Fancy Number Price: కారు నెంబర్‌ను కూడా స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు చాలామంది. దీని కోసం లక్షల్లో ఖర్చు చేసి మరీ తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకుంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఫ్యాన్సీ నంబర్లకు పెరిగిన డిమాండే దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు. ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ రవాణా శాఖ 2014 నుంయి ఆన్లైన్లో ఈ–వేలం నిర్వహిస్తుంది. ఆన్లైన్లో నిర్వహించే ఈ–వేలం ద్వారా ఆసక్తిగల కొనుగోలుదారులు తమ లక్కీ నంబర్‌ను దక్కించుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం చాలామంది ఫ్యాన్సీ ప్రియులు తమ లక్కీ నంబర్‌ను దక్కించుకునేందుకు పోటాపోటీగా లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఢిల్లీ రవాణా శాఖ సెప్టెంబరులో చేపట్టిన ఈ–వేలంలో, 0009 సిరీస్ గల రిజిస్ట్రేషన్ నంబర్10.1 లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఇదే సిరీస్ జూలైలో చేపట్టిన ఈ–బిడ్డింగ్‌లో ఒక వ్యక్తి 7.1 లక్షలకు ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నాడు.
ఈ–బిడ్డింగ్‌లో 0003, 007 వంటి ఇతర టాప్ సిరీస్ నంబర్లు రూ.3.1 లక్షలకు కోట్ చేయబడ్డాయని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినప్పటికీ ఆటోమొబైల్ మాత్రం పరిశ్రమ పురోగతిని సాధించింది. లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణ స్తంభించినందున ప్రజలు తమ స్వంత వాహనాల్లో ప్రయాణించేందుకే మొగ్గుచూపుతున్నారు.
ఈ కారణంగానే మేతో పోలిస్తే జూలైలో కార్ల అమ్మకాలు ఐదు రెట్లు పెరిగాయి. దీంతో గత కొన్ని నెలలుగా నూతన వాహన కొనుగోలుదారుల కొన్న వారి నుంచి ఫ్యాన్సీ నెంబర్లకు అనూహ్య స్పందన వస్తుంది. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుంది. కాగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా మార్చిలో మూసివేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏప్రిల్‌లో క్రమంగా తెరుచుకున్నాయి.
దీంతో ఏప్రిల్ నెల నుంచి ఫ్యాన్సీ నంబర్లకు ఈ-–వేలాన్ని తిరిగి ప్రారంభించాయి. ఏప్రిల్ నెలలో 9000 సిరీస్ నెంబర్‌ను వేలం వేయగా రూ. 1.5 లక్షలు కోట్ చేసింది. అదే మే నెలలో ఐదు ఫాన్సీ నంబర్లను వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి రూ.9.3 లక్షల ఆదాయం సమకూరింది. జూన్ నెలలో వేలం ద్వారా మొత్తం రూ. 21.7 లక్షలు సమకూరగా, జూలైలో వసూళ్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు- ఫాన్సీ నంబర్లను ఈ–వేలంలో విక్రయించడం ద్వారా ఢిల్లీ రవాణా శాఖకు రూ .99 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. అన్‌లాక్‌లో భాగంగా దేశంలో క్రమంగా అన్ని వ్యాపారాలను పునరుద్ధరిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతుంది.