ఏడాది కిందటి రికార్డులను తిరగరాస్తూ కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు మృగ్యం అవుతున్నాయి. ప్రధానంగా విమాన ప్రయాణాలైతే పీడకలలా మారాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ రాక తర్వాత వైరస్ వ్యాప్తి మళ్లీ తిరగబెట్టడం, రోజువారీ కొత్త కేసులు లక్షల్లో వస్తుండటంతో వేల కొద్దీ విమాన సర్వీసులు ఆకస్మికంగా రద్దయిపోయాయి. పైలట్లు, సిబ్బంది సైతం కరోనా బారిన పడుతుండటంతో సర్వీసులు నడపలేమంటూ విమానయాన సంస్థలు చేతులెత్తేశాయి. దీంతో గ్లోబల్ గా లక్షల మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. పలు విమానాశ్రయాల్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో రోజువారీ కొత్త కేసులు 2లక్షలకు, యూరప్ దేశాల్లో 1లక్షకు పైగా నమోదవుతుండటంతో గడిచిన మూడు రోజుల్లోనే సుమారు 6500 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వివరాలివి..
కొవిడ్ మహమ్మారి మళ్లీ ప్రళయతాండవం చేస్తుండటంతో ఏడాదిన్నర కిందటి పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. ఏడాదిలో అత్యధిక ప్రయాణాలు జరిగే క్రిస్మస్ సీజన్ లో వేలకొద్దీ విమానలు అర్ధాంతరంగా రద్దయిపోతుండటంతో లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైట్ అవే రిపోర్ట్ ప్రకారం ఒక్క సోమవారం నాడే ప్రపంచవ్యాప్తంగా 2,500 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందులో 1000 సర్వీసులు అమెరికాకు చెందినవే కావడం గమనార్హం. రద్దయిన వెయ్యి సర్వీసులు కాకుండా అమెరికాలో మరో 9వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనంతటికీ కరోనానే కారణం.
అమెరికా, యూరప్ దేశాల్లో కొంత కాలంగా కొవిడ్ కేసులు పెరుగుతూ వచ్చి, క్రిస్మస్ నాటికి తారా స్థాయికి చేరాయి. ప్రస్తుతం అమెరికాలో రోజువారీ కేసులు 2లక్షలుగానూ, యూరప్ దేశాల్లో అది 1లక్షగానూ కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, ఎయిర్‌లైన్స్ సంస్థలు.. క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్, క్రిస్మస్ మరుసటి రోజు కలుపుకొని మొత్తం 6500 విమాన సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేశాయి. విమాన సిబ్బంది కరోనా బారిన పడటం వల్లే సర్వీసులు రద్దయినట్లు ఎయిర్ లైన్స్ సంస్థలు చెబుతున్నాయి.
క్రిస్మస్ వేడుకల కోసం ముందుగానే టూర్లకు వెళ్లిన లక్షల మంది ప్రయాణికులు తిరిగి ఇళ్లను చేరేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండగా, మిగతా ఖండాల్లోనూ వందల సంఖ్యలో విమానలు రద్దవుతున్నాయి. రాబోయే రోజుల్లో రోజువారీ కేసులు 5లక్షలకు పెరగొచ్చనే అంచనాల నడుమ అమెరికాలో విమాన ప్రయాణాలు మరింత కష్టతరం కానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.