Mission Paani Amla Ruia: ఒకప్పుడు తాగేందుకు నీళ్లు కూడా లేని చోట ఇప్పుడు జలసిరి.. అంతా ఆమె వల్లే..

ఆమ్లా రుయా (ఫైల్ ఫొటో)

రాజస్థాన్‌లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ తాగునీటికి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వారి సమస్యల గురించి తెలుసుకున్న ఒక మహిళ, నీటి కొరతకు మార్గాలు అన్వేశించి విజయం సాధించారు. వందల గ్రామాల్లో నీటి సమస్యను తీర్చేందుకు ఆమె ఏం చేశారంటే..

  • Share this:
స్వచ్ఛమైన తాగునీరు లేక ఇప్పటికీ దేశంలో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎడారికి దగ్గరగా ఉన్న రాజస్థాన్‌లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ తాగునీటికి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వారి సమస్యల గురించి తెలుసుకున్న ఒక మహిళ, నీటి కొరతకు మార్గాలు అన్వేశించి విజయం సాధించారు. మానవాళి మనుగడకు ప్రధానమైన నీటి కొరతను తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమ్లా రుయా (Amla Ruia). 1998లో రాజస్థాన్‌లో సంభవించిన కరువు గురించి విన్న తరువాత వారికి ఏదైనా చేయాలనుకున్నారామె. ముందు ఈ సమస్య మిగిల్చిన చెడు ప్రభావాలను ఆమె అధ్యయనం చేశారు. అప్పుడే నీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను (Aakar Charitable Trust) ఏర్పాటు చేసి, కరువు పీడిత గ్రామాల్లో నీటిని రిజర్వ్ చేయడానికి చెక్ డ్యామ్‌లను నిర్మించారు. దీంతో క్రమంగా అక్కడి ప్రజలు నీటి కష్టాలకు దూరమయ్యారు.

రాజస్థాన్‌లో ఈ ట్రస్ట్ ద్వారా 2000 నుంచి 2005 సంవత్సరం వరకు 200 నీటి కుంటలను, బావులను నిర్మించారు రుయా. చిన్నపాటి వర్షాలు వచ్చినా, ఆ నీటితో ఈ బావులు, కుంటలు నిండే ఏర్పాట్లు చేశారు. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోటి లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్ తెలిపింది. వీటి నిర్మాణంలో స్థానికులు సైతం భాగమయ్యారు. ఇక్కడి ప్రజలు బావులు, నీటి కుంటల నిర్మాణానికి అయిన ఖర్చులో 25 శాతం ఇచ్చారు.

చెక్ డ్యామ్‌ల నిర్మాణం
ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్ 2006 నుంచి 2018 వరకు రాజస్థాన్‌లో 317 చెక్ డ్యామ్‌లను నిర్మించింది. వీటి వల్ల ఆ రాష్ట్రంలో 182 గ్రామాల్లో తాగునీటి సమస్య తీరింది. నీటి కొరత తీరిన తరువాత స్థానికుల జీవనశైలిలో మెరుగైన మార్పులు వచ్చాయని రుయా చెబుతున్నారు. ఇప్పుడు వారంతా దారిద్య్రరేఖ నుంచి బయటపడ్డారు. చెక్ డ్యామ్‌లవల్ల మొత్తం ఐదు లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందడం విశేషం. ట్రస్ట్‌ చేపట్టిన వివిధ ప్రాజెక్టులు పూర్తి కావడానికి రూ.11 కోట్లను విరాళాల ద్వారా సేకరించారు. మరో రూ.4.7 కోట్లు గ్రామస్తులు అందించారు. గతంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బావుల నుంచి మహిళలు మంచినీరు తీసుకొచ్చేవారు. చెక్ డ్యామ్‌లు, బావుల ద్వారా ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరాయని వారు చెబుతున్నారు.

ఆదాయం పెరిగింది
నీటి వనరులతో గ్రామాల్లో వ్యవసాయం, పశువుల పెంపకం పెరిగింది. క్రమంగా గ్రామాల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి, అక్కడి ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలను అందిపుచ్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయినప్పటి నుంచి స్థానికులు ఏటా రూ.500 కోట్ల వరకు నికర ఆదాయాన్ని పొందుతున్నట్లు ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్ తెలిపింది. ఈ ట్రస్ట్ రాజస్థాన్‌లో తక్కువ ఖర్చుతో మెరుగైన విద్యను, వైద్య సదుపాయాలను అందించే ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఇలా మారుమూల కరవు ప్రాంతాల ప్రజల జీవితాలను మార్చి, వారిని పేదరికం నుంచి బయట పడేశారు ఆమ్లా రుయా.
Published by:Hasaan Kandula
First published: