గ్రెటా థన్ బర్గ్.. స్విడన్ కు చెందిన 18 ఏళ్ల యువతి తన 11వ ఏట నుంచే కుటుంబీకులు లేకుండానే ప్రపంచ యాత్రలు చేస్తూ పర్యావరణంపై అవగాహన కల్పిస్తోంది. ఆమెకంటే రెండేళ్లు చిన్నదైన మరో స్విడన్ బాలిక సైతం ఇంట్లోవాళ్లకు చెప్పాపెట్టకుండా ఇండియా వచ్చేసింది. అయితే ఈమెది పర్యావరణహితం కాదు.. పూర్తిగా ప్రేమ మైకం. ముంబైలోని మురికివాడలో నివసించే 18ఏళ్ల యువకుడితో కేవలం సోషల్ మీడియా పరిచయంలోనే ప్రేమించేసి, పారిపోయి వచ్చి, ఏకంగా ఫ్లాట్ తీసుకుని ఆల్మోస్ట్ కాపురం మొదలుపెట్టిన ఆమెపై ఇంటర్ పోల్ నోటీసులు సైతం జారీ అయ్యాయి. నాటకీయ పరిణామాల మధ్య ముంబై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అడుగడుగునా అవాక్కనిపించే ఈ కథనానికి సంబంధించి ముంబై పోలీసులు చెప్పిన వివరాలివి...
ఇంటర్‌పోల్ నోటీసులు..
సర్దార్ తోమర్ అనే భారతీయ మూలాలున్న వ్యక్తి తరాలుగా స్విడన్ లో నివసిస్తున్నారు. వ్యాపారవేత్తగా రాణించిన ఆయనకు స్థానికంగా మంచి పలుకుబడి ఉంది. ఆయన పెద్దకూతురైన 16ఏళ్ల బాలిక నవంబర్ 27 నుంచి కనిపించకుండా పోయింది. కూతురి మిస్సింగ్ పై తోమర్ కుటుంబం స్విడన్ పోలీసులను ఆశ్రయించగా, మొబైల్ ఫోన్, కార్డులు వాడిన రికార్డులను బట్టి ఆమె స్విడన్ నుంచి ముంబై ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ వ్యవహారం కావడంతో ఇంటర్ పోల్ ను ఆశ్రయించారు. బాలికపై ఎల్లో నోటీసులు జారీ చేసిన ఇంటర్ పోల్.. ఆమె ఫొటోలు, ఇతరత్రా వివరాలతో ముంబై పోలీసులకు సమాచారం అందించింది.
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ..
స్విడన్ నుంచి ముంబై వచ్చిన బాలిక జాడ 15 రోజుల తర్వాతగానీ దొరకలేదు. తూర్పు ముంబై చెంబూర్ ప్రాంతంలోని చీతా క్యాంప్ మురికివాడలో ఓ సింగిల్ రూమ్ లో నివసిస్తోన్న బాలికను పోలీసులు గుర్తించారు. అది కూడా.. ఆమె స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోల ఆధారంగా ఏరియాను గుర్తించి జల్లెడపట్టారు పోలీసులు. ఇంతకీ ఏం జరిగిందటే.. ముంబైకి చెందిన 18 ఏళ్ల యువకుడికి, 16ఏళ్ల స్విడన్ బాలిక ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. ఇన్ స్టాగ్రామ్ బాగా వాడే అలవాటున్న ఈ ఇద్దరూ పరిచయం తర్వాత గంటలపాటు చాటింగ్స్, కాల్స్ చేసుకునేవారు. క్రమంగా ఫోన్ లోనే ప్రేమ చిగురించింది. తాను స్విడన్ రాలేనని ప్రియుడు చెప్పడంతో అతని కోసం ఆమెనే సాహసం చేసింది..
ఇల్లు తీసుకుని సంసారం..
ఇంట్లో వాళ్లకు చెప్పకుండా తన వీసాను, కొంత డబ్బును తీసుకుని బాలిక టూరిస్ట్ నెపంతో నవంబర్ 27న ముంబై వచ్చేసింది. సోషల్ మీడియా ప్రేయసి సడెన్ గా స్విడన్ నుంచి వచ్చే సరికి కంగారు పడటం స్లమ్ కుర్రాడి వంతైంది. తల్లిదండ్రులతో కలిసి అతనుండే ఇరుకు ఇంట్లో మరో వ్యక్తికి చోటు లేని పరిస్థితి. దీంతో చీతా క్యాంప్ లోనే ఓ సింగిల్ రూమ్ ను అద్దెకు తీసుకున్నారిద్దరూ. అలా రెండు వారాలపాటు ఎంజాయ్ చేస్తూపోయారు. ఈలోపే స్విడన్ లోని తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం ఇంటర్ పోల్ ఎల్లో నోటీసులదాకా వెళ్లడంతో ముంబై పోలీసులు చాకచక్యంగా అమ్మాయిని పట్టుకోగలిగారు.
ఇంటికి పోయే ముందు ఇలా..
బాలిక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్, ఆమెతో తరచూ చాటింగ్, ఫోన్ కాల్స్ మాట్లాడిన యువకుడిని గుర్తించిన ముంబై పోలీసులు.. అతను పోస్ట్ చేసిన ఫొటోలను బట్టి, మొబైల్ ఐడీలను బట్టి ఏరియాను ట్రేస్ చేసి ముమ్మరంగా సోదాలు, తనిఖీలు చేశారు. చివరికి మొన్న శుక్రవారం ఆ బాలిక పోలీసుల చేతికి చిక్కింది. ఆమెను రెస్క్యూ హోంకు తరలించిన వెంటనే ఇంటర్ పోల్ కు సమాచారం పంపారు. కూతురు దొరికిందనే సమాచారంతో సర్దార్ తోమర్ సైతం ముంబై వచ్చేశారు. బాలికను తండ్రికి అప్పగించిన పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఇంట్లోవాళ్లకు చెప్పకుండా వచ్చేసి, రెండు వారాలపాటు తెలియని ఊళ్లో తెలియని వ్యక్తితో ఇలా గడిపడం పొరపాటేనని బాలిక కూడా పశ్చాత్తపం వ్యక్తం చేసింది. అదృష్టవశాత్తూ స్లమ్ డాగ్ ప్రియుడికి నేర చరిత్ర, నేర స్వభావం లేవు కాబట్టి ఆ పాప తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లగలిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minor girl, Mumbai, Police, Social Media