సాధారణంగా టెడ్డీబేర్లు(
Teddy Bear) అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. వాటితో ఆడుకునేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకొందరైతే వాటికి ముచ్చట్లు కూడా చెబుతారు. అయితే ఒకరి దగ్గరే వేలల్లో టెడ్డీ బేర్లు ఉంటాయని ఊహిస్తామా.. కష్టమే. అయితే హంగేరీకి చెందిన ఓ బామ్మ మాత్రం ఏకంగా టెడ్డీ బేర్లతోనే గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. 20వేల టెడ్డీ బేర్లను దాచుకున్నారు.
హంగేరీకి చెందిన వలేరియా స్మిట్ 40 సంవత్సరాలుగా టెడ్డీ బేర్లను కలెక్ట్ చేస్తున్నారు. మొత్తంగా వాటి సంఖ్య 20వేలు దాటాయి. ప్రపంచంలో అత్యధిక టెడ్డీబేర్లు కలిగిన వ్యక్తిగా 2019లోనే ఆమె గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. దీంతో ఆమె టెడ్డీబేర్ మామ (Teddy Bear Mama)గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె టెడ్డీబేర్లతో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“నేను 40ఏళ్ల నుంచి టెడ్డీబేర్లను కలెక్ట్ చేస్తున్నా. 13వేలతోనే నేను హంగేరియన్ అవార్డును గెలుచుకున్నా. ఆ తర్వాత గిన్నిస్ రికార్డు కోసం ముందుకుసాగా. నేను ఎన్నో టెడ్డీ బేర్లను నర్సరీలకు, ప్రి స్కూల్స్‌కు, పేద కుటుంబాలకు ఇచ్చా. చిల్డ్రన్ ఇన్స్టిట్యూట్స్ కోసం ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేశా. 30 నుంచి 50 టెడ్డీబేర్లతో ఆడుకునేలా టెడ్డీ బేర్ కార్నర్లను రూపొందించాం” అని వలేరియా చెప్పారు.
అయితే తనకు టెడ్డీబేర్లంటే ఎందుకంత ఇష్టమో కూడా వలేరియా చెప్పారు. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని వెల్లడించారు. అదేసమయంలో తన తల్లి మద్యం తాగేవారని చెప్పారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న టెడ్డీ బేర్‌తో ఎక్కడికైనా వెళ్లేదాన్ననని, చుట్టూ జరుగుతున్న విషయాలను పట్టించుకోకుండా ఉండేదుకు టెడ్డీలు సహకరించేవని ఆమె తెలిపారు.
“సరిగా ప్రేమను పొందలేకున్న, ఆడుకునేందుకు బొమ్మలు లేని, ఆర్థిక స్థోమత లేని పిల్లల కోసం నేను ఈ టెడ్డీబేర్లను సిద్ధం చేస్తున్నా. నా ఎగ్జిబిషన్‌కు వచ్చిన సమయంలో పిల్లల కళ్లలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని చూస్తున్నా” అని ‘టెడ్డీబేర్ మామ’ వలేరియా చెప్పారు.