది వర్క్ ఫ్రం హోమో, వర్క్ ఫ్రం వెడ్డింగో కాదట. తన పెళ్లిని.. పెళ్లికి హాజరు కాలేకపోయిన సన్నిహితులకు వీడియో కాల్‌లో చూపించేందుకు ల్యాప్‌టాప్ తీసుకుని సెట్ చేస్తున్నాడట. అయితే.. నిజంగా ఆ వీడియో వెనకున్న అసలు నిజం ఏంటో తెలియదు గానీ.. ఆ వీడియో నెట్‌లో వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కొందరు నెటిజన్లు అయితే.. దుర్మార్గమైన ఆఫీస్ కల్చర్‌కు ఇది నిదర్శనమని, మరికొందరైతే.. అతనిని ఇంత టార్చర్ చేస్తున్నందుకు అతని మేనేజర్‌కు ఉద్యోగం ఊడిపోవాలని, భార్య విడాకులివ్వాలని ఫన్నీగా శాపనార్థాలు కూడా పెట్టారు. కారణమేదేనా.. ఇప్పుడీ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.
    Published by:Sambasiva Reddy
    First published: