బయ్య సన్నీయాదవ్.. ఈ పేరుతో చాలా మందికి పరిచయం ఉండకపోవచ్చు. కానీ యూ ట్యూబ్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకు మాత్రం కచ్చితంగా ఎక్కడో ఓ చోట ఈ పేరు తగిలే ఉంటుంది. 24 ఏళ్ళ ఈ కుర్రాడికి ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు వాళ్లు యూ ట్యూబర్స్‌గా మారి క్రేజ్ తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. మన దగ్గర ఈ ట్రెండ్ కాస్త తక్కువ. బైక్ రైడింగ్ చేస్తారేమో కానీ దాన్నే ప్రొఫెషన్‌గా మార్చుకున్న వాళ్లు మాత్రం తక్కువే. అలాంటి బైకర్ కమ్ యూ ట్యూబర్ బయ్య సన్నీయాదవ్. ఈయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా కుర్రాళ్లు అయితే మనోడి వీడియోలు చూసి ఫిదా అయిపోతుంటారు.
అలాంటి సన్నీయాదవ్ గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. నిజానికి మనోడు చదువులో బాగా పూర్. ఎంతంటే పాలిటెక్నిక్ కూడా పాస్ అవ్వలేనంతగా. చదువు అంతగా రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక కొన్నేళ్ల పాటు ఇంట్లోనే ఖాళీగా ఉండి.. అప్పుడు యూ ట్యూబ్ వీడియోలు చేయాలని ఫిక్సైపోయాడు. ఇదే విషయాన్ని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు బయ్య సన్నీయాదవ్. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన తర్వాత రైడింగ్ వీడియోలు చేయాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు సన్నీ. అప్పటికే తాను ముంబై కా నిఖిల్ అనే యూ ట్యూబర్‌ను ఫాలో అవుతున్నట్లు చెప్పుకొచ్చాడు సన్నీ.
తెలుగులో ఇలాంటి రైడింగ్ వీడియోలతో ఛానెల్ ఎవరూ మొదలుపెట్టలేదని.. చేసిన తెలుగులో కాకుండా హిందీ, ఇంగ్లీష్‌లో చేస్తున్నారు కాబట్టి తాను ఇలాంటిది చేస్తే బాగుంటుందని అనుకుని ఇప్పుడు అలా చేస్తున్నట్లు చెప్పాడు సన్నీయాదవ్. రెగ్యులర్ టైప్ కాకుండా ఏదైనా డిఫెరెంట్‌గా చేయాలనే ఉద్దేశ్యంతోనే తన రైడ్స్‌తో తెలుగులో మాట్లాడుతూ కాస్త ఎంటర్‌టైన్మెంట్ కూడా ఇస్తుంటానని చెప్పాడు ఈయన. ఇంట్లో వాళ్లు బైక్ రైడింగ్ రిస్క్ అని ముందు కాస్త ఆపినా కూడా ఆ తర్వాత తనపై ఉన్న నమ్మకంతో ఓకే చెప్పారని చెప్పాడు సన్నీ. 8వ తరగతి నుంచే తను బైక్ నడపడంతో ఆ నమ్మకంతోనే తమ వాళ్లు అడ్డు చెప్పలేదని చెప్పాడు బయ్య సన్నీయాదవ్. ఇక తన ఇంటిపేరు బయ్య అని.. అందుకే అలా పెట్టుకున్నాను కానీ అది భయ్యా కాదు అని చెప్పాడు సన్నీ.
తనకు రైడింగ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సురేందర్ రెడ్డితో పాటు వంశీ ఉన్నాడని చెప్పాడు. ప్రతీ రైడ్‌కు కనీసం 50 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు అవుతుందని.. అది 20 రోజులకు సరిపోతుందని చెప్పాడు సన్నీ. ఇండియా దాటేస్తే లక్ష కావాల్సిందే అంటున్నాడు సన్నీయాదవ్. ఇప్పటి వరకు ఈయన పోస్ట్ చేసిన యూ ట్యూబ్ వీడియోలు మంచి వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా మనోడికి సెలబ్రిటీ హోదా కూడా తీసుకొచ్చాయి. ఇప్పటికే లడక్, నేపాల్ లాంటి భారీ రైడ్స్ పూర్తి చేసాడు. త్వరలోనే ఇంటర్నేషనల్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాడు బయ్య సన్నీయాదవ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Youtube, Youtube star