జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే మాట్లాడకుండా వెళ్లిపోవడం, "నో కామెంట్" అని చెప్పి వెళ్లిపోవడం చాలా మందికి అలవాటు. ప్రెస్ మీట్ పెట్టేది ఎందుకు.. ప్రభుత్వ విధానాల గురించి ప్రజలకు తెలపడం కోసం.. అలానే ప్రభుత్వ పని తీరుపై వచ్చిన ఆరోపణలను ప్రజల తరఫున ప్రశ్నించడానికి. అందుకే చాలా మంది నాయకులు ప్రెస్ మీట్స్ అంటే భయపడతారు. ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొవాల్సి వస్తుందో.. ఎక్కడ నోరు జారతామో అని ప్రెస్ మీట్లు పెట్టరు. ఒకవేళా పెట్టినా నచ్చని ప్రశ్నలు ఎదురైతే సమాధానం చెప్పకుండా దాట వేస్తారు. అంతే తప్ప ప్రశ్నలు అడిగిన రిపోర్టర్ల మీద దాడి చేయడం అసంభవం. ఓ స్థాయిలో ఉన్న వాళ్లెవరూ ఇంతకు మించి ఘోరంగా ప్రవర్తించరు. అయితే సాక్షాత్తు ఓ దేశ ప్రధాని, జర్నలిస్టులు అడిగిన ప్రశ్న తనకు నచ్చకపోవడంతో వారిపై శానిటైజర్ స్ప్రే చేస్తూ వెళ్లడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన థాయ్‌ల్యాండ్‌లో వెలుగు చూసింది.
థాయ్ ప్రధాని చాన్ ఓ చా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. దానికి హాజరైన విలేకరులు.. తాజాగా ఆ దేశంలో జైలుపాలైన మంత్రుల గురించి, వారి స్థానంలో కొత్తగా ఎవరిని తీసుకుంటారని ప్రశ్నించారు. రిపోర్టర్ల ప్రశ్నలకు విసిగిపోయిన ప్రధాని ప్రయూత్.. "మీరు అడగవలసిన ప్రశ్నలు ఇంకా ఏమైనా మిగిలాయా.. ఇలాంటి విషయాలన్ని నాకు కనిపించడం లేదు ఎందుకో.. ఇవన్ని ముందుగా తెలియాల్సింది ప్రధానికే కదా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ప్రధాని దగ్గరలోని హ్యాండ్ శానిటైజర్ బాటిల్ తీసుకొని వెళ్లి అక్కడున్న జర్నలిస్టులందరిపైనా స్ప్రే చేశారు. ఆ సమయంలో తన మొహానికి మాస్కు అడ్డుపెట్టుకొని ఉన్న ఆయన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ప్రధాని చర్యలపై నెటిజనులు మండి పడుతున్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Thailand, Trending, Viral Video