జలియన్‌వాలా బాగ్.. భారతీయులపై బ్రిటిష్ వలస పాలకులు సాగించిన నెత్తుటికాండకు ఒకానొక నిదర్శనం. వందల మంది సిక్కులను దారుణంగా కాల్చిచంపిన నాటి ఘటన తాలూకు గాయాలు ఇప్పటికీ పచ్చిగానే అనిపిస్తాయి. స్వాతంత్ర్య పోరాట వీరుడు, భగత్ సింగ్ సహచరుడైన సర్దార్ ఉధమ్ సింగ్ రహస్యంగా ఇంగ్లాండ్ వెళ్లి సుదీర్ఘ కాలం ఎదురుచూసిమరీ జలియన్‌వాలా బాగ్ మారణకాండకు బాధ్యుడైన జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడం తెలిసిందే. ఈ సాహసోపేత గాథ ఇటీవలే ‘సర్దార్ ఉధమ్ సింగ్’పేరుతో సినిమాగానూ వచ్చింది. ఆస్కార్ బరిలో భారత ఎంట్రీగానూ ఆ చిత్రం నిలిచింది. కాగా, అదే జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని పేర్కొంటూ తాజాగా బ్రిటన్ లో సంచలన చర్యకు పాల్పడ్డాడు ఓ సిక్కు యువకుడు. వివరాలివి..
జలియన్‌వాలా బాగ్ నరమేధానికి ప్రతీకారంగా బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్‌ను హత్య చేస్తానని ఓ వీడియోను విడుదల చేసిన వ్యక్తిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. స్నాప్‌చాట్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియోలో ఆ వ్యక్తి పూర్తిగా ముసుగు ధరించి ఉన్నాడు. తాను భారతీయ సిక్కు మతానికి చెందినవాడినని, తన పేరు జశ్వంత్ సింగ్ చయిల్ అని చెప్పుకున్నాడు.
1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ నరమేధంలో మరణించినవారి తరపున తాను ప్రతీకారం తీర్చుకుంటానని నిందితుడు ఈ వీడియోలో తెలిపాడు. జాతి కారణంగా అవమానం, వివక్ష, హత్యలకు గురైనవారి తరపున కూడా ఇది ప్రతీకార చర్య అని పేర్కొన్నాడు. తన పేరు జశ్వంత్ సింగ్ చయిల్, అదే విధంగా డర్త్ జోన్స్ అని చెప్పాడు.
క్వీన్ ఎలిజబెత్ ప్రైవేట్ అపార్ట్‌మెంట్స్ సమీపంలో జశ్వంత్‌ను భద్రతాధికారులు అరెస్టు చేసినట్లు బ్రిటిష్ మీడియా తెలిపింది. ఈ వ్యక్తి వయసు 19 సంవత్సరాలు ఉంటుందని పేర్కొంది. జశ్వంత్ తన కుటుంబంతో కలిసి సౌథాంప్టన్‌లో నివసిస్తున్నాడని, అధికారులు ఆ ఇంటికి వెళ్ళి, సోదాలు చేశారని పేర్కొంది.
ఇదిలావుండగా, పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, సౌథాంప్టన్‌కు చెందిన 19 ఏళ్ళ వ్యక్తి రక్షిత ప్రదేశంలోకి అక్రమంగా చొరబడినట్లు అనుమానం కలగడంతో అరెస్టు చేశారు. అతనివద్ద నుంచి ఓ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని మానసిక స్థితిపై నిపుణులతో పరీక్షలు చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.