Success story: 39 ఏళ్ల వయసులో ఆర్మీలో చేరిన సాఫ్ట్​వేర్ ఇంజినీర్​.. స్ఫూర్తిదాయక స్టోరీ

ప్రతీకాత్మక చిత్రం

39 సంవత్సరాల వయసులో భారత ఆర్మీలో చేరారు సతీశ్​ కుమార్​. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లిఫ్టినెంట్​గా విధుల్లో చేరారు. సాఫ్ట్​వేర్ ఇంజినీర్ నుంచి సైన్యంలోకి వెళ్లే వరకు తన ప్రయాణాన్ని సతీశ్ జాబ్ పోర్టల్‌ లింక్డ్‌ఇన్‌​లో వెల్లడించారు

  • Share this:
కలలను సాకారం చేసుకునేందుకు చివరి గడువు అంటూ ఉండదు. లక్ష్యం కోసం అంకిత భావంతో కష్టపడితే ఎప్పటికైనా సాధించవచ్చు. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ దీన్ని రుజువు చేశారు. 39 సంవత్సరాల వయసులో భారత ఆర్మీలో చేరారు సతీశ్​ కుమార్​. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లిఫ్టినెంట్​గా విధుల్లో చేరారు. సాఫ్ట్​వేర్ ఇంజినీర్ నుంచి సైన్యంలోకి వెళ్లే వరకు తన ప్రయాణాన్ని సతీశ్ జాబ్ పోర్టల్‌ లింక్డ్‌ఇన్‌​లో వెల్లడించారు. దీంతో ఆయన సక్సెస్ స్టోరీ మీడియాలో వైరల్‌గా మారింది.

“నన్ను ఇంటర్వ్యూ చేసిన వారిని చూశా. వారిలో ఎక్కువ శాతం 30 సంవత్సరాల వయసు లోపు ఉన్నవారే ఉన్నారు. నా వయసు 37 ఏళ్లు. అందుకే నేను ఆందోళన చెందాను. వయసు కారణంగా నన్ను రిజెక్ట్ చేస్తారేమో అనిపించింది” అని సతీశ్ పేర్కొన్నారు.

సతీశ్​ లింక్డ్‌ఇన్‌ పోస్ట్​లో ముఖ్యమైన విషయాలు

రాత పరీక్ష: పరీక్ష రెండు విభాగాలకు జరిగింది. ఒక్కో పరీక్ష రెండు గంటల పాటు ఉంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్​, జనరల్ నాలెడ్జ్​, లాజికల్ రీజనింగ్​, ఇంగ్లిష్​ అంశాలపై పరీక్షలు జరిగాయి.

ఇంటర్వ్యూ: మేజర్​ జనరల్​ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఇద్దరు లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంకు ఆఫీసర్లు, ఓ సైకాలజిస్ట్​ ఇంటర్వ్యూ చేశారు. టెరిటోరియల్ ఆర్మీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు?, ఆర్మీలో ఆఫీసర్​ అయ్యాక ఏం పొందగలరని ఆశిస్తున్నారు? ప్రస్తుత కార్పొరేట్​ ఎక్స్​పీరియన్స్​ను ఆర్మీలో ఎలా వినియోగిస్తారు, ఆర్మీలో ఎలాంటి పాత్ర పోషిస్తారు? వంటి ప్రశ్నలతో పాటు తన అప్లికేషన్​ను పరిశీలించి కొన్ని ప్రశ్నలు అడిగారని సతీశ్ పేర్కొన్నారు.

సర్వీస్​ సెలక్షన్​ బోర్డు(ఎస్​ఎస్​బీ)

2079 మంది అభ్యర్థుల్లో ఇంటర్వ్యూ తర్వాత 816 మంది తరువాతి ప్రక్రియకు ఎంపికయ్యారు. వారిని 200 మంది ఉండే గ్రూపులుగా విభజించారు. ఎస్​ఎస్​బీ తేదీ కోసం రిపోర్టింగ్ తేదీలను కేటాయించారు. 172 మంది అభ్యర్థులు తొలి రోజు 21-ఎస్​ఎస్​బీ భోపాల్​లో రిపోర్ట్ చేశారు. ఆరు గంటల పాటు స్క్రీనింగ్ టెస్టు జరిగింది. 16 మంది ఆ టెస్టును దాటారు. ఆ తర్వాత నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్​, రేషనల్ థింకింగ్​, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించడం, వ్యక్తిగత ఇంటర్వ్యూతో పాటు వివిధ విషయాలపై తర్వాతి నాలుగు గంటల పాటు టెస్టులు జరిగాయి.

కాస్త ఆందోళన

16 మందిలో నాతో సహా నలుగురం వైద్య పరీక్షల్లో వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాం. ఆర్మీ డాక్టర్లు చాలా కఠినమైన మార్గదర్శకాలను పాటించడం వల్లే ఇలా జరిగింది. అయితే తిరస్కరణను మిలటరీ ఆసుపత్రిలో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. 2020 సెప్టెంబర్​లో వైద్య పరీక్షల కోసం బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిని ఎంపిక చేసుకున్నా. అక్కడ వైద్య పరీక్షలన్నీ క్లియర్ చేసుకున్నా. నియామక ప్రక్రియలో ముందుకు కొనసాగా.

డాక్యుమెంటేషన్

గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్​, పోలీస్ వెరిఫికేషన్​, స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్​మెంట్ వెరిఫికేషన్​తో డాక్యుమెంట్ పరిశీలన జరిగింది. నాలుగు నుంచి ఆరు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆశించా.

విజయం వరించిన వేళ

'2021 ఏప్రిల్​లో కమిషనింగ్​ లెటర్​ను అందుకున్నా.. గ్రనడియర్స్ రెజిమెంట్ లోని 118 ఇన్​ఫాంట్రీ (టీఏ) బెటాలియన్​కు నన్ను అసైన్ చేశారు. ' ఇలా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప్రయాణం మొదటు పెట్టి ఆర్మీలో మంచి పోస్టుకు ఎంపికైనట్లు సతీశ్ వివరించారు. ఆయన ప్రయాణాన్ని, దేశసేవలో భాగం కావాలనుకున్న లక్ష్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఏపీలో మరో జాబ్ మేళా.. ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

BOI Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
Published by:Shiva Kumar Addula
First published: