ప్రముఖులను ఫాలో అయ్యేవారు చాలా మందే ఉంటారు. సినీ నటులు, రాజకీయ నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు.. ఇలా వారు చేసే పనుల దగ్గర నుంచి అన్ని సందర్భాలను అభిమానులు అనుసరిస్తూ ఉంటారు. ముఖ్యంగా పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు లాంటి వారైతే ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తారు. టీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నాయకుడైన ఈయన.. ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితమైన మట్టి గణేషుల ప్రతిమలను పెట్టాలని, అదీ ఊరికి ఒక్కటే ఉంటే చాలా బాగుంటుందని నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం నింపారు. ‘ఒకే వినాయకుడు-మట్టి వినాయకుడు’ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 85 గ్రామాలు ఉండగా, 39 గ్రామాలు ఒకే వినాయకుడిని గ్రామంలో పెట్టేందుకు ముందుకు వచ్చాయని, తీర్మానం కూడా చేశాయని ఆయన వెల్లడించారు.
గ్రామంలోని ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, అన్ని కులాలు ముందుకు వచ్చాయని, భక్తి శ్రద్ధలతో, ఐక్యతతో, పర్యావరణ రక్షణకు పాటుపడతామని చెబుతున్నారని హరీష్ తెలిపారు. ఇలా పర్యావరణానికి మేలు చేసే విధంగా వ్యవహరిస్తే ఆయా గ్రామాలకు శాశ్వత మంటపం నిర్మించి ఇస్తామని చెప్పినట్లు వెల్లడించారు. డిజిటల్ లైబ్రరీ, ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేసేలా చేస్తామని వివరించారు. ఏ గ్రామమైతే ఒకే మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తుందో.. ఆ గ్రామంలో స్వయంగా తానే పూజల్లో పాల్గొంటానని చెప్పినట్లు తెలిపారు. దీని వల్ల ప్రజల్లో గుణాత్మక మార్పులు వస్తాయని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh Chaturthi, Harish Rao, Siddipet, Telangana, Telangana News