శాంతి,సమయం పాటించండి...భారత్-పాక్‌కు ఐరాస, అమెరికా వినతి

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్‌ను భారత్ రద్దు చేయడంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని అమెరికా, ఐక్యరాజ్యసమితి కోరాయి.

news18-telugu
Updated: August 6, 2019, 8:26 AM IST
శాంతి,సమయం పాటించండి...భారత్-పాక్‌కు ఐరాస, అమెరికా వినతి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • Share this:
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్ముకశ్మీర్, లడఖ్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు శాంతి సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసింది. దక్షిణాసియాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల పట్ల ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో ఆందోళన చెందుతున్నట్లు ఆయన తరఫు అధికార ప్రతినిధి స్టీఫన్ మీడియాకు తెలిపారు. అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరుతున్నట్లు చెప్పారు. కశ్మీర్‌లో నిషేదాజ్ఞల గురించి కూడా తమకు తెలుసని వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌లో నెలకొంటున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి ఇరు దేశాలు శాంతి, సంయమనం పాటించాలని కోరుతున్నట్లు అమెరికా విదేశాంగ కార్యాలయ అధికారప్రతినిధి మోర్గన్ చెప్పారు.

కాగా 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ పీ5 దేశాల దౌత్యవేత్తలకు తన నిర్ణయాన్ని తెలిపింది. పీ5 దేశాల్లో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఉన్నాయి. జమ్ముకశ్మీర్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు పూర్తిగా అంతర్గత వ్యవహారమని భారత్ తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గన్ వెల్లడించారు. అయితే కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన చెందుతున్నట్లు వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా కశ్మీర్‌పై చర్చించేందుకు పాకిస్థాన్ పార్లమెంటు ఉభయ సభలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశంకానున్నాయి. పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరుస్తూ ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఆదేశాలు జారీ చేశారు. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు జమ్ముకశ్మీర్, లడఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు విభజిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చించనున్నారు.
First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading