అక్కడ ఏలియన్స్ ఉన్నారా... ప్రతీ 16 రోజులకు ఓసారి భూమికి వస్తున్న రేడియో సిగ్నల్

Aliens and Radio Signal : మన సౌర కుటుంబం అవతల కొన్ని కోట్ల గ్రహాలు, నక్షత్ర మండలాలూ ఉన్నాయి. వాటిలో ఎక్కడో ఒక చోట గ్రహాంతర వాసులు ఉండి ఉండొచ్చు. తాజాగా వస్తున్న రేడియో సిగ్నల్స్‌ని ఎవరైనా పంపిస్తున్నారా?

news18-telugu
Updated: February 15, 2020, 7:14 AM IST
అక్కడ ఏలియన్స్ ఉన్నారా... ప్రతీ 16 రోజులకు ఓసారి భూమికి వస్తున్న రేడియో సిగ్నల్
అక్కడ ఏలియన్స్ ఉన్నారా... ప్రతీ 16 రోజులకు ఓసారి భూమికి వస్తున్న రేడియో సిగ్నల్ (Photo: CHIME Experiment Gallery)
  • Share this:
Aliens and Radio Signal : ఈ వారం ప్రారంభంలో... కొంత మంది సైంటిస్టుల గ్రూపు... అంతరిక్షం నుంచీ వస్తున్న రేడియో సిగ్నల్ ఎటు నుంచీ, ఎక్కడి నుంచీ వస్తోందో తెలుసుకుంది. ఇది వరకూ ఈ రేడియో సిగ్నల్స్ ఎప్పుడు బడితే అప్పుడే వస్తున్నాయని అనుకునేవారు. కానీ తాజా పరిశోధనల్లో అత్యంత ఆసక్తికర విషయం తెలిసింది. ఈ రేడియో సిగ్నల్స్ ఓ పద్ధతి ప్రకారం, టైమ్ ప్రకారం, కచ్చితమైన గ్యాప్ తీసుకొని మరీ వస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనలు ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ తాజా పరిశోధనలో... రేడియో సిగ్నల్స్ పద్ధతి ప్రకారం వస్తున్నాయంటే... అక్కడెక్కడో... వాటిని ఎవరో టైమ్ ప్రకారం రిలీజ్ చేస్తున్నారనీ... అక్కడ గ్రహాంతర వాసులు (ఏలియన్స్ - Aliens or Extraterrestrial Life) ఉండి ఉండొచ్చనే అంచనాలు, అనుమానాలు, ఆశలు కలుగుతున్నాయి.

వాస్తవంగా మాట్లాడుకుందాం. ఇలాంటి రేడియో సిగ్నల్స్ రావడానికి అనేక కారణాలుంటాయి. ఎక్కువ మంది వీటిని ఫాస్ట్ రేడియో బరస్ట్స్ (FRBs) అంటున్నారు. ఎందుకంటే ఈ సిగ్నల్స్... చాలా చిన్న తరంగాలుగా ఉన్నాయి. ఎంత చిన్నవంటే... ఇవి కొన్ని మిల్లీ సెకండ్ల పొడవు మాత్రమే ఉన్నాయి. ఇవి ప్రకృతిలో చెదురుమదురుగా ఉంటాయి. కెనడాలోని హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా... సైంటిస్టులు ఈ FRBలను గమనిస్తున్నారు. 2018 సెప్టెంబర్ 16 నుంచీ 2019 అక్టోబర్ 30 వరకూ వీటిని బాగా ఎక్కువగా పరిశీలించారు.

ఈ FRBల పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. మొదట ఇవి నాలుగు రోజులపాటూ... ప్రతీ గంటకు లేదా రెండు గంటలకు ఓసారి అంతరిక్షం నుంచీ భూమికి వస్తున్నాయి. ఆ తర్వాత 12 రోజుల పాటూ ఏ సిగ్నల్సూ రావట్లేదు. ఇలా 16.35 రోజులు పూర్తవుతున్నాయి. ఆ తర్వాత మళ్లీ ప్రతీ గంటకు లేదా రెండు గంటలకు ఓసారి అంతరిక్షం నుంచీ సిగ్నల్స్ భూమికి వస్తున్నాయి. ఇలా ఏడాది పాటూ జరగడంతో ఈ కొత్త విషయాలు తెలుసుకొని పరిశోధకులు ఖుషీ అయిపోయారు. ఆ తర్వాత ఈ సిగ్నల్స్‌కి FRB 180916 అనే పేరు పెట్టారు. ఇలాంటివి ఇప్పటివరకూ 8 రకాలవి కనిపెట్టారు. మరి ఇవి ఎక్కడి నుంచీ వస్తున్నాయో తెలుసా... మన భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల అవతల ఉన్న... గుండ్రంగా... కొత్తగా ఏర్పడుతున్న నక్షత్ర మండలం (GALAXY) నుంచీ అవి వస్తున్నట్లుగా సైంటిస్టులు నమ్ముతున్నారు.

ఇంతకీ ఓ పద్ధతి ప్రకారం... టైమ్ ప్రకారం ఈ సిగ్నల్స్ ఎందుకు వస్తున్నాయన్నది తేలాల్సిన అంశం. ఇదో సవాలు. ఎంతో ఇంట్రస్టింగ్ విషయం కూడా. ఇది తెలుసుకుంటే... అక్కడ ఏలియన్స్ ఉన్నారా అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అలాగే గెలాక్సీకి సంబంధించిన విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఈ సిగ్నల్స్ పద్ధతి లేకుండా వచ్చి ఉంటే... ఏ నక్షత్రాల నుంచో వస్తున్నాయని అనుకోవడానికి వీలుండేది. కానీ... టైమ్ ప్రకారం, పద్ధతి ప్రకారం వస్తుండటం వల్ల అక్కడ గ్రహాంతర వాసులు ఉన్నారేమో అన్న ఆశలు కలుగుతున్నాయి సైంటిస్టులకు. భవిష్యత్తే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది.
Published by: Krishna Kumar N
First published: February 15, 2020, 7:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading