కొన్ని జీవులు... ఆడవి మగవిగా... మగవి ఆడవిగా ఎలా మారగలుగుతున్నాయి... వీడిన మిస్టరీ...

ఇది నమ్మడానికి కాస్త చిత్రమైన విషయమే. కానీ ఇది నిజం. ప్రతి పది రోజుల్లో ఓ ఆడ చేప... మగ చేపగా మారిపోతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 11, 2019, 11:30 AM IST
కొన్ని జీవులు... ఆడవి మగవిగా... మగవి ఆడవిగా ఎలా మారగలుగుతున్నాయి... వీడిన మిస్టరీ...
బ్లూహెడ్ రస్సే చేపలు (Image : Twitter / Becky Ferreira)
  • Share this:
మన శరీరంలో చాలా భాగాల్లో మార్పులు వస్తాయి గానీ... సెక్స్ (మగ, ఆడ) అనేది మారదు. కానీ.. "బ్లూహెడ్ రస్సే" (Bluehead Wrasse) అనే చేప విషయంలో మాత్రం... ఈ మార్పు వస్తోంది. ఈ చేపలు... ఆడవి కాస్తా మగవిగా మారిపోతున్నాయి. పది రోజుల్లోనే ఈ మార్పు మొత్తం జరిగిపోతోంది. ఇది ఎలా సాధ్యమవుతోందో... సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించిన అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు వివరించారు. శాస్త్రవేత్తలు కరీబియన్ సముద్రంలోని పగడపు దిబ్బల్లో గుంపుగా ఉన్న చేపల్లో వాటిని కాపాడుతున్న ఓ పెద్ద మగ బ్లూహెడ్ రస్సే చేపను అక్కడి నుంచీ తొలగించారు. వెంటనే అక్కడి ఓ ఆడ బ్లూహెడ్ రస్సే చేప... తన గుంపు నుంచీ కొన్ని నిమిషాలకే వేరుగా వచ్చేసింది. కొన్ని గంటల్లో దాని రంగును మార్చేసుకుంది. వారం తిరిగేసరికి ఆ పసుపు రంగు ఆడ చేప కాస్తా... నీలి రంగు మగ చేపగా మారిపోయింది. ఇదెలా జరిగిందంటే... చేపలోని జన్యువుల్లో పూర్తిస్థాయి మార్పులు రావడం వల్లే అంటున్నారు సైంటిస్టులు.

సెక్స్ మార్పిడి అన్నది ఎలా జరిగిందన్నదానిపై సైంటిస్టులు మరింత లోతుగా అధ్యయనం చేశారు. అడతనం నుంచీ మగవాటిగా మారిన చేపలపై పరిశోధనలు చేశారు. ఆ చేపల మెదళ్లను స్కాన్ చేశారు. చిత్రమేంటంటే... వాటి మెదళ్లలోని జన్యువుల్లో ఎలాంటి మార్పులూ జరగలేదు. కానీ ప్రత్యుత్పత్తి కణాల్లో మాత్రం మార్పులు కనిపించాయి. వాళ్లకు అర్థమైందేంటంటే... అప్పటివరకూ ఆడదానిగా ఉన్న చేపలో... ఆడతనానికి సంబధించిన జన్యువులు... ఒక్కసారిగా... స్విచ్ఛాఫ్ అయినట్లుగా పనితనం ఆపేశాయి. వెంటనే మగతనానికి సంబంధించిన జన్యువులు పుట్టుకొచ్చి... వేగంగా అభివృద్ధి చెందాయి.


ఐతే... ఆడచేపలో ఈస్ట్రోజన్‌ను ఉత్పత్తి చేసే జన్యువులు ఒక్కసారిగా ఎందుకు పనిచేయడం మానేశాయన్నది మిస్టరీగానే మిగిలిపోయింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... తమ గుంపులోని పెద్ద చేపను శాస్త్రవేత్తలు తొలగించడంతో... ఆందోళన చెందిన ఆడ చేప... ఆ ఒత్తిడి వల్ల క్రమంగా మగచేపగా మారిపోయిందని భావిస్తున్నారు. ఒత్తిడి వల్ల చేపలోని న్యూరోట్రాన్స్‌మిట్టర్స్‌లో మార్పులు వచ్చి... ఆడతనానికి సంబంధించిన జన్యువులు దాదాపు చనిపోయి... మగతనానికి సంబంధించిన జన్యువులైన ఆండ్రోజెన్ సింథెసిస్ పుట్టుకొచ్చాయని అంచనాకి వచ్చారు శాస్త్రవేత్తలు.

ఈ భూమిపై ఉన్న సముద్రాల్లో దాదాపు 500 రకాల చేపలు... తమ సెక్స్‌ (ఆడ, మగ)ని మార్చుకోగలవు. ఈ ప్రక్రియను సైన్స్‌లో సీక్వెన్షియల్ హెర్మాప్రోడిటిజ్మ్ (sequential hermaphroditism) అంటారు. బ్లూహెడ్ రస్సే లాంటి చేపలు... ఆడతనం నుంచీ మగవిగా మారుతుంటే... క్లౌన్ ఫిష్ లాంటి చేపలు... మగతనం నుంచీ ఆడతనానికి మారిపోతున్నాయి. డ్రాగన్ లిజార్డ్స్, జీబ్రాఫిష్ లాంటివి... వాతావరణంలో మార్పులు రాగానే... తమ సెక్స్‌ని మార్చేసుకుంటున్నాయి.
ఈ దిశగా లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మార్పు అనేది చాలా తక్కువ సంఖ్యలోనే జరుగుతోంది. అలా ఎందుకన్నదానిపై పరిశోధిస్తున్నారు. ఏదో ఒక రోజున ఆ మిస్టరీ కూడా తేలిపోయే అవకాశాలున్నాయి.
First published: July 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>