విశ్వాసం అనగానే మనుషులకు మనుషుల కంటే కుక్కలు ముందు గుర్తుకు వస్తాయి. కుక్కలు అంత విశ్వాసంగా ఉంటాయని పేరు. అయితే, ఓ వీధి కుక్క తనకు రోడ్డున పోయే ఓ వ్యక్తి ఆహారాన్ని ఇస్తే దాని కళ్లలో నీళ్లు వచ్చాయి. అది కృతజ్ఞతతో కళ్ల నీళ్లతో కృతజ్ఞత తెలిపింది. దీనికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో జరిగింది. పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ మహిళ జింగ్ హాంగ్ నగరంలో ఓ రోజు పార్క్‌కి వెళ్లింది. అక్కడో వీధి కుక్క కనిపించింది. ఆకలితో ఉన్న ఆ కుక్క ఆమె దగ్గరకు వచ్చింది. తన ముందు కాళ్లను పైకెత్తి ఆమెను తాకుడూ పిలవడం మొదలు పెట్టింది. అది చూసిన మహిళ తన వద్ద ఉన్న కొన్ని బిస్కెట్లను ఇచ్చింది. దీంతో ఆ కుక్కకు ఆనందంతో కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఎంతో సంతోషించినట్టు దాని కళ్లలో కనిపించింది.
ఆ మరుసటి రోజు కూడా ఆ మహిళ మరోసారి అదే పార్క్‌కి వెళ్లింది. అంతకు ముందు రోజు తనకు ఆహారాన్ని ఇచ్చిన ఆమెను గుర్తుపట్టిన కుక్క వెంటనే ఆమె వద్దకు వచ్చింది. దీంతో మరోసారి ఆ మహిళ తన వద్ద ఉన్న బిస్కెట్లను మరోసారి ఇచ్చింది. ఈసారి కూడా బిస్కెట్లను తిన్న తర్వాత కుక్క కళ్లలో మరోసారి నీళ్లు వచ్చాయి.
తన మీద కుక్క చూపిస్తున్న అభిమానానికి ఆమె కూడా పొంగిపోయింది. దీంతో ఆ వీధి కుక్కను ఇంటికి తీసుకుని వెళ్లాలని భావించింది. ఈ క్రమంలో కుక్కను తీసుకుని తన కారులో కూడా ఎక్కించింది. కానీ, ఆ కుక్క అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత కూడా ఆమె మరోసారి పార్క్‌కి వెళ్లి చూసింది. కానీ, ఆ కుక్క కనిపించలేదు. సహజంగా కుక్కలను పట్టుకుని వెళ్లే వారు ఇలా కుక్కలకు మొదట మత్తు బిస్కెట్లు ఇచ్చి అవి నిద్రపోయిన తర్వాత వెంటనే వాటిని పట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు. ఆమె కూడా అలాగే, మత్తు ఇచ్చి కుక్కలను పట్టుకుని తీసుకెళ్లే మహిళ అనుకుని ఆ కుక్క పారిపోయింది.
ఈ వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కుక్కను, దానికి ఆహారం పెట్టిన మహిళను అభినందిస్తున్నారు. దయచేసి మీకు కూడా ఎక్కడైనా కుక్కలు ఆకలితో కనిపిస్తే వాటికి ఆహారం పెట్టి కడుపు నింపండి అంటూ సూచిస్తున్నారు
Published by:Ashok Kumar Bonepalli
First published:December 25, 2020, 17:40 IST