news18-telugu
Updated: July 25, 2020, 9:21 AM IST
దూసుకొచ్చిన అడవి దున్నలు... శవంలా నటించిన టూరిస్టు... వైరల్ వీడియో (credit - YOUTUBE)
మన చిన్నప్పుడు ఓ కథ ఉండేది. ఇద్దరు ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉండగా... ఎలుగుబంటి వచ్చింది. ఒకటు చెట్టు ఎక్కేయగా... రెండోవాడికి చెట్టు ఎక్కడం రాక... అక్కడే ఉండిపోయాడు. ఎలుగుబంటి దగ్గరకు రాగానే శవంలా పడుకున్నాడు. దాంతో ఎలుగు అతన్ని ఏమీ చెయ్యకుండా వెళ్లిపోయిందనేది ఆ కథలో కీలక అంశం. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత ఎల్లోస్టోన్ పార్క్లో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ పార్కులో పర్యాటకులు ఉండగా... బైసన్లు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ప్రాణభయంతో... పర్యాటకులంతా తలో దిక్కుకూ పారిపోయారు. ఓ మహిళ మాత్రం పారిపోలేకపోయింది.
ఆ మహిళ దగ్గరకు ఓ బైసన్ రాగా... మరొకటి కాస్త దూరం నుంచి చూడసాగింది. మహిళ దగ్గరకు బైసన్ వచ్చినప్పుడు... అది ఎక్కడ కొమ్ములతో దాడి చేస్తుందో అని ఆ మహిళ చాలా టెన్షన్ పడింది. వెన్నులో వణుకువచ్చింది. ముఖమంతా చెమటలు పట్టేశాయి. చుట్టుపక్కల వాళ్లు ఆమెను "చచ్చిపోయినట్లు నటించు" అంటూ కేకలు వేశారు. దాంతో ఆమె... శవంలా నటించింది. ఊపిరి తీసుకోవడం మానేసింది. ఏమాత్రం కదలకుండా అలా ఉండిపోయింది. ఆమె దగ్గరకు వచ్చిన బైసన్... కళ్లలో కళ్లు పెట్టకుండా చూసింది. "ఏంది ఇలా ఉంది. చచ్చినట్లుంది. చచ్చిన శవాన్ని నేనేం చేసేది. ఛస్" అనుకుంటూ... ఆ బైసన్ అక్కడి నుంచి పక్కకు వెళ్లింది. అంతే... టూరిస్టులంతా కేకలు పెట్టడంతో... ఆ బైసన్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అలా ఆమె తెలివిగా ప్రాణం దక్కించుకుంది. ఇదంతా ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఉత్తర అమెరికాలో బైసన్ల దాడి ఎక్కువే. ఇవి చాలా బలంగా ఉండే అడవిదున్నలు. ఒక్కోటీ 1000 కేజీల దాకా పెరుగుతాయి. ఒక్కసారి దాడి చేసినా చాలు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది.
ఈ ఘటన తర్వాత పర్యాటకులు... వన్యప్రాణులకు 25 గజాల దూరంలో ఉండాలని ఎల్లోస్టోన్ అధికారులు తాజాగా ఆదేశించారు.
Published by:
Krishna Kumar N
First published:
July 25, 2020, 9:21 AM IST