Treasure: ఇసుకలో దొరికిన నాణెం విలువ రూ.2కోట్లు.. అసలు దాని స్పెషల్ ఏమిటంటే..

ఇసుకలో దొరికిన నాణెం విలువ రూ.2కోట్లు..

లక్ష్మీ కటాక్షం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. నిన్నటి వరకు పేదవాడిగా ఉన్న వ్యక్తి ఈరోజు కోటీశ్వరుడు కావచ్చు.

  • Share this:
లక్ష్మీ కటాక్షం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. నిన్నటి వరకు పేదవాడిగా ఉన్న వ్యక్తి ఈరోజు కోటీశ్వరుడు కావచ్చు. నిజానికి అలాంటి అదృష్టవంతులు ఎందరో ఉన్నారు. అయితే ఆ అదృష్టవంతుల జాబితాలో ఇప్పుడు ఓ ఇంగ్లాండ్ ట్రెజర్ హంటర్ చేరిపోయాడు. ఇతడు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని విల్ట్‌షైర్, హాంప్‌షైర్ సరిహద్దులో మెటల్ డిటెక్టర్ పట్టుకొని పిచ్చోడిలా ఎనిమిదేళ్లు నిధి కోసం వెతికాడు. చివరికి అతడికి ఓ పురాతన బంగారు నాణెం దొరికింది. ఇప్పుడు అదే అతడికి రూ.2 కోట్లు తెచ్చిపెట్టబోతోంది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

వివరాల్లోకి వెళితే.. 2020 మార్చిలో ఒక ట్రెజర్ హంటర్ విల్ట్‌షైర్, హాంప్‌షైర్ సరిహద్దున ఉన్న వెస్ట్ డీన్ గ్రామానికి వెళ్ళాడు. అక్కడే మైదానంలో మెటల్ డిటెక్టర్‌తో శోధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మెటల్ డిటెక్టర్ నుంచి ఒక ఇండికేటర్ సౌండ్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సదరు వేటగాడు అదే ప్రాంతంలో త్రవ్వాడు. అక్కడ అతడికి ఒక అరుదైన ఆంగ్లో-సాక్సన్ నాణెం దొరికింది. దాన్ని చూసి ఒక షర్ట్ బటన్ అనుకున్నాడు. ఒక చొక్కా గుండీకి గోల్డ్ పూతపూశారేమో అనుకున్నాడు. కానీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అది ఒక పురాతన బంగారు నాణెం అని తెలుసుకున్నాడు.

ఆ గోల్డ్ కాయిన్‌ని జూన్ 2021లో విశ్లేషించారు. తరువాత దాన్ని "అధిక స్వచ్ఛత గల బంగారం"తో తయారు చేశారని గుర్తించారు. 4.82 గ్రాముల బరువు గల ఈ గోల్డ్ కాయిన్ 802-839 మధ్య కాలంలో వెస్ట్ సాక్సన్స్ రాజు ఎగ్‌బెర్ట్ పరిపాలనలో కూరుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై కింగ్ ఎగ్‌బెర్ట్ పేరు కూడా ముద్రించి ఉంది. కాయిన్ మధ్యలో సాక్సన్స్ అని రాసి ఉంది. ఇప్పుడు దొరికిన గోల్డ్ కాయిన్.. త్వరలోనే జరగనున్న కాయిన్ల వేలంపాటలో £200,000 (2లక్షల పౌండ్ల) వరకు పలకవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా అరుదైనది. ఇటువంటి గోల్డ్ కాయిన్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చాలా తక్కువగా ఉన్నాయట. అయితే సదరు నిధి వేటగాడి వివరాలు మాత్రం బయటకు రాలేదు.

కాగా, కాయిన్స్ వేలం సెప్టెంబర్ 8న జరగనుంది. డిక్స్ నూనన్ వెబ్ వేలం నిర్వహకులు నాణేలను వేలం వేయనున్నారు. ఈ వేలం సంస్థలో కాయిన్ డిపార్ట్‌మెంట్ హెడ్ గా పీక్స్ ప్రెస్టన్-మోర్లీ పని చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఎగ్‌బెర్ట్ రాజు బంగారు నాణేలు ఉన్నట్లు 2020లో కనుగొన్నంత వరకూ ఎవరికీ తెలియదని చెప్పారు. ఇప్పుడు దొరికిన బంగారు నాణెం అప్పట్లో 360 గోధుమ రొట్టెలకు సమానమని ఆయన అన్నారు. తమకు తెలిసినంతవరకూ 630- 1257 మధ్యకాలంలో ఇంగ్లాండ్ భూమిలో మొత్తం 8 గోల్డ్ కాయిన్స్ కూరుకుపోయాయని చెప్పారు. ప్రస్తుతం వాటిలో 7 కాయిన్స్ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయని తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published: