తమిళనాడును కరువు నుంచి కాపాడేది రైతులే.. జగ్గీ వాసుదేవ్ కీలక వ్యాఖ్యలు..

జగ్గీ వాసుదేవ్ (Instagram Photo)

sadhguru jaggi vasudev: తమిళనాడును రక్షించేది రైతులేనని, వారి వల్లే నదులు జీవంతో ఉంటాయని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు.

  • Share this:
కరువుతో కొట్టుమిట్టాడుతున్న తమిళనాడును రక్షించేది రైతులేనని, వారి వల్లే నదులు జీవంతో ఉంటాయని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. గత కొన్నేళ్లుగా తమిళనాడు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, 2015లో వరదలు ముంచెత్తగా.. 2016, ఇప్పుడు కరువుతో అల్లాడుతోందని ఆయన గుర్తుచేశారు. నీటి వ్యవస్థపై శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, నీరు అనేది సరుకు కాదని, అది జీవనాధారం అని జగ్గీ వాసుదేవ్ వ్యాఖ్యానించారు. మన నీటిలో 4% మాత్రమే మంచు కరిగి లభ్యమవుతోందని, మిగతా 96% నీరు వర్షా కాలంలో కురిసే వర్షం నుండే వస్తోందని చెప్పారు. ఆ 50-60 రోజులలో కురిసే నీళ్లను మనం 365 రోజుల పాటు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నీటిని కాపాడుకోవడానికి డ్యాములను నిర్మిస్తున్నా, చెట్లు పెంచకపోతే నీటిని ఒకచోట స్థిరంగా ఉంచలేమని తెలిపారు.

చెట్ల నుండి, పశువుల నుండి వచ్చిన సేంద్రియ పదార్ధం నేలలో తగినంత ఉంటే.. నేల నీటిని నిలుపుకుని, అదే కొద్ది కొద్దిగా భూగర్భ జలంగా మారి నదిలోకి చేరుకుంటుందని అన్నారు. మనకు తగినంత వృక్ష సంపద లేనందువల్లే వాన నీరు అతి తొందరగా నదిలోకి చేరిపోతోంది, ఇది వరదలకు దారితీస్తోందని వెల్లడించారు. ‘ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, పదివేల చెట్లు ఉన్న ప్రదేశంలో 38 మిలియన్ లీటర్ల నీరు భూమిలోకి చేరుతుందని అంచనా. కావేరి 83,000 చదరపు కిలోమీటర్ల విస్తారం కలది, అందులో మనం 87% ప్రదేశంలో నుండి వృక్షాలను మాయం చేసాం. ఎంత నీటిని కోల్పోతున్నామో ఊహించండి. నీటి ఎద్దడిని గురించి ఒక్క వేసవి కాలంలోనే ఆలోచిస్తే సరిపోదు. మనం అప్రమత్తమవ్వాలి’ ఆయన పిలుపునిచ్చారు.

‘చెన్నై ఉదాహరణ తీసుకోండి. ఒకప్పుడు అక్కడ 1500 సరస్సులు, చెరువులు ఉండేవని చెప్తారు. ఇప్పుడవి ఎక్కడా కనబడవు. సహజంగా నీరు పారే వ్యవస్థ గురించి అవగాహన లేకుండా బాధ్యతారహితంగా పట్టణాలను అభివృద్ధి చేస్తూ పోవడం వలనే ఈ దుస్థితి వచ్చింది’ అని జగ్గీ వాసుదేవ్ వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా ఆనకట్టలు కట్టి భూమిలో ఉన్న ఆక్రుతులని నీరు మెల్లగా ఇంకడానికి ఉపయోగించవచ్చని, కానీ మౌలికంగా ఇది పచ్చదనంతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయక అటవీకరణం ఒక్కటే మార్గమని, రైతులని సేంద్రీయ వ్యవసాయానికి, వ్యవసాయక ఆటవీకరణ వైపు ప్రోత్సహించాలని అన్నారు.

పశువుల నుండి, చెట్లనుండి లభ్యమయ్యే సేంద్రియ పదార్థాలు భూమిలోని సారాన్ని తిరిగి భర్తీ చేస్తూ ఉంటుంది. సేంద్రియ వ్యవసాయం భూ సారాన్ని తిరిగి భర్తీ చేయడమే కాక నదులను కూడా భర్తీ చేస్తుంది. దీనితో రైతు ఆదాయం కూడా మూడు నుండి ఎనిమిది రెట్లు పెరగడానికి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిపి వ్యవసాయక అటవీకరణలోని లాభాలు రైతులకి చూపగలిగితే దేశ వ్యాప్తంగా రైతులు దీనిని సహజంగానే స్వీకరిస్తారు.
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్

రాబోయే దశాబ్దకాలంలో నదిని తిరిగి పునరుజ్జీవింపజేయగలమని ప్రపంచానికి చూపగలగాలని, అదే సమయంలో రైతుల ఆదాయం ఎన్నో రెట్లు పెంచాలని జగ్గీ వాసుదేవ్ పిలుపునిచ్చారు. రైతుకు తగిన శిక్షణ ఇచ్చి, ప్రభుత్వాలు వారికి చేయూతనివ్వాలని సూచించారు.
First published: