Medical Miracle: ప్రపంచంలోనే అతిచిన్న శిశువు జననం.. చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్.. బరువు ఎంతో తెలిస్తే షాక్ అ?

image source NUH, Singapore

సింగపూర్‌లో జన్మించిన ఒక పసిబిడ్డ వైద్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచంలోనే అతిచిన్న బిడ్డగా భావిస్తున్న ఈ పసిగుడ్డు ?

  • Share this:
సింగపూర్‌లో జన్మించిన ఒక పసిబిడ్డ వైద్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచంలోనే అతిచిన్న బిడ్డగా భావిస్తున్న ఈ పసిగుడ్డు ఎక్కువసేపు బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. కానీ 13 నెలల ఇంటెన్సివ్ కేర్ చికిత్స తర్వాత బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యంతో సింగపూర్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఈ నవజాత శిశువు పేరు క్వెక్ యు జువాన్ కాగా.. పుట్టినప్పుడు ఈమె బరువు కేవలం 212 గ్రాములు మాత్రమే కావడం గమనార్హం. అంటే ఒక యాపిల్ పండంత బరువు. ఇక జువాన్ పొడవు 24 సెంటీమీటర్లు మాత్రమే!

సాధారణంగా పిల్లలు తల్లి గర్భంలో 9 నెలలు పెరిగిన తర్వాత బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. కానీ క్వెక్ యు జువాన్ మాత్రం 5 నెలల సమయంలోనే తల్లి గర్భం నుంచి ప్రపంచంలోకి అడుగుపెట్టింది. యూనివర్సిటీ ఆఫ్ ఐయోవా టైనియస్ట్ బేబీస్ రిజిస్ట్రీ ప్రకారం.. 2018లో అమెరికాలో జన్మించిన ఓ ఆడపిల్ల 245 గ్రాములే ఉందట. కానీ ఈ అమ్మాయి రికార్డును క్వెక్ యు జువాన్ బద్దలు కొట్టింది.

జువాన్ తల్లికి గర్భం దాల్చక ముందు ప్రీ-ఎక్లంప్సియా అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధి వల్ల తల్లి, బిడ్డ ప్రాణాలకు ముప్పు అని డాక్టర్లు చెప్పారు. దీంతో తల్లి నాలుగు నెలల ముందుగానే అత్యవసర సి-సెక్షన్ ద్వారా ఆ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. దీనివల్ల జువాన్ చాలా తక్కువ బరువుతో జన్మించింది. కుసుమ కోమలంగా.. మరింత సున్నితంగా ఉన్న జువాన్ ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఇంటెన్సివ్ కేర్ లో 13 నెలల పాటు చికిత్స అందించారు.

దీంతో ఇప్పుడు యు జువాన్ బరువు 6.3 కేజీలకు చేరింది. ఈ బరువుని ఆరోగ్యకరమైన బరువుగా డాక్టర్లు పరిగణిస్తున్నారు. 13 నెలలకు బిడ్డ 6.3 కేజీల బరువు ఉంటే.. ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదని తల్లిదండ్రులకు డాక్టర్లు భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ (NUH)లో జన్మించిన యు జువాన్, ఇంతకాలం అదే ఆస్పత్రిలో చికిత్స పొందింది. పలు చికిత్సలు పొందిన ఈ బిడ్డ రకరకాల మిషన్ లపై ఆధారపడి ప్రాణాలను నిలుపుకుంది. వైద్య చరిత్రలో ఇదొక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం బిడ్డ డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయేంత ఆరోగ్యకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. యు జువాన్ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోందని కానీ ఆమె కాలక్రమేణా కోలుకుంటుందని చెబుతున్నారు. క్రౌడ్‌ఫండింగ్ క్యాంపెయిన్ ద్వారా యు జువాన్ తల్లిదండ్రులు 366,884 సింగపూర్ డాలర్లు (రూ. 2కోట్లు) సేకరించారు. ఆ డబ్బుతోనే ఆసుపత్రి బిల్లులు చెల్లించారు.
Published by:Krishna Adithya
First published: