మన దేశంలో తొలిదశ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. జనవరి 16 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కోవిడ్ టీకా వేస్తున్నారు. భారత్ మాదిరే చాలా దేశాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతోంది. ఐతే కరోనా వ్యాక్సిన్ తీసుకునే వారికి ఓ హోటల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీకా వేయించుకున్న వారికి డిస్కౌంట్లు ప్రకటించింది. కరోనా టీకాను అందరూ తీసుకోవాలని.. ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆఫర్స్ ఇస్తున్నట్లు తెలిపింది. ఐతే ఈ ఆఫర్ మన ఇండియాలో కాదు.. దుబాయ్‌లో ఉంది. గేట్స్ హాస్పిటాలిటీ ఆధ్వర్యంలో నడిచే మూడు హోటల్స్‌లో డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.
కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకుంటే హోటల్ బిల్లులో 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. ఇక రెండో డోస్ కూడా తీసుకున్న వారికి 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఐతే టీకా తీసుకున్నట్లుగా మెడికల్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. స్ప్రెడ్ లవ్.. నాట్ రోనా ట్యాగ్‌లైన్‌తో ఈ కార్యక్రమం చేపట్టింది గేట్స్ హాస్పిటాలిటీ. టీకా వేసుకున్న వారు మా ప్రేమను అందుకోండి అంటూ సదరు హోటల్ ప్రచారం నిర్వహిస్తోంది. ఐతే కొందరు దీన్ని సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. నిజంగానే ప్రజల్లో టీకా గురించి అవగాహన కల్పించేందుకే ఆఫర్స్ తెచ్చారంటే నమ్మలేమని.. ఇది పక్కా బిజినెస్ స్ట్రాటజీ అని కామెంట్స్ చేస్తున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. కోటి జనాభా ఉన్న యూఏఈలో ఇప్పటికే 25 లక్షల మందికి టీకా వేసినట్లు అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ తర్వాత అత్యధిక వ్యాక్సినేషన్ రేట్ యూఏఈలోనే ఉందని వెల్లడించారు. అక్కడి అధికారులు ఇటీవేల కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల జాబితాను విడుదల చేశారు. ఎవరికి ఎక్కడ టీకా వేస్తారో.. అందులో స్పష్టంగా వివరించారు. తమకు నిర్దేశించిన కేంద్రంలో.. నిర్దేశించిన సమయంలో.. వెళ్లి టీకా వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే యూఏఈలో 25శాతం మందికి టీకా పంపిణీ పూర్తయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, COVID-19 vaccine, UAE