నీటి గుర్రానికి 55వ బర్త్ డే.. పళ్లు, కూరగాయలతో భారీ కేక్

'మే మాలి' అనే పేరున్న ఆడ నీటిగుర్రానికి బర్త్ డే వేడుక చేశారు.దానికి ఇష్టమైన కూరగాయలు, పండ్లను కేకు రూపంలో పేర్చి అందించారు

news18-telugu
Updated: September 10, 2020, 1:36 PM IST
నీటి గుర్రానికి 55వ బర్త్ డే.. పళ్లు, కూరగాయలతో భారీ కేక్
55వ బర్త్‌డే చేసుకున్న నీటి గుర్రం.. పళ్లు, కూరగాయలతో భారీ కేక్
  • Share this:
సాధారణంగా పిల్లల పుట్టినరోజునాడు కేకు కోసి పంచిపెట్టడం, సంబరాలు చేసుకోవడం మనం చూస్తుంటాం. థాయిలాండ్‌లోనూ అలాంటి వేడుక ఒకటి జరిగింది. కానీ అది మనుషులకు కాదు. 'మే మాలి' అనే పేరున్న ఆడ నీటిగుర్రానికి జరిగింది. దానికి ఇష్టమైన కూరగాయలు, పండ్లను కేకు రూపంలో పేర్చి అందించారు జూ అధికారులు. రెండు సంవత్సరాల క్రితం బ్యాంకాక్‌లోని జంతుప్రదర్శనశాల నుండి తూర్పు థాయ్‌లాండ్‌లోని ఖావో ఖేవ్ ఓపెన్ జూకు వెళ్లిన మే మాలి వయసు 55 సంవత్సరాలు. హిప్పోల సగటు ఆయురార్థం 40 నుంచి 50 సంవత్సరాలు కాగా, మే మాలి ఏకంగా 55ఏళ్లపాటు జీవించి ఉండటం విశేషం. మే మాలి అంటే థాయ్ భాషలో "మదర్ జాస్మిన్" అని అర్థం.

"మే మాలి ఇప్పుడు ముసలిదైంది. దాని ఆరోగ్యం, ఆహారం, అది తిరగానికి అవసరమయ్యే వాతావరణం విషయంలో మేం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది ఇప్పటి వరకు 21 దూడలకు జన్మనిచ్చింది. దీనికి పుట్టిన హిప్పోలు ఆగ్నేయాసియా దేశాల్లోని వివిధ జంతుప్రదర్శనశాలల్లో ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే హిప్పోపొటామస్లలో ఒకటిగా అవతరిస్తుంది" అని జూ డైరెక్టర్ అట్టపోర్న్ శ్రీహైరున్ తెలిపారు.

ఆఫ్రికాలోని సహారా ప్రాంతాల నదులు, సరస్సులలో నీటిగుర్రాలు ఎక్కువగా నివసిస్తుంటాయి. ఇలా అడవిలో నివసించేవి వేటగాళ్ల బారిన పడుతున్నాయి. ఫిలిప్పీన్స్లో ఎక్కువ కాలం జీవించిన హిప్పోగా పేరున్న బెర్తా అనే నీటిగుర్రం.. 2017లో 65 సంవత్సరాల వయస్సులో మరణించింది. ఫ్లోరిడాలోని వన్యప్రాణి పార్కులో నివసిస్తున్నమరో హిప్పోపొటామస్ లూసిఫర్.. ఈ ఏడాది జనవరిలో తన 60 వ పుట్టినరోజును జరుపుకుంది. పెద్ద హిప్పోలు 1,500కిలోల(3,304 పౌండ్లు) నుంచి 3,200 కిలోల వరకు బరువుంటాయి. ఇవి ఏనుగు తరువాత భూమిపై నివసించే రెండవ భారీ జంతువులు.

పగటి వేడిని తట్టుకోలేక నీటిలో గడుపుతాయి. గడ్డి, పండ్లను తినడానికి రాత్రి ఒడ్డుకు చేరుకుంటాయి. ప్రపంచ వన్యప్రాణి నిధి అంచనా ప్రకారం అడవుల్లో నివసించే నీటిగుర్రాల సంఖ్య కేవలం 1,15,000 నుంచి 1,30,000 వరకు మాత్రమే.
Published by: Shiva Kumar Addula
First published: September 10, 2020, 1:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading