Home /News /trending /

USERS POST SARCASTIC COMMENTS ON AMAZON FOR SELLERS POST CHALK SLATE PENCILS FOR EATING SU

Slate Pencils on Amazon: అమెజాన్‌లో తప్పుడు సమాచారంతో బలపాలను అమ్ముతున్న కంపెనీలు.. మండిపడుతున్న వినియోగదారులు..

బలపాలు (Image Credit- Amazon)

బలపాలు (Image Credit- Amazon)

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, పేటీఎం మాల్ వంటి సంస్థలు మారుమూల ప్రాంతాలకు సైతం వస్తువులను డెలివరీ చేస్తున్నాయి.

ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్ల ధరలు తగ్గిన తరువాత ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల వ్యాపార పరిధి చాలా వరకు పెరిగింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, పేటీఎం మాల్ వంటి సంస్థలు మారుమూల ప్రాంతాలకు సైతం వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. ఈ క్రమంలో అత్యవసరమైన వస్తువులతో పాటు చెడు అలవాట్లను ప్రోత్సహించే ఉత్పత్తులు కూడా ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో సెల్లర్స్‌గా నమోదవుతున్నాయి. తాజాగా అమెజాన్‌లో అమ్మకానికి నమోదు చేసుకున్న ఉత్పత్తులు ఈటింగ్ డిజార్డర్ సమస్యలను పెంచేవిగా ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అమెజాన్‌లో పలకలపై రాసేందుకు వాడే బలపాలను కంపెనీలు తప్పుడు సమాచారంతో అమ్ముతున్నాయి. వీటిని తినడానికి ప్రత్యేకంగా రూపొందించామంటూ వివరణలో (డిస్క్రిప్షన్‌) రాస్తూ మార్కెటింగ్ చేసుకుంటున్నాయి.

అమెజాన్‌లో అమ్మకానికి ఉంచిన చాక్ పీసులు, స్లేట్ పెన్సిల్స్ (బలపాలు) పలకలపై రాయడంతో పాటు తినడానికి కూడా ఉపయోగించవచ్చని కంపెనీలు పేర్కొంటున్నాయి. సాధారణంగా కొంతమంది పిల్లలు చాక్‌పీస్, బలపాలను తింటారు. ఇది ఒక రకమైన ఈటింగ్ డిజార్డర్. వైద్య పరిభాషలో దీన్ని పికా (pica) అంటారు. ఒక వయసుకు వచ్చిన తరువాత పిల్లలు ఈ అలవాట్లను మానేస్తారు. కానీ అమెజాన్‌లో తప్పుడు వివరణతో బలపాలు, చాక్‌పీస్‌లను అమ్ముతున్న కంపెనీలు.. పికా, ఇతర ఈటింగ్ డిజార్డర్ సమస్యలను పెంచేవిగా ఉన్నాయని డాక్టర్లు విమర్శిస్తున్నారు.

* తప్పుడు వివరణతో వ్యాపారం
చాక్‌పీస్‌లు, బలపాలను తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదు. ఇది ఆరోగ్యానికి ఎలాంటి హాని చేస్తుందో తెలియదు. అందువల్ల ఇవి ప్రమాదకరమైన వస్తువుల జాబితాలో ఉండవు. దీన్ని బలపాలు తయారుచేసే కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయి. తాము బలపాలను తినేందుకు కూడా తయారు చేస్తున్నామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అమెజాన్‌లో నమోదు చేసుకున్న చాలా కంపెనీలు తమ ఉత్పత్తులకు సంబంధించిన వివరణలో ఇవి తినడానికి ఉపయోగించవచ్చని తప్పకుండా పేర్కొంటున్నాయి.

* తినడానికి పనికొస్తాయని ప్రచారం
ఒక సంస్థ.. తాము సహజంగా లభించే పదార్థాలతో ప్రత్యేక పద్ధతిలో బలపాలను తయారు చేశామని డిస్క్రిప్షన్‌లో రాసుకుంది. ‘ఒక్కో డబ్బాలో వంద బలపాలు ఉంటాయి. ప్యాకింగ్‌, రవాణా వల్ల ఇవి విరిగిపోవచ్చు. కానీ సుద్ధ ముక్కల నాణ్యత మాత్రం దెబ్బతినదు. ఇవి రాయడానికి బాగా పనికొస్తాయి. వీటిని తినొచ్చు కూడా. ఈ బలపాలకు మట్టి ఫ్లేవర్ కూడా ఉంటుంది. దీనికి మేము గ్యారంటీ ఇస్తున్నాం’ అని డిస్క్రిప్షన్‌లో రాసింది.

* అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కస్టమర్లు
సహజంగా లభించే సున్నపురాయితో బలపాలను తయారు చేస్తున్నామని చాలా కంపెనీలు రాస్తున్నాయి. అమెజాన్‌లో స్లేట్ పెన్సిల్స్ అని టైప్ చేస్తే.. కంపెనీల వింత వివరణలు కనిపిస్తాయి. వీటికి చాలామంది అమెజాన్ యూజర్లు హాస్యాస్పదంగా కామెంట్లు పెడుతున్నారు. చాలా రుచిగా ఉన్నాయి. మేమంతా రోజుకు ఒక్క బలపం తిని కడుపు నింపుకుంటున్నాం అని ఒక యూజర్ రాస్తే.. ఇందులో మసాలా కూడా కలిపి తయారు చేస్తే పనీర్ బటర్ మసాలా కంటే ఈ ఫేమస్ అవుతుంది అంటూ మరో యూజర్, ఇలాంటి చెత్త డిస్క్రిప్షన్లు తీసేయండి. మీరు జనాలను మిస్ గైడ్ చేస్తున్నారు అంటూ ఇంకో యూజర్ ఇలాంటి వారిని తిడుతూ.. వ్యంగ్య బాణాలు విసురుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంగా ఉన్న అమెజాన్‌.. ఇలాంటి తప్పుడు వివరణలను ఎలా ఆమోదిస్తోందని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీటిని అమ్మకాల జాబితా నుంచి తొలగించాలని నెటిజన్లు కోరుతున్నారు.

* పికా సమస్య ప్రమాదకరమా?
పికా అనే ఈటింగ్ డిజార్డర్ ఉన్నవారికి బలపాలను తినాలనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు ఆహారంలో తీసుకోని పదార్థాలను, వస్తువులను తింటారు. ఈ సమస్య తీవ్రంగా ఉన్న వ్యక్తులు సబ్బులు, కాగితాలు, వెంట్రుకలు, దారాలు, ఇతర వస్తువులను కూడా తింటారు. సాధారణంగా పిల్లలు, గర్భిణుల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తాత్కాలిక సమస్య కావడం వల్ల భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు సూచిస్తారు. సుద్ధముక్కలను కాల్షియం కార్బోనేట్ అనే పదార్థంతో తయారు చేస్తారు. ఇది విషపదార్థం కాదు. కానీ దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యాలు ఎదురవుతాయి.

ఈ అలవాటు ఉన్న వారికి కడుపునొప్పి రావడం, పేగుల్లో చెడు బ్యాక్టీరియా చేరడం, అల్సర్లు, పేగుల్లో అడ్డంకులు వంటి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల అమెజాన్‌లో బలపాలను అమ్ముతున్న కంపెనీలను సెల్లర్స్ జాబితా నుంచి తొలగించాలని రివ్యూలు, కామెంట్ల విభాగంలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లేదంటే ఆ సంస్థలు అమెజాన్‌లో రాసిన వివరణల్లోని తప్పుడు సమాచారాన్ని తొలగించాలని కోరుతున్నారు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Amazon, E-commerce

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు