Fact Check : కోవిడ్ వ్యాక్సిన్‌లకు అయస్కాంత శక్తి ఉందా? వ్యాక్సిన్ తరువాత అంధులకు చూపు వస్తుందా?

ప్రతీకాత్మక చిత్రం

Fact Check : కోవిడ్ వ్యాక్సిన్‌లపై సమాజంలో అపోహ‌లు, అనుమానాలు వ్యాపిస్తుండగా.. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న త‌రువాత చోటుచేసుకుంటున్న ఇలాంటి వింత సంఘ‌ట‌న‌లు సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

  • Share this:
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న త‌రువాత.. గతంలో కోల్పోయిన కంటి చూపు పాక్షికంగా తిరిగివ‌చ్చిన‌ట్టు ఓ వృద్ధురాలు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఓ వైపు కోవిడ్ వ్యాక్సిన్‌లపై సమాజంలో అపోహ‌లు, అనుమానాలు వ్యాపిస్తుండగా.. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న త‌రువాత చోటుచేసుకుంటున్న ఇలాంటి వింత సంఘ‌ట‌న‌లు సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌కు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని అధికారులు చెబుతున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట్ర‌లోని జాల్నా జిల్లా పార్టూర్ ప్రాంతానికి చెందిన 70 ఏళ్ళ మ‌థురాబాయి బిద్వే కంటి శుక్లాల కార‌ణంగా తొమ్మది సంవత్సరాల కింద‌ట కంటిచూపు కోల్పోయింది. ఈ క్ర‌మంలో ఈ ఏడాది జూన్ 26వ తేదీన ఆమె కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంది. ఆ మ‌రుస‌టి రోజే ఒక కన్ను పాక్షికంగా క‌నిపిస్తోందని వృద్ధురాలు తెలిపింది. ఆమె కంటి చూపు దాదాపు 40శాతం మేర తిరిగి వ‌చ్చిన‌ట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇది నిజం కాదని అధికారులు తేల్చారు.

వ్యాక్సిన్‌తో మాగ్న‌టిక్ ప‌వ‌ర్‌!
సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వ్యాక్సిన్ వింత‌ల‌లో మాగ్న‌టిక్ ప‌వ‌ర్‌వే అగ్ర‌స్థానం. మ‌హారాష్ట్ర‌లోని నాసిక్‌కు చెందిన 71 ఏళ్ళ అర‌వింద్ సోనార్ అనే వ్యక్తి.. తాను కోవిషీల్డ్ వ్యాక్సిన్ డ‌బుల్ డోస్ తీసుకున్నాక త‌న శ‌రీరం అయ‌స్కాంతంలా మారిందంటూ చేసిన వీడియో వైర‌ల్ అయింది. ఆయ‌న శ‌రీరంపై నాణేలు, స్పూన్లు, తాళాలు అతుక్కుపోయాయి. వ్యాక్సిన్ తీసుకున్న‌ త‌రువాతే త‌న‌కీ అయ‌స్కాంత శ‌క్తి వ‌చ్చింద‌ని అర‌వింద్ తెలిపారు. అయితే ఇదంతా అర్థ‌ర‌హిత‌మ‌ని, వ్యాక్సిన్ తీసుకుంటే ఇలాంటివి ఏమీ జ‌ర‌గ‌వ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గానే.. గుజరాత్‌లోని సూరత్‌ నుంచి మరొక సంఘటన వెలుగులోకి వ‌చ్చింది. పూన‌మ్ జ‌గ్తాప్ కుటుంబానికి చెందిన ఇద్ద‌రి వ్య‌క్తుల‌లో ఇలాంటి అయ‌స్కాంత ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. వీరిద్ద‌రూ కూడా వ్యాక్సిన్ తీసుకున్న త‌రువాత ఇలా జ‌రిగిందని చెప్పారు. దీంతో పూన‌మ్ జ‌గ్తాప్ గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ల‌పై అనేక రూమ‌ర్లు ప్ర‌చార‌మ‌వుతున్నాయి. వీటిల్లో ఈ అయ‌స్కాంత శ‌క్తికి సంబంధించిన‌వి ఎక్కువగా ఉంటున్నాయి. శ‌రీరమంతా ఆర్ఎన్ఏ ప్ర‌వ‌హించ‌డానికి వీలుగా వ్యాక్సిన్‌లో అయ‌స్కాంత‌ త‌త్త్వాన్ని క‌లిపారంటూ ఒక వీడియో ఇంటర్‌నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. వ్యాక్సినేష‌న్ ద్వారా అయ‌స్కాంత శ‌క్తులు వ‌స్తాయ‌న‌డానికి ఎటువంటి ఆధారాలు లేవ‌ని స్ప‌ష్టం చేసింది. ఇవ‌న్నీ నిరాధ‌ర‌మైన ప్ర‌చారాల‌ని, ప్ర‌జలు వీటిని న‌మ్మ‌కుండా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని కోరింది.
Published by:Sridhar Reddy
First published: