Biggest mouth: అమ్మో.. ఆమె నోరు ఎంత పెద్దదో.. గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు..! 

(Image Credit-Guinness World Record)

ఆమె ప్రపంచంలోనే అతి పెద్ద నోరు ఉన్న మహిళగా రికార్డు దక్కించుకుంది. దాదాపు 6.52 సెంటిమీటర్ల (2.56 అంగుళాలు) మేరకు ఆమె నోరు తెరవగలదు.

  • Share this:
నోరు ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ తింటారని మన పెద్దవాళ్లు చెబుతారు. నిజమే కానీ.. నోరు ఎంత పెద్దగా తెరిచినా మహా అయితే ఓ చిన్న సైజు పండు పట్టేంత మాత్రమే ఉంటుంది. కానీ రెండు పెద్ద ఛీజ్ బర్గర్లను అమాంతం నోట్లోకి నెట్టేసింది అమెరికాకు చెందిన ఓ మహిళ. అంతేకాదు పెద్ద పెద్ద నారింజ కాయలను, యాపిల్స్‌ను ఒక్కసారిగా మింగేసింది. ఈ ప్రత్యేకతలతో ప్రపంచంలోనే అతిపెద్ద నోరు కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం టిక్ టాక్‌లో ఈమె వీడియో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన సమంత రామ్స్డెల్ (31) అనే యువతి.. ప్రపంచంలోనే అతి పెద్ద నోరు ఉన్న మహిళగా రికార్డు దక్కించుకుంది. దాదాపు 6.52 సెంటిమీటర్ల (2.56 అంగుళాలు) మేరకు ఆమె నోరు తెరవగలదు. భారీగా ఉండే తినుబండారాలను సైతం సులభంగా నోట్లో పెట్టుకుంది. సరదాగా టైంపాస్ కోసం టిక్ టాక్ అకౌంట్ ఓపెన్ చేసిన సమంత.. తన నోటి సైజుతో నెటిజన్లను అయోమయంలో పడేసింది. విభిన్న రకాలుగా నోటిని పెద్దగా తెరుస్తూ ఆన్ లైన్‌లో సంచలనం సృష్టించింది. వేగంగా ఫాలోవర్లను పెంచుకుంది.

ఈ క్రమంలో గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించాలని ఫాలోవర్లు సూచించారు. దీంతో సమంత స్థానిక దంతవైద్యుని సందర్శించింది. ఆమె ప్రదర్శనను గిన్నిస్ ప్రతినిధులు చూశారు. వారి సమక్షంలో డాక్టర్ ఎల్కే చెంగ్ అనే దంత వైద్యుడు ఆమె నోటి గ్యాప్‌ను కొలిచాడు. ఇందుకోసం డిజిటల్ క్యాలిపర్‌ను ఉపయోగించాడు. గరిష్ఠంగా 6.52 సెంటిమీటర్ల వరకు ఆమె తన నోరు తెరుస్తూ.. సాగదీసింది.



పెద్ద నోరు ఉండటం వల్ల చిన్నతనంలో అందరూ తనను ఆటపట్టించేవారని, పెరుగుతున్న కొద్ది రకరకాల పేర్లతో పిలిచేవారని తెలిపింది. అయితే చివరకు తనను తాను అంగీకరించినట్లు స్పష్టం చేసింది. "31 ఏళ్ల వయస్సులో రికార్డు సాధించాను. పెద్ద నోరు వల్ల నేను చాలాసార్లు అభద్రతా భావానికి లోనయ్యా. నోరు చిన్నగా ఉండే బాగుండు అని అనుకున్నా. కానీ ఇప్పుడు నా పెద్ద నోరే నన్ను ఉత్తమంగా నిలిపింది" అని సమంత ఆనందం వ్యక్తం చేసింది. శరీరంలో ఎవరికైనా పెద్ద భాగం ఉంటే ప్రత్యేకమైందిగా భావించాలని సలహా ఇచ్చింది. గిన్నిస్ రికార్డ్స్‌కు ప్రయత్నించాలనుకుంటే మీ లోపమే మీకు ఆస్తిగా మారుతుందని.. అందరికంటే విభిన్నంగా ఉండేలా చేస్తుందని తెలిపింది.
Published by:Sumanth Kanukula
First published: