స్నో బోర్డింగ్ మంచి మజా ఇస్తుంది. మంచుపై కొండప్రాంతాల్లో దూసుకెళుతుంటే ఆ కిక్కే వేరు అన్నట్టు ఉంటుంది. అయితే మంచులో ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఓ స్నోబోర్డర్కు ఎదురైంది. హఠాత్తుగా ఓ అవలాంచె (మంచు చరియలు) కూలిపోయింది. దీంతో అతడు ఆ మంచులో కొట్టుకుపోయాడు. అయితే ప్రాణాలను దక్కించుకోవడమే కాదు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. కొలరాడోలోని నోనేమ్ పార్క్‌లో మౌరిస్ కెర్విన్ అనే స్నోబోర్డర్కు ఈ భయానక ఘటనకు గురయ్యాడు.
“ఇంత పెద్దదా (అవలాంచె) అని నేను భయపడ్డా. అయితే జీవించి ఉన్నానని, తీవ్ర గాయాలు కాలేదని సంతోషిస్తున్నా. నా ప్రాణం పోయేలా, నన్ను పూర్తిగా కప్పేసే విధంగా మంచు దూసుకొచ్చింది. అవలాంచె పరిమాణం అంత పెద్దగా ఉంది. చాలా తీవ్రంగా దూసుకొచ్చింది” అని కెర్విన్ తెలిపాడు.
మంచు లాగేస్తున్న సమయంలో అతడు బ్యాగ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. ఎయిర్‌బ్యాగ్ వల్ల కెర్విన్ మంచులో కూరుకుపోలేదు. పైనే ఉన్నాడు.
“నా వెనుక చేతిలో ఉన్న కెమెరా జారిపోయింది. వెంటనే ఎయిర్ బ్యాగ్ లాగాను. మంచుపైనే ఉండేలా అది నాకు సహకరించింది. మంచుపై కాళ్లను ఉంచగలిగాను. మంచులో కూరుకుపోకుండా పైనే కొట్టుకుపోయాను” అని కెర్విన్ చెప్పాడు. ఈ విషయం తనకు నమ్మశక్యం కావడం లేదని, ఇప్పటికీ తన కళ్ల ముందు అది తిరుగుతూనే ఉందని అన్నాడు. తాను ఇప్పుడు సురక్షితంగా, బాగా ఉన్నట్టు చెప్పాడు.
ఆ రోజు ఇద్దరు అవలాంచెలో చిక్కుకున్నారని, వారిలో కెర్విన్ ఒకరని సీఏఐసీ డెరెక్టర్ ఎథన్ గ్రీన్ తెలిపారు.
కాగా ఎన్నోరికార్డులను బద్దలుకొట్టిన బహుబలి సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది. కొండపై నుంచి దట్టమైన మంచు జారి మీదకు వస్తుండగా బాహుబలి (ప్రభాస్), అవంతిక (తమన్నా) తప్పించుకునే సీన్ అద్భుతంగా వచ్చింది.