మారిన పరిస్థితులతో పెట్టుబడులపై ఆసక్తిచూపేవారి సంఖ్య పెరుగుతోంది. డిపాజిట్లను ప్రోత్సహించడానికి నష్టభయం ఉండని పెట్టుబడి మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిపై నిర్ణీత వడ్డీ హామీ కూడా ఉండటం వల్ల సాధారణ పొదుపుల నుంచి పెట్టుబడులకు ప్రజలు మారుతున్నారు. వీటిల్లో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ప్రధానమైనవి. కొన్ని పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై వచ్చే ఆదాయం ట్యాక్స్ పరిధిలోకి రాదు. వీటిపై మార్కెట్ ఒడిదొడుకులు ఎలాంటి ప్రభావం చూపవు. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు, మైనర్ తరఫున పెద్దవాళ్లు ఎవరైనా పోస్టాఫీస్ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం కస్టమర్లకు ఐదు రకాల పథకాలు ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి.
1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund- PPF)
ఒకవ్యక్తి తన పేరుమీద సొంతంగా, ఒక్క PPF అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో జాయింట్ అకౌంట్‌కు అవకాశం లేదు. కస్టమర్లకు నామినేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ అకౌంట్‌ను ఒక పోస్టాఫీసు నుంచి మరొక పోస్టాఫీసుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ పథకంలో మెచూరిటీ 15 సంవత్సరాలు. గడువు ముగిసిన తరువాత దీన్ని 5 సంవత్సరాల బ్లాక్ వరకు పొడిగించుకోవచ్చు. ఒక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి అత్యధికంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ పెట్టుబడుల నుంచి లభించే వడ్డీ ట్యాక్స్ పరిధిలోకి రాదు. పీపీఎఫ్ డిపాజిట్లపై 7.1శాతం వరకు వడ్డీరేటు ఉంది.
2. సుకన్య సమృద్ది అకౌంట్ (Sukanya Samriddhi Account)
సుకన్య సమిద్ధి యోజన పథకంలో చేరాలనుకున్నవారు ముందు సుకన్య సమృద్ధి అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. దీంట్లో డిపాజిట్లపై లభించే వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ విధించరు. ఆడపిల్లల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిల పేరుతో తల్లిదండ్రులు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ పథకంలో మెచూరిటీ 21 సంవత్సరాలు. అమ్మాయిలకు 21 ఏళ్లు నిండిన తరువాత మెచూరిటీ మొత్తాని ఆమెకు చెల్లిస్తారు. ఒక సంవత్సరానికి కనీసం రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అమ్మాయికి 18సంవత్సరాలు నిండిన తరువాత గడువుకు ముందే అకౌంట్ మూసివేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి అకౌంట్ వడ్డీరేటు 7.6 శాతంగా ఉంది.
3. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ (Post Office Time Deposit Account)
ఈ డిపాజిట్లపై వచ్చే ఆదాయం ట్యాక్స్ పరిధిలోకి రాదు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే ఉంటుంది. ఒకటి, రెండు, మూడు లేదా ఐదు సంవత్సరాల మెచూరిటీతో ఉండే టైమ్ డిపాజిట్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. వివిధ పోస్టాఫీస్‌లలో ఎన్ని టైమ్ డిపాజిట్ అకౌంట్లయినా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ వీటి మెచూరిటీ అత్యధికంగా ఐదేళ్ల వరకే ఉంటుంది. కస్టమర్లు కనీసం రూ.1,000 నుంచి పరిమితి లేకుండా ఎంత మొత్తాన్నైనా డిపాజిట్ చేసుకోవచ్చు. మెచూరిటీ తరువాత రూ.1.5 లక్షల వరకు లభించే రాబడిపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. టైమ్ డిపాజిట్లను ఎంచుకున్నవారు ఆరు నెలల్లోపు పథకం నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఐదేళ్ల మెచూరిటీ ఉంటే టైమ్ టిపాజిట్లపై 6.7శాతం వడ్డీ లభిస్తుంది. 1,2,3 సంవత్సాల వరకు మెచూరిటీ ఉంటే డిపాజిట్లపై 5.5శాతం వడ్డీరేటు ఉంటుంది.
4. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizen Savings Scheme- SCSS)
60 ఏళ్లు నిండినవారు, 55నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉండి ఉద్యోగ విరమణ చేసినవారు, వీఆర్ఎస్ తీసుకున్నవారు ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. దీంట్లో చేసే డిపాజిట్లకు మెచూరిటీ ఐదు సంవత్సరాలుగా ఉంటుంది. వ్యక్తిగత అకౌంట్ లేదా భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. ఈ పథకం కింద ఒకటికంటే ఎక్కువ అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు. డిపాజిట్ పరిమితి రూ.15 లక్షలుగా ఉంది. మెచూరిటీకి ముందే అకౌంట్ మూసివేస్తే జరిమానా విధిస్తారు. ఒక సంవత్సరంలోపు SCSS అకౌంట్ మూసివేస్తే కస్టమర్లకు ఎలాంటి వడ్డీ రాదు. గడువు ముగిసిన తరువాత మెచూరిటీని మరో మూడేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. కస్టమర్లకు లభించే వడ్డీ రూ.40,000 దాటితే, దానిపై ట్యాక్స్ విధిస్తారు. ఈ పథకంలో ప్రస్తుత వడ్డీరేటు 7.4 శాతంగా ఉంది.
5. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ (Post Office Savings Account)
వీటిపై వినియోగదారులకు నిర్ణీత వడ్డీ రేటు హామీ ఉంటుంది. ఏదైనా బ్యాంక్ బ్రాంచ్, పోస్టాఫీస్‌లలో పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చెక్, నాన్-చెక్ అకౌంట్లకు మినిమం బ్యాలెన్స్ వేర్వేరుగా ఉంటుంది. నాన్ చెక్ అకౌంట్లకు రూ.50, చెక్ సదుపాయం ఉండే అకౌంట్లలో రూ.500 తప్పనిసరిగా బ్యాలెన్స్ ఉండాలి. దీనికి నామినేషన్ సదుపాయం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి దేశవ్యాప్తంగా ఒక పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ను మాత్రమే ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. అకౌంట్ మూతపడకుండా ఉండాలంటే కనీసం మూడేళ్లకు ఒక్క లావాదేవీ అయినా చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 వరకు వచ్చే ఆదాయం ట్యాక్స్ పరిధిలోకి రాదు. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది.