Home /News /trending /

Viral News: తల్లితో పాటు ఇంటర్వ్యూకు వెళ్లిన నాలుగేళ్ల బాలుడు.. రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేశాడు 

Viral News: తల్లితో పాటు ఇంటర్వ్యూకు వెళ్లిన నాలుగేళ్ల బాలుడు.. రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేశాడు 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తల్లితో పాటు నాలుగేళ్ల చిన్నారి కూడా మౌఖిక పరీక్షకు సన్నద్ధమై, తన రెజ్యూమ్‌ను నింపేశాడు. అంతేకాకుండా సీవీలో తన నైపుణ్యాలను కూడా పొందుపరిచాడు.

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇలాంటి ఇంటర్వ్యూకు సంబంధించిన టిక్ టాక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లితో పాటు నాలుగేళ్ల చిన్నారి కూడా మౌఖిక పరీక్షకు సన్నద్ధమై, తన రెజ్యూమ్‌ను నింపేశాడు. అంతేకాకుండా సీవీలో తన నైపుణ్యాలను కూడా పొందుపరిచాడు. స్నాక్స్ మొత్తం తినేస్తానని, మైలు దూరంలో ఉన్న తన కుక్కను కూడా చూసేయగలనని స్కిల్స్ జాబితాలో రాశాడు.

అమెరికాకు చెందిన మమ్ మ్యాగీ అనే టిక్ టాక్ యూజర్ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఇటీవల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఒక కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూకు ఆమె హాజరు కావాల్సి ఉంది. అయితే తన నాలుగేళ్ల కుమారుడిని ఎక్కడ ఉంచాలో తెలియలేదు. దీంతో బాబును కూడా తనతో పాటు ఇంటర్వ్యూకు తీసుకొచ్చేందుకు అనుమతి తీసుకుంది. పనిలో పనిగా బాబును కూడా సరదాగా ఇంటర్వ్యూకు సిద్ధం చేసింది. అంతేకాకుండా ఆ సన్నద్ధతను వీడియో తీసి టిక్ టాక్ షేర్ చేసింది.

బాలుడి క్వాలిఫికేషన్లు ఇవే..
బాబు తన సీవీని తల్లి సహాయంతో రాసినట్లు వీడియోలో కనిపిస్తోంది. కంపెనీకి తను ఎందుకు అవసరమో వివరిస్తూ నైపుణ్యాల జాబితాను పొందుపరిచాడు. "శుభ్రంగా ఉన్న ప్రదేశాన్ని 30 సెకండ్లలో నాశనం చేస్తాను, నా డైపర్లను నేనే మార్చుకుంటాను, బంతి విసురుతాను, నా కుక్కను మైలు దూరంలో ఉన్నా కనిపెడతాను" అని పలురకాల స్కిల్స్ ను సీవీలో పొందుపరిచాడు. ఈ విభాగాల్లో మార్చి 2020 నుంచి అనుభవం ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా విద్యార్హత దగ్గరకొచ్చే సరికి.. మమ్ అండ్ డాడ్ యునివర్సిటీ 4.0 అని ఉంది. రికమండేషన్ జాబితాలో కూడా మమ్ అండ్ డాడ్ అని పేర్కొనడం విశేషం. ఎంతో ఫన్నీగా ఉన్న ఈ రెజ్యూమ్ టిక్ టాక్ వీడియో.. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోను ఇప్పటి వరకు 9 మిలియన్ల మంది చూశారు. అంతేకాకుండా వేల మంది కామెంట్లు పెట్టారు. వీడియోపై స్పందించిన నెటిజన్లు పిల్లాడి దృఢత్వం గురించి కామెంట్లు పెడుతున్నారు. తాము ఇంటర్వ్యూ చేసేవాళ్లమైతే.. వెంటనే ఆ బాలుడిని ఉద్యోగానికి తీసుకునేవాళ్లమని పోస్టులు చేస్తున్నారు. మొత్తానికి మ్యాగీ తన ఇంటర్వ్యూ పూర్తి చేసింది. కంపెనీ కాల్ కోసం ఆమె వేచిచూస్తోంది. త్వరలోనే జాబ్ ఆఫర్‌కు సంబంధించిన అప్డేట్ వస్తుందని ఆమె టిక్ టాక్ వీడియోలో తెలిపింది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Tiktok, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు