news18
Updated: November 13, 2020, 3:01 PM IST
డొనాల్డ్ ట్రంప్, మెలానియా (ఫైల్)
- News18
- Last Updated:
November 13, 2020, 3:01 PM IST
అమెరికా అధ్యక్షుడు (వచ్చే ఏడాది జనవరి 20న జో బిడెన్ ప్రమాణం చేసేదాక ట్రంపే అధ్యక్షుడు) ట్రంప్ కు మెలానియా విడాకులివ్వనుందనే వార్తలు సంచలనమైన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకోసం ఆమె భారీ స్థాయిలోనే భరణం డిమాండ్ చేస్తుందనే వార్త అమెరికన్ మీడియాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు విడిపోతారన్న లీకులు మొదలైన క్షణం నుంచి, ట్రంప్ కు ఉన్న ఆస్తిపాస్తులు.. వాటి వివరాలు.. విడిపోతే ట్రంప్ సతీమణి మెలానియాకు దక్కే ఆస్తిపై పెద్ద ఎత్తున బహిరంగ చర్చ సాగుతోంది.
అమెరికా న్యాయ నిపుణులు తేల్చిన లెక్కల ప్రకారం ఒకవేళ ట్రంప్, మెలానియా దంపతులు విడిపోతే ఇది అత్యంత ఖరీదైన విడాకుల (expensive divorce) వ్యవహారంగా మారడం ఖాయం. ఈ విడాకుల విలువ కనీసం 68 మిలియన్ డాలర్లకు పైమాటే. అంటే సుమారు రూ. 507 కోట్లకు పైనన్నమాట.
మెలానియా మూడో భార్య..
ట్రంప్-మెలానియాల సంతానమైన బారన్ కు విడాకుల తరువాత అన్ని హక్కులు చట్టప్రకారం సంక్రమిస్తాయి. డొనాల్డ్ ట్రంప్‌కు మెలానియా మూడవ భార్య. ట్రంప్ మాజీ భార్యల కంటే ఇప్పుడు మెలానియాకు చాలా ఎక్కువ మొత్తంలో భరణం అందనుండడం హైలైట్. మొదటి భార్య ఇవానాకు 14 మిలియన్ డాలర్లు, రెండవ భార్య మార్లా మ్యాపిల్స్ కు 2 మిలియన్ డాలర్లను అప్పజెప్పగా తాజాగా మెలానియాకు మాత్రం 68 మిలియన్ డాలర్లు అందే అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా వీరు వైట్ హౌస్ లో నివసిస్తున్నప్పటికీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక వీరిమధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు సమాచారం. అసలు వీరి మధ్య భార్యా-భర్తల సంబంధాలే లేవని కూడా వైట్ హౌస్ స్టాఫ్ చెప్పినట్టు తరచూ అమెరికన్ మీడియా లో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఎన్నికల్లో ఓటమిపాలైనా అధ్యక్ష పగ్గాలు వదులుకునేందుకు ట్రంప్ సిద్ధంగా లేకపోవడం కూడా మెలానియాకు అవమానంగా అనిపిస్తోందని సమాచారం. హుందాగా అధికార మార్పిడి చేసేందుకు అంగీకరించాలని ఆమె ట్రంప్ కు చెప్పిచూసినా ప్రయోజనం లేకపోవటమే ఇందుకు కారణం. డొనాల్డ్ ట్రంప్, మెలానియాలు 2005 లో వివాహం చేసుకున్నారు. వీరికి 14 ఏళ్ల వయసున్న బారన్ ట్రంప్ అనే కుమారుడున్నాడు.
ఒప్పందం ఎప్పుడో కుదిరింది..
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 5నెలల తర్వాత మెలానియా వైట్‌హౌస్‌కు వచ్చారు. తన కుమారుడు బారన్ చదువు మధ్యలో ఉండటంతోనే న్యూయార్క్ నుంచి వాషింగ్టన్కు రావడానికి ఆలస్యమైనట్టు మెలానియా అప్పట్లో చెప్పారు. కానీ అసలు విషయాన్ని ఆమె సన్నిహితులు ఎప్పుడో వివరించారు. ట్రంప్ సంపదలో బారన్‌కు సమాన వాటా ఇవ్వాలని మెలానియా పట్టుబట్టారని, అందుకే ఆమె ఆలస్యంగా వచ్చారని తెలిసింది. కానీ ట్రంప్ తో ఉన్న వివాహ ఒప్పందం (marriage agreement) ప్రకారం మెలానియా ఏ విషయాలపైనా ఇప్పటివరకూ పెదవి విప్పలేదని తెలుస్తోంది. ఇక ఫోర్బ్స్ నివేదిక (Forbes report) ప్రకారం ట్రంప్ మొత్తం ఆస్తిపాస్తుల విలువ 250 కోట్ల డాలర్ల పైమాటే.
విడాకులు ఇందుకే..
ఓవైపు అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్ కు ఇంటి పోరు మామూలుగా లేదు. ట్రంప్ మాజీ సహాయకుడు న్యూమన్ చెప్పిన విషయాల ప్రకారం ట్రంప్ తో ఎప్పుడెప్పుడు విడిపోదామా అని మెలానియా గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నట్టు అర్థమవుతోంది. ట్రంప్ వైట్ హైస్ ను వీడిన మరుక్షణం ఆమె విడాకులు కోరుతారని, దీంతో 15 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై కొట్టేందుకు ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. కుమారుడు బారన్ కు ట్రంప్ ఆస్తిలో సమాన వాటా దక్కేలా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని, రోజు రోజుకీ ట్రంప్ కు ఆమె దూరమవుతున్నారని అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ట్రంప్ ఆలోచనా విధానం, ప్రవర్తన ఆమెకు విరక్తి తెప్పిస్తున్నాయని, ఈ కారణంగా అధికార హోదాలో ట్రంప్ చేసిన కొన్ని పర్యటనలకు సైతం ఆమె దూరంగా ఉండేవారని తెలుస్తోంది. గతంలో అమెజాన్ సీఈఓ విడాకుల (Amazon CEO divorce) వ్యవహారం అత్యంత ఖరీదైన విషయంగా రికార్డు సృష్టించింది.
Published by:
Srinivas Munigala
First published:
November 13, 2020, 2:57 PM IST