యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. చిన్న చిన్న తప్పులకు కూడా అక్కడ తీవ్రమైన శిక్షలు అమల్లో ఉన్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారణమైతే వేరే చెప్పాలా.. మరణ శిక్షే గతి. అయితే కేరళకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, ఇదే కారణంతో మరణ శిక్ష విధించింది యూఏఈ సుప్రీంకోర్టు. తాజాగా అతడు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. అంతేకాదు త్వరలో కుటుంబాన్ని కలుసుకోవడానికి స్వదేశం రానున్నాడు. ఒక ఎన్‌ఆర్‌ఐ వ్యాపార వేత్త అతడికి శిక్ష పడకుండా రక్షించారు?. ఆయన ఏం సాయం చేశారు? ఆ డ్రైవర్ ఎలా బయటకొచ్చారు?
వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన బెక్స్ కృష్ణన్ అనే వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అతడికి యూఏఈలో డ్రైవర్‌గా ఉద్యోగం దొరికింది. అయితే 2012 సెప్టెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో, కొంత మంది కుర్రాళ్లపైకి అతడి వాహనం దూసుకెళ్లాడు. ఈ ఘటనలో సుడాన్‌కు చెందిన ఓ కుర్రాడు చనిపోయాడు. యూఏఈ సుప్రీం కోర్టు అతడిని దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. అప్పటి నుంచి కృష్ణన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు అతడిని విడుదల చేయించడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు. సుడాన్‌లో ఉంటున్న బాధితుని కుటుంబం ఒప్పుకుంటే కృష్ణన్‌కు క్షమాభిక్ష దొరికే అవకాశముందని తెలుసకొని పలుమార్లు ప్రయత్నించినా, వాళ్లు ఒప్పుకోలేదు.
సాయం చేసిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త..
దిక్కుతోచని స్థితిలో కృష్ణన్ కుటుంబ సభ్యులు ప్రవాస భారతీయుడు, లులూ గ్రూప్ ఛైర్మెన్ అయిన ఎంఏ యూసఫ్ అలీ వద్దకు వెళ్లారు. కేసు వివరాలను పరిశిలీంచి తన వాటాదారులతో సంప్రదింపులు జరిపారు. చివరకు 2021 జనవరిలో కృష్ణన్‌కు క్షమాభిక్ష ఇచ్చేందుకు బాధిత కుటుంబం ఒప్పుకుంది. ఇందుకు పరిహారంగా 500,00ల దిర్హామ్‌లు(భారత కరెన్సీలో దాదాపు రూ.కోటి) చెల్లించాలని షరతు పెట్టింది. దీంతో ఆ సొమ్మును లులూ గ్రూప్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ చెల్లించారు. ఈ విషయాన్ని లులూ గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది నాకు పునర్జన్మే: కృష్ణన్..
ఎట్టకేలకు గురువారం నాడు అబుదాబిలోని అల్ వత్బా జైలు నుంచి కృష్ణన్ విడుదలయ్యాడు. భారత రాయబార కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యాడు. "ఇది నాకు నిజంగా పునర్జన్మే. నేను బయట ప్రపంచాన్ని చూస్తాననే నమ్మకాన్ని కోల్పోయా. యూసుఫ్ అలీని ఓ సారి కలవాలి. నా కుటుంబాన్ని చూసేముందు ఆయనకు ధన్యవాదాలు తెలిపాలి" అని చెప్పాడు.
కృష్ణన్ విడుదల కావడం పట్ల యూసుఫ్ అలీ స్పందించారు. అతడు విడుదలైనందుకు ఆనందం వ్యక్తం చేశారు. దూరదృష్టి కలిగిన యూఏఈ పాలకుల దయకు కృష్ణన్ పాత్రుడవుతాడని తెలిపారు. అతడు ఇకపై సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరారు. అబుదాబికి చెందిన లులూ గ్రూప్.. హైపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ను కలిగి ఉంది. మిడిల్ ఈస్ట్, ఉత్తరాఫ్రికా ప్రాంతంలో అగ్రశ్రేణి రిటైర్లలో ఈ కంపెనీ కూడా ఒకటి.
కృష్ణన్ విడుదలకు సంబంధించిన అన్ని చట్టపరమైన ప్రక్రియలు గురువారంతో పూర్తయ్యాయి. తొమ్మిదేళ్ల జైలు వేదనకు స్వస్తి పలికి త్వరలోనే అతడు కుటుంబానికి కలవడానికి కేరళలోని తన స్వగ్రామానికి రానున్నాడు.
Keywords
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Crime news, NRI, UAE