హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

సీఎం సార్.. బిల్లు కట్టండి, కేసీఆర్‌కు పోలీసుశాఖ లేఖ

సీఎం సార్.. బిల్లు కట్టండి, కేసీఆర్‌కు పోలీసుశాఖ లేఖ

kcr, ts police

kcr, ts police

ఫోటోచూసి.. దాని మీద హెడ్డింగును చూసి.. ఆశ్చర్యపోతున్నారా? సీఎం కేసీఆర్ ఏంటి, బిల్లు బకాయి పడడమేంటీ అనుకుంటున్నారా? ఇంతకీ ఆయన ఎవరికి బిల్లు బకాయి పడ్డారు? ఏమా కథ?

  కేసీఆర్.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంతేకాదు, వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పారు. అలాంటి కేసీఆర్.. ప్రభుత్వానికి బకాయి పడ్డారట. తెలంగాణ పోలీసు శాఖకు బిల్లు కట్టాల్సి ఉందట. అసలు విషయం ఏమిటంటే.. గత సంవత్సరం సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7 వరకు.. ఎన్నికల సంఘం ఆదేశాలతో తెలంగాణ పోలీసుశాఖ.. కేసీఆర్ సహా రాష్ట్రంలోని వివిధ పార్టీల్లోని కీలక నాయకులకు భద్రత నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించింది. అయితే, ఆ వాహనాలకు సంబంధించిన బిల్లును ఆయా నాయకులకు చెందిన పార్టీలే చెల్లించాల్సి ఉంటుంది.


  ఎన్నికల తంతు ముగిసింది. ఫలితాలు వచ్చేశాయి. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరింది. అయినా ఇప్పటివరకూ రాజకీయ పార్టీలు.. బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలకు సంబంధించిన బకాయిలను చెల్లించలేదు. దీంతో పోలీసుశాఖ కేసీఆర్ సహా 33 మంది వివిధ పార్టీల నేతలకు లేఖలు రాసింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వాడకానికి సంబంధించి బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. కేసీఆర్ సహా మొత్తం 33 మంది నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించినట్టు లేఖలో పేర్కొంది. కిలోమీటర్ల ఆధారంగా బిల్లులను నిర్ణయించి.. ఆయా నేతలకు పంపింది.


  ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని కీలక నేతలపై మావోయిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ సమాచారంతో.. ఎన్నికల సంఘం అన్ని పార్టీల స్టార్ క్యాంపెయినర్లకు భద్రత కల్పించాలని పోలీసుశాఖను ఆదేశించింది. కేసీఆర్, మాజీ మంత్రులు, మధుసూధనాచారి, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, బీజేపీ నేత కిషన్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీలతో సహా పలువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించింది. దీనికి సంబంధించిన బిల్లులను ఆయా నేతలకు చెందిన పార్టీలే చెల్లించాల్సి ఉంటుంది. సీఎంగా కేసీఆర్ భద్రతను ప్రభుత్వమే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేసిన అన్ని పర్యటనల్లో బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాల ఉపయోగానికి సంబంధించిన బిల్లులను మాత్రం టీఆర్ఎస్ పార్టీనే చెల్లించాల్సి ఉంటుంది. అందుకే, అందరితో నేతలతో పాటు కేసీఆర్‌కు కూడా బిల్లు చెల్లించాలంటూ పోలీసుశాఖ లేఖ రాసింది. ఒక్కో నాయకుడు రూ. 57 వేల నుంచి రూ. 8 లక్షల వరకు చెల్లించాల్సి ఉన్నట్టు తెలిపింది.

  First published:

  Tags: CM KCR, Jana reddy, Revanth reddy, Telangana, Telangana Election 2018, Telangana News, TS Police

  ఉత్తమ కథలు