కాలువలో కారు పడటం.. అలాంటి ప్రమాదాల కారణంగా అందులోని వ్యక్తులు చనిపోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అందుకే కాలువలో కారు కనిపిస్తే.. అందులో ఎవరైనా ఉన్నారా ? కాలువలో ఎవరైనా గల్లంతయ్యారా ? అని పోలీసులు తీరా తీస్తుంటారు. అయితే కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో కావేది నదిలో కనిపించిన ఓ కారు స్థానికులను ఆందోళనకు గురి చేసింది. కావేరి నది మధ్యలో ఎర్రటి రంగులో ఉన్న బీఎండబ్ల్యూ కారును చూసి గ్రామస్తులు, మత్స్యకారులు, బాటసారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిందనే అనుమానంతో, వారు వెంటనే పోలీసులను సమాచారం అందించారు. అంతేకాదు.. కొందరు స్థానికులు నదిలోకి దిగి కారులో లోపల ఎవరైనా చిక్కుకుపోయారేమో అని తనిఖీ చేశారు.
అయితే కారును తనిఖీ చేయగా.. అందులో ఎవరూ లేరు. కారును పోలీసులు క్రేన్ సాయంతో బయటకు తీశారు. కారు నంబర్ ఆధారంగా వివరాలను గుర్తించి ఆ కారు బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్లో నివసిస్తున్న వ్యక్తికి చెందినదని నిర్ధారించారు. యజమాని ఆచూకీ తెలుసుకుని ఆ వ్యక్తి శ్రీరంగపట్నం తీసుకొచ్చి విచారించిన పోలీసులకు ఊహించని విషయాలు తెలిశాయి. ఆ వ్యక్తి కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్నాడని.. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడని పోలీసులు గుర్తించారు.
కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందని పోలీసులు ఆ వ్యక్తని శ్రీరంగపట్నం తీసుకొచ్చి విచారించారు. బాధితుడు ఏదైనా నేరం చేసే క్రమంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా ? ఆ కారులో నిజంగానే ఎవరూ లేరా ? అని ఆరా తీశారు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఏమైనా మృతదేహాలు లభించాయా ? అనేక విషయాలపై కూడా దృషట్ పెట్టారు. అయితే బాధితుడి నుంచి ఏ రకమైన సమాధానాలు రాలేదు.
కొద్దిరోజుల క్రితం తన తల్లి చనిపోవడంతో ఆ వ్యక్తి మానసికంగా కుంగిపోయాడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని తన ఇంటికి తిరిగి వెళ్ళే ముందు కారును నదిలో వదిలేశాడని నిర్ధారణకు వచ్చాడు. తల్లి మరణాన్ని తట్టుకోలేక అతడు ఈ రకమైన చర్యలకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు.. కారును బెంగళూరుకు తరలించారు. బాధితుడి కుటుంబసభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ వ్యక్తిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా తిరిగి పంపించారు పోలీసులు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.