TAMIL NADU ANNOUNCES FULL LOCKDOWN ON SUNDAYS AMID COVID SURGE NIGHT CURFEW FROM 6 JAN MKS
lockdown: ఇక ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్.. నైట్ కర్ఫ్యూ షురూ : సీఎం సంచలన ఆదేశాలు
ప్రతీకాత్మక చిత్రం
కరోనా మళ్లీ విజృంభిస్తూ, కొత్త కేసులు, మరణాలు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. ఇకపై ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుందని, నేటి (జనవరి 6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని తమిళనాడు అధికారులను సీఎం స్టాలిన్ ఆదేశించారు. పగటి పూట కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించించారు..
కరోనా సంక్షోభంలో ఆదివారం ఒక్కటే ఆటవిడుపు అని భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాన్ని వెంటనే మార్చేసుకోండి. ఎందుకంటే ఈనెల 9తో మొదలై ఇక ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగనుంది. రాత్రి పూట కర్ఫ్యూ నేటి నుంచే మొదలువుతుంది. కరోనా ఉధృతి తగ్గుదలను బట్టి ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా లాక్ డౌన్, కర్ఫ్యూలపై ఇదే విధానం అమల్లో ఉంటుంది. కరోనా వైరస్ మరోసారి పురివిప్పిన పరిస్థితిలో ఈ ఆదేశాలు ప్రస్తుతానికి తమిళనాడుకు మాత్రమే పరిమితం కాగా, రాబోయే రెండు వారాల్లో థర్డ్ వేవ్ తలెత్తనుందనే హెచ్చరికల నేపథ్యంలో మిగతా రాష్ట్రాలూ లాక్ డౌన్ విధించాల్సిన అనివార్య పరిస్థితి రావొచ్చనే అంచనాలున్నాయి. తమిళనాడులో కొవిడ్ కట్టడిపైనే పూర్తిగా ఫోకస్ పెట్టిన సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రకటనలు వెలువడ్డాయి..
ఇకపై ప్రతి ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. నేటి (జనవరి 6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఆదివారాలు లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూతోపాటు పగటి పూట కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది డీఎంకే సర్కారు.
చెన్నై సిటీతోపాటు తమిళనాడు అంతటా బస్సులు, సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపేందుకు అవకాశం కల్పించారు. అన్ని రకాల పార్కులను మూసేయనున్నారు. వారాంతం మూడు రోజులు(శుక్ర, శని, ఆదివారాల్లో) అన్ని ప్రార్థనా మందిరాలకు ప్రజల్ని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఆదివారాలు పూర్తి స్థాయి లాక్ డౌన్ లోకి వెళ్లాల్సి ఉన్నందున మెగా వ్యాక్సినేషన్ క్యాంపులను శనివారం నిర్వహిస్తామని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ చెప్పారు.
తమిళనాడులో బుధవారం వెల్లడైన లెక్కల ప్రకారం కొత్తగా 2,731 కొవిడ్ పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒక్క రోజులోనే 9 మంది కరోనాకు బలయ్యారు. చైన్నై సహా ఐదు జిల్లాల్లో కొత్త కేసుల ఉధృతి ఎక్కువగా ఉంది. కొత్తవాటితో కలిపి తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27.55లక్షలకు చేరగా, మరణాల సంఖ్య 36,805కు పెరిగిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. తమిళనాడులో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 121కి చేరాయి. లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ ఆదేశాలను ప్రజలంతా తప్పక పాటించాలని, లేకుంటే శిక్షార్హులు అవుతారని అధికారులు హెచ్చరించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.