రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన అతిపెద్ద బాంబును అక్టోబర్ 13న సురక్షితంగా పేల్చివేశారు నార్త్ వెస్టర్న్ పోలాండ్ నావికాదళ నిపుణులు. 5 వేల కిలోల( సుమారు 5.4- టన్నుల) బరువున్న ఈ టాల్బాయ్ బాంబు పోలాండ్లో ఇప్పటివరకు ఉపయోగించిన అతిపెద్ద బాంబుగా చెబుతున్నారు అక్కడి అధికారులు. కాగా ఈ బాంబును 2019 సెప్టెంబర్లో స్జ్జెసిన్ నౌకాశ్రయ జలమార్గంలో అక్కడి నావికాదళ అధికారులు కనుగొన్నారు. ఈ ప్రాంతం ప్రసిద్ధ బాల్టిక్ సముద్రం దక్షిణ అంచున ఉన్నందున భారీ ఆపరేషన్తో బాంబు పేల్చే ప్రక్రియను చేపట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా 750 మందికి పైగా స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ నౌకాశ్రయం జర్మన్ నాజీల సైనిక నౌకాశ్రయంగా ఉండేది. కాగా, ఆపరేషన్లో భాగంగా పోలిష్ నేవీ నిపుణులు బాంబును రిమోట్ డిఫ్లగ్రేషన్ ప్రక్రియ ద్వారా నీటి అడుగునే పేల్చడానికి ప్రయత్నించినప్పటికీ, బాంబు పేలుడుతో నీరు అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. అయినప్పటికీ ఎటువంటి నష్టం సంభవించలేదు.
ఈ ఆపరేషన్ కు నాయకత్వం వహించిన నావికాదళ ప్రతినిధి, లెఫ్టినెంట్ కల్నల్ గ్రెజోర్జ్ లెవాండోవ్స్కీ అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘పేలుడుకు ముందే స్థానిక ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాం. తద్వారా ఈ ఆపరేషన్లో ఎవరూ గాయపడలేదు. ఈ ఆపరేషన్ని సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించాం. పోలాండ్లో నావికాదళ నిపుణులు చేసిన అతి పెద్ద ఆపరేషన్ ఇదే’’ అని ఆయన పేర్కొన్నారు.
Biggest World War Two bomb found in Poland explodes under water while being defused https://t.co/oucLfGyTDA pic.twitter.com/T2Zdbzqumk
— Reuters (@Reuters) October 14, 2020
కాగా, బ్రిటిష్ రెండో ప్రపంచ యుద్దంలో ఉపయోగించిన పేలని బాంబులు, క్షిపణులు మరియు గ్రెనేడ్లు ఈ ప్రదేశంలో ఇప్పటికీ చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అతిపెద్ద టాల్బాయ్ బాంబును బ్రిటిష్ ఏరోనాటికల్ ఇంజనీర్ బర్న్స్ వాలిస్ రూపొందించారు. నాజీ-ల నియంత్రణలో ఉన్న ఆస్తులను ధ్వంసం చేయడానికి రాయల్ ఎయిర్ ఫోర్స్ ఈ బాంబును ఉపయోగించింది. అయితే, 1945 ఏప్రిల్లో నాజీ జర్మన్ యుద్ధనౌక అయిన లుయెట్జోలో ఈ బాంబును ఉపయోగించి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, యుద్ద సమయంలో ఇది పేలడంలో ఎందుకు విఫలమైందో మాత్రం నిపుణులు స్పష్టం చేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast