Indian- American Siblings: భారత్​కు బాసటగా నిలిచిన ముగ్గురు ఇండో అమెరికన్​ టీనేజర్లు.. వీరు చేసిన పని తెలిస్తే హ్యాట్సాఫ్​ చెబుతారు..

ప్రతీకాత్మక చిత్రం

జియా, కరీనా, అర్మాన్ గుప్తా అనే ముగ్గురు ఎన్నారై సోదరులు.. మాతృదేశంపై తమ ఉదారత చాటుకున్నారు.

  • Share this:
కరోనాతో పోరాడుతున్న భారత్​కు అగ్రరాజ్యం అమెరికా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. వెంటిలేటర్లు వంటి కీలక వైద్య పరికరాలు, మందులు, టీకాల తయారీకి ఉపయోగించే ముడి సరుకు పంపిణీ, ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల సరఫరా.. ఇలా అనేక రకాలుగా భారత్​ను అగ్రరాజ్యం ఆదుకుంటోంది. దీనికి తోడు అమెరికాకు చెందిన 40 దిగ్గజ కంపెనీలు సైతం తొలిసారి ఓ టాస్క్​ ఫోర్స్​గా ఏర్పడి భారత్​కు సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అలాగే పలువురు ఇండో అమెరికన్లు సైతం మేమున్నాం అంటూ మాతృదేశానికి అండగా నిలుస్తున్నారు. భారత్​ దుస్థితి పెద్దవారినే కాదు పిల్లలను కూడా కదిలించింది. ఈ క్రమంలో సుమారు 15 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు భారతీయ అమెరికన్​ సోదరులు భారత్​కు అండగా నిలుస్తున్నారు. భారత్‌కు సాయం చేసేందుకు వీరు ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు సేకరించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జియా, కరీనా, అర్మాన్ గుప్తా అనే ముగ్గురు ఎన్నారై సోదరులు.. మాతృదేశంపై తమ ఉదారత చాటుకున్నారు. భారత్​లోని కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడానికి ఏకంగా USD 2,80,000 (భారత కరెన్సీ ప్రకారం సుమారు 2.6 కోట్లు) మేర సాయం చేశారు. ఈ ముగ్గురు కలిసి గతంలో ‘లిటిల్ మెంటర్స్’ అనే స్వచ్చంద సంస్థను స్థాపించారు. తమ సంస్థ తరఫున మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సేకరించారు. ఈ నిధులతో ఢిల్లీ, చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు వంటి పరికరాలను అందజేస్తున్నారు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే పెద్ద మొత్తంలో నిధులు సేకరించి మాతృదేశానికి సాయం చేస్తున్న వీరి గొప్పతనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

లిటిల్​ మెంటర్స్​ ద్వారా నిధుల సేకరణ..
మాతృదేశం​ కరోనాపై చేస్తున్న పోరాటానికి మద్దతుగా తమ వంతుగా నిధులు సేకరించి ఇచ్చామని ఈ ముగ్గురు బాలురు చెబుతున్నారు. ‘దేశంలో మెడికల్ ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉందని గ్రహించాం. మేం సేకరించిన నిధులతో రోగులకు కావాల్సిన అత్యవసర పరికరాలను కొనుగోలు చేసి వాటిని ఢిల్లీలోని ఆసుపత్రులకు అందజేస్తున్నాం. మా జట్టులోని సభ్యుల సహకారంతో ఇంత పెద్ద మొత్తంలో నిధులు సేకరించగలిగాం. మెడికల్​ సామాగ్రితో పాటు టీకా తయారీకి అవసరమైన సామాగ్రిని కూడా అందించడానికి మరిన్ని నిధుల సేకరణ ప్రారంభించాం. ఈ ఆపత్కాలంలో భారత్​కు సాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం’ అని చెప్పారు.

కరోనా సెకండ్​ వేవ్​ నుండి భారత్​ త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో భారత్​లోని ప్రతిఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ ముగ్గురు టీనేజర్లు మాతృదేశానికి చేస్తున్న సేవ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
Published by:Sumanth Kanukula
First published: