news18-telugu
Updated: July 26, 2020, 8:32 PM IST
నాగలి పట్టి దున్నుతున్న అక్కాచెల్లెళ్లు,
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఇద్దరు ఆడపిల్లలు కాడి పట్టుకుని పొలం దున్నుతున్న వీడియో అది. వెను తండ్రి నాగలి పట్టుకుని సాళ్లు పెడుతుంటే.. ఆ వెనుక ఓ మహిళ విత్తనాలు జల్లుతోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన తండ్రి.. చివరకు సొంతూళ్లో పొలం పని మొదలు పెట్టాడు. ఎద్దులు కూడా దొరకని పరిస్థితుల్లో అతడు కన్న కూతుళ్లే నాగలి పట్టి దున్నడం మొదలు పెట్టారు. ఈ వీడియోను చూసిన సోనూసూద్ చలించిపోయాడు. ఆ కుటుంబానికి కావాల్సింది ఎద్దులు కాదని, ట్రాక్టర్ అని అన్నాడు. అందుకే వారికి ట్రాక్టర్ పంపుతున్నట్టు చెప్పాడు. ఈ మేరకు అతడు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే వారింటికి ట్రాక్టర్ కూడా పంపాడు. దీంతో కుటుంబం ఆనందలో మునిగిపోయింది. ఏదో రాజకీయ నాయకుల్లా, కుటుంబానికి అండగా ఉంటా, ఆదుకుంటా అని ట్వీట్ చేసి ఆ తర్వాత వదిలేయకుండా గంటల్లోనే వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ లక్షల రూపాయల విలువ చేేసే ట్రాక్టర్ ను అందించిన సోనూ సూద్‌ను చూసి అందరూ రియల్ హీరో అంటూ మెచ్చుకుంటున్నారు.
ఆ తండ్రి పేరు వీరతాళ్ల నాగేశ్వరరావు. మహల్ రాజువారి పల్లె వాసి. మదనపల్లెలో టీ కొట్టు నడుపుతూ ఉంటాడు. కరోనా వైరస్ కారణంగా అతడి ఉపాధి పోయింది. దీంతో 20 సంవత్సరాల తర్వాత మళ్లీ సొంతూళ్లో పొలం పని చేస్తున్నాడు. తన కుమార్తెలు వెన్నెల (12వ తరగతి), చందన (10 తరగతి) చదువుతున్నారు. వెన్నెల బయాలజీ స్టూడెంట్. డాక్టర్ అవ్వాలనేది ఆమె కల. ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీతో నాగేశ్వరరావుకు అనుబంధం ఉంది. కొందరు అడ్వొకేట్లు అతడికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఓ నెల ఇంటి అద్దె కట్టారు. కొంత నిత్యావసరాలు కొనిచ్చారు. కానీ, ఆత్మాభిమానం ఉన్న నాగేశ్వరరావు సొంతంగా పనిచేసుకోవడానికే మొగ్గు చూపాడు. తన రెండెకరాల పొలంలో పంట వేయడానికి నిర్ణయించాడు. కానీ, ఎద్దులు దొరక్క, ట్రాక్టర్ అద్దె చెల్లించలేక ఇలా కుమార్తెల భుజాన భారం వేసి నడిపించాడు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
July 26, 2020, 3:35 PM IST