Telangana Govt Employee: ఈ తెలంగాణ ప్రభుత్వ మహిళా ఉద్యోగినిని ఎంత పొగిడినా తక్కువే.. ఎందుకంటే..

చిన్నారులతో తస్లీమా

ఈ కరోనా కాలంలో ఎంత దగ్గరివారైనా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి రిస్క్‌ చేసి... విడిపోయిన కుటుంబాలను కలుపుతున్నారు. ఇదెక్కడో జరిగిన కథ కాదు. మన తెలంగాణలో జరిగిన విషయం.

  • Share this:
ఈ కరోనా కాలంలో ఎంత దగ్గరివారైనా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి రిస్క్‌ చేసి... విడిపోయిన కుటుంబాలను కలుపుతున్నారు. ఇదెక్కడో జరిగిన కథ కాదు. మన తెలంగాణలో జరిగిన విషయం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 21 కుటుంబాల్లో ఆనందం నింపిన ఒక మహిళా ఉద్యోగి సేవలకు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఆరడుగుల దూరం... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. దీని వల్ల మనుషుల మధ్య బంధం, అనుబంధం తగ్గుతుందేమో అనిపిస్తుంటుంది. అయితే తస్లీమా మహమ్మద్‌ గురించి తెలుసుకుంటే... మనసు ఉండాలే కానీ... ఈ ‘దూరం’ ఓ పెద్ద విషయమా అనిపిస్తుంది. మానవత్వం చూపించడానికి మనసు చాలు అని నిరూపిస్తున్న తస్లీమా తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉంటారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు విభాగంలో గ్రూప్‌ 2 గెజిటెడ్‌ అధికారిణిగా పని చేస్తున్నారు.

ములుగు జిల్లా రామచంద్రాపురంలో జన్మించిన తస్లీమా... ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీజీ చేశారు. ఆ తర్వాత 2010లో గెజిటెడ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించారు. తస్లీమాకు సమాజంలో కష్టాల పట్ల అవగాహన ఎక్కువగానే ఉంది. కుటుంబాలకు దూరంగా.. రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌ల మీద, బస్ట్‌ స్టాప్‌ల్లో వివిధ పరిస్థితుల్లో ఉన్న వారిని, వారి కుటుంబాల వద్దకు చేర్చారు తస్లీమా. నిజానికి తస్లీమా ఈ సేవాగుణం చిన్నతనం నుంచి ఉందట. తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఆమె సేవా కార్యక్రమాలు నిర్వహించేవారట.

రోడ్ల పక్కన దిక్కుతోచని స్థితిలో ఉండే వారిని.. వారి కుటుంబంతో కలపడం గురించి తస్లీమా చెప్పుకొచ్చారు. ‘‘గతేడాది ఒక రోజు ఇలా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక పెద్దాయన కనిపించారు. మాట కలిపితే... ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా అని తెలిసింది. ఇంకొంచెం సమాచారం కోసం ప్రయత్నించి వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించాను. ఆ తర్వాత స్థానిక పోలీసుల సహకారంతో వారి సొంతూరుకు పంపగలిగాను’’ అంటూ నాటి విషయం గురించి చెప్పుకొచ్చారు. ఆ విషయంలో పొందిన స్ఫూర్తితో ఆమె ఇప్పటివరకు 21 కుటుంబాల్లో ఆనందం నింపారు. తప్పిపోయిన కుటుంబ సభ్యులను సొంతవాళ్ల చెంతకు చేర్చడంలో నిర్విరామంగా కృషి చేస్తున్నారు.



తస్లీమా మానవత్వం ఒక్క ఇలాంటి విషయాల్లోనే కాదు. సన్నకారు రైతుల విషయంలోనూ ఇలానే స్పందిస్తుంటారట. వారి కష్టాలను తెలుసుకోవడానికి ఆమె వారాంతంలో వ్యవసాయం చేస్తుంటారు. అది కూడా స్థానిక రైతు కూలీలతో కలసి. అలా వ్యవసాయం చేయడం వల్ల వచ్చిన కూలీని తిరిగి అక్కడి కూలీలకే పంచేస్తుంటారట. తాను డబ్బు కోసం పనిలోకి వెళ్లడం లేదని, తన ఆత్మసంతృప్తి కోసం వెళ్తున్నానని చెబుతుంటారు తస్లీమా.
Published by:Sambasiva Reddy
First published: