Home /News /trending /

THIS IS MANZOOR AHMAD WAGAY SAD STORY WHO HAS BEEN DIGGING THE EARTH FOR MISSING SONS BODY GH SRD

Viral : 8 నెల‌లుగా కొడుకు కోసం భూమిని తవ్వుతున్నాడు..కన్నీళ్లు పెట్టించే ఆ తండ్రి కథేంటంటే

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral : ఆ తండ్రి తన కొడుకు కోసం 8 నెలలుగా అక్కడి నేలను తవ్వుతూనే ఉన్నాడు. ఇంతకీ ఆ తండ్రి అలా ఎందుకు చేస్తున్నాడు. దీనికి వెనుక ఉన్న ఉన్న కన్నీటి గాథ ఏంటి..?

ఏ భూమినైతే ప్ర‌పంచ‌మంతా భూత‌ల స్వ‌ర్గమ‌ని అనుకుంటుందో, అక్క‌డికి వెళ్లాల‌ని ఆరాట‌ప‌డుతుందో, ఆ భూమిపైన పుట్టినోళ్ల‌కి ర‌క్ష‌ణ లేద‌నే అభిప్రాయం ఎప్ప‌టి నుంచో ఉంది. నిత్యం భయంతో దోస్తీ చేస్తూ జీవించే ఆ ప్రదేశమే జమ్మూ కాశ్మీర్.. దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండే సైనికులు.. శత్రువుల ప్రాణాలను తీసేందుకు కూడా అంతే సిద్ధంగా ఉంటారు. కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రం వారు ఎప్పుడు తిరిగి ఇంటికి వస్తారా? అని వేచి చూస్తుంటారు. కొన్ని సార్లు తాము చనిపోయినా.. తమ పార్థివ దేహం కూడా కుటుంబ సభ్యులను చేరదని కూడా తెలిసి ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తుంటారు జవాన్లు.. అలాంటి ఓ జవాను తండ్రే మంజూర్ అహ్మద్ వాగే.. కొడుకు కోసం ఈ తండ్రి ఎనిమిది నెలలుగా పడుతున్న బాధను తెలుసుకుంటే ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. రోజూ ఉద‌యాన్నే పలుగు పారా ప‌ట్టుకొని బ‌య‌లుదేర‌తాడు మంజూర్ అహ్మ‌ద్ వాగే. అంత‌కుముందు రోజు ఒక చోట తవ్వుతున్న‌ప్ప‌డు అక్క‌డి‌వారు చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి త‌ర్వాత ఈ రోజు ఎక్క‌డ త‌వ్వాలి అన్న‌ది నిర్ణ‌యించుకుంటాడు. ఇదేదో గొంద‌ర‌గోళంగా ఉంద‌నుకుంటున్నారా? అయితే ఆయ‌న‌కు మాత్రం చాలా స్ప‌ష్ట‌త ఉంది. 8 నెల‌లుగా క‌నిపించ‌కుండా పోయిన త‌న కొడుకు శ‌వం కోసం అక్క‌డి నేల‌ను తవ్వ‌ుతూనే ఉన్నాడు. మ‌రి కొన్ని రోజుల్లో త‌న కొడుక్కి 25 సంవ‌త్స‌రాలు రాబోతున్నాయ‌ని గుర్తుచేసుకుంటూ, ఈ రోజైనా శ‌వం క‌నిపిస్తుందేమో ఆశ‌తో వెదుకుతూనే ఉన్నాడు.

గ‌త సంవ‌త్స‌రం ఆగ‌స్టు 2న త‌న కొడుకుని చివ‌రిసారి చూశాడు 56 ఏళ్ల అహ్మ‌ద్‌. టెరిటోరియ‌ల్ ఆర్మీ సోల్జ‌ర్ రైఫిల్ మ్యాన్ అయిన ష‌‌కీర్ మ‌న్జూర్ అత‌ని పెద్ద కొడుకు. ఆరోజు షోపియ‌న్ ఏరియాలోని బ‌ల్పొరా నుంచి బ‌హిబాగ్‌లోని ఆర్మీ క్యాంప్‌కు వెళుతున్నాడు ష‌కీర్‌. అదేరోజు పండుగ కావ‌డం వ‌ల్ల కుటుంబంతో క‌లిసి భోజ‌నం చేయ‌డానికి ప్ర‌యాణం మ‌ధ్య‌లోనే ఇంటికొచ్చి, సాయంత్రం 5 గంట‌ల‌కు ఇంటి నుంచి వెళ్లాడు. స‌రిగ్గా అర‌గంట త‌ర్వాత ఇంటికి ఫోన్ వ‌చ్చింది. ష‌కీర్ మాట‌ల‌ను చివ‌రిసారిగా విన్నది కూడా అప్పుడే.. త‌న స్నేహితుల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాన‌ని, ఆర్మీ అధికారులు ఫోన్ చేసి త‌న గురించి అడిగితే మీరేమీ కంగారుప‌డొద్ద‌ని కుటుంబ స‌భ్యుల‌తో చెప్పాడు. `అప్ప‌టి‌కే వాడిని మిలిటెంట్లు కిడ్నాప్ చేసి ఉంటారు. చివ‌రిసారిగా కుటుంబంతో మాట్లాడాల‌ని కోరుకొని ఉంటాడు` అని ఆరోజును గుర్తుచేసుకుంటాడు మంజూర్ అహ్మద్.. అదే రోజు కొన్ని గంట‌ల త‌ర్వాత, ఆ గ్రామానికి 16 కి.మీ. దూరంలో, స‌మీపంలోని కుల్‌గమ్ జిల్లాలో ష‌కీర్ ప్ర‌యాణించిన వాహ‌నం పొలాల్లో కాల్చేసి ఉంది. ఏడు రోజుల త‌ర్వాత త‌న ఇంటికి కేవ‌లం 3 కి.మీ. దూరంలో ఒక మురికి కాలువ‌లో ష‌కీర్ బ్యాగీ ప్యాంటు, ఖాకీ చొక్కా కనిపించాయి. వాటి నిండా ఎండిన ర‌క్త‌పు మ‌ర‌క‌లు, మురికి నిండి ఉన్నాయి. ఆ చొక్కాలో చిరిగిన కొద్దిగ ముక్క కాల్చేసిన ష‌కీర్ వాహ‌నంలో క‌నిపించింది. ఒక‌వేళ ష‌కీర్‌ని కిడ్నాప్ చేసేట‌ప్ప‌డు పెనుగులాట‌లో చొక్కా చిరిగి ఉండొచ్చంటారు ఆ కుటుంబ స‌భ్యులు.

జ‌మ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir)‌లో చాలా మంది యువ‌కుల్లా, ఆర్మీ జ‌వాను ష‌కీర్ కూడా రికార్డుల్లో మిస్సింగ్ ప‌ర్స‌న్‌గా ఉన్నాడు. షోపియ‌న్ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమ్రిత్‌పాల్ సింగ్ దీని గురించి మాట్లాడుతూ `కేసు ఇన్వెస్టిగేష‌న్‌లో ఉంది. బాడీని క‌నిపెట్ట‌డం కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది` అని మాత్రమే చెప్పారు. అయితే ష‌కీర్ తండ్రి అహ్మ‌ద్‌కు త‌న కొడుకు చ‌నియాడ‌ని అర్థ‌మ‌య్యంది. ష‌కీర్‌ను న‌లుగురు మ‌నుషులు హింసిస్తున్న‌ట్లు అతడిని చూసిన ఒక మ‌హిళ అహ్మ‌ద్‌కు చెప్పింది. ఆమె చెప్పిన మాట‌లు, ర‌క్త‌ంతో నిండిన త‌న కొడుకు బ‌ట్ట‌ల‌ను బ‌ట్టి `ష‌కీర్ బ‌తికుంటాడ‌ని నేను అనుకోవ‌ట్లేదు` అంటాడు ఆ తండ్రి. ష‌కీర్ చ‌నిపోయాడ‌ని నిర్థారించుకున్న వారం రోజుల త‌ర్వాత సామాజిక మాధ్య‌మాల్లో ఒక ఆడియో స‌ర్య్కులేట్‌ అయ్యింది. `ఈ సైనికుడిని చంప‌డం, బాడీని అత‌ని కుటుంబానికి అప్ప‌గించ‌క‌పోవ‌డం అనేది ఎన్‌కౌంట‌ర్లో మిలిటెంట్ల‌ను చంపేసిన త‌ర్వాత స‌రిగ్గా ఇలాంటి పాల‌సీనే ఆచ‌రిస్తున్న జ‌మ్మూకాశ్మీర్ అధికారుల‌పై ప్ర‌తీకారం` అని ఈ ఆడియోలో గుర్తుతెలియ‌ని గొంతు చెబుతోంది.

అహ్మ‌ద్, ఆయిషాల‌కు న‌లుగురు కుమార్తెల త‌ర్వాత ష‌కీర్ పుట్టాడు. వారి కుటుంబంలో ఉద్యోగం చేస్తుంది అత‌నొక్క‌డే. 2016లో టెరిటోరియ‌ల్ ఆర్మీలో చేరిన‌ప్ప‌టి నుంచి కుటుంబానికి ఆర్థిక ఆలంబ‌నా అత‌నే. ష‌కీర్‌కు డాక్ట‌ర్ కావాల‌నే కోరిక ఉండేది కానీ కుటుంబ భారం వల్ల అతడు ఆర్మీలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ భారం ష‌కీర్ త‌మ్ముడు 20 ఏళ్ల షాన్‌పై ప‌డింది. ఆలీఘ‌ర్‌లో చ‌దువుకుంటున్న షాన్ త‌న చ‌దువును మ‌ధ్య‌లోనే ఆపేశాడు. షాన్ ఫోన్ నిండా త‌న అన్న ష‌కీర్ ఫొటోలే. అందులో చివ‌రిగా కుటుంబంతో క‌లిసున్న ఆరోజు ఫొటో కూడా ఉంది. అందులో బ‌ట్ట‌లే ర‌క్తం మ‌ర‌క‌ల‌తో వీళ్ల‌కి దొరికింది.

ఈ త‌రుణంలోనే అరెస్టైన ఒక మిలిటెంట్ ఒక‌‌ కెనాల్ ప‌క్క‌నే ష‌కీర్‌ను కాల్చేసిన‌ట్లు చెప్పాడు. దానితో కుటుంబ సభ్యులు ఒక జెసిబీని మాట్లాడుకొని, ఎక్క‌డ నీటి కుంట‌లు క‌నిపిస్తే అక్క‌డ తవ్వి, వెత‌క‌డం మొద‌లుపెట్టారు. ష‌కీర్‌ను కిడ్నాప్ చేశార‌నే అనుమానిత మిలెటెంట్ల కుటుంబ స‌భ్యుల్ని క‌లిసి త‌న కొడుకు శ‌వం ఎక్క‌డుందో చెప్ప‌మ‌ని బ‌తిమాలాడు తండ్రి అహ్మ‌ద్‌. వారికి మాత్రం ఏం తెలుస్తుంది `మాకు ఎలాంటి ప్ర‌మేయం లేద‌న్నారు` వాళ్లు. ష‌కీర్ తండ్రి మాత్రం ప్ర‌తిరోజూ చ‌నిపోయిన త‌న కొడుకు కోసం వెతుకుతూనే ఉన్నాడు. సాయంత్రానికి నిరాశ‌గా ఇంటికొస్తున్నాడు. ఇప్పుడు ఆ జిల్లాను దాటి చుట్టుప‌క్క‌ల మూడు జిల్లాల్లో త‌న కొడుకు దేహం కోసం వెత‌కాల‌ని నిశ్చయించుకున్నాడు. ఇంత‌గా వెదుకుతోంది ఎందుకో తెలుసా... ` త‌న కొడుకును స‌మాధి చేయ‌డానికి. క‌నీసం త‌న కొడుకు ప్ర‌శాంతంగా స‌మాధి చేయ‌బ‌డ్డాడ‌నే సంతృప్తిని అయినా మిగుల్చుకోవ‌డానికి!` ఈ కథంతా విన్నవారు ఆ తండ్రి శోకం ఇంకెవరికీ రాకూడదని, కుమారుడిని దేహం అతడికి త్వరగా దొరకాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేరు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Trending, Viral

తదుపరి వార్తలు