Viral Video: హెలికాప్టర్‌ నుంచి పారాచ్యూట్‌తో దూకేసిన కుక్క.. ఎందుకు? ఎక్కడ?

పారాచ్యూట్‌తో దూకేసిన శునకం

శునకాలు రక్షణ, భద్రత విధుల్లో ఉండటం మనం చాలాసార్లు చూసుంటాం. అయితే ఇలా సాహస విన్యాసం చేయడం మాత్రం ఇదే తొలిసారి.

  • Share this:
హెలికాప్టర్ ల్యాండ్‌ అవ్వడానికి వీల్లేని ప్రదేశాల్లో పారాచ్యూట్‌తో దిగుతుంటారు సైనికులు. ఇలాంటి విన్యాసాలను మనం చాలా సార్లు చూశాం. అయితే ఓ శునకం ఇలా పారాచ్యూట్‌తో విహరించడం ఎప్పుడైనా చూశారా? రష్యాలోని సర్వీసు శునకంతో ఈ విన్యాసం చేయించారు అధికారులు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఎందుకు ఆ శునకం హెలికాప్టర్ ఎక్కింది, ఎందుకు పారాచ్యూట్‌తో దూకింది అనేది చూద్దాం! సర్వీసు శునకంతో ఈ ఫీట్‌ చేయించింది రష్యా. ఆకాశంలో హెలికాప్టర్లో నుంచి సైనికుడు తనతోపాటు శునకాన్ని పట్టుకుని దూకేలా... టెక్నోదినామిక అనే సంస్థ పారాచ్యూట్‌లను రూపొందించింది. దాని టెస్టింగ్‌లో భాగంగా తీసిన వీడియోనే ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అంతేకాదు ఈ ప్రయోగం చివరి దశకు వచ్చిందట. ఆ వీడియోలో కనిపిస్తోంది షెపర్డ్‌ శునకమట. సుమారు 13 వేల అడుగుల ఎత్తు నుంచి ఆ శునకాన్ని పట్టుకొని పారాచ్యూట్‌ సాయంతో సైనికుడు కిందకు దూకాడు.

శునకాలు రక్షణ, భద్రత విధుల్లో ఉండటం మనం చాలాసార్లు చూసుంటాం. అయితే ఇలా సాహస విన్యాసం చేయడం మాత్రం ఇదే తొలిసారి. ఈ పారాచ్యూట్‌ రెండు విధాలుగా వాడుకునేలా రూపొందించారట. అంటే శునకంతో పాటు ల్యాండ్‌ అయ్యేలా పనికొస్తుంది. అలానే శునకం లేకుండా నేరుగా సైనికుడు మాత్రమే ల్యాండ్‌ అవ్వొచ్చు కూడా.

శునకంతో పాటు దూకిన టెస్ట్‌ పారాచ్యూటిస్ట్‌ మాట్లాడుతూ... హెలికాప్టర్ నుంచి దూకే ముందు శునకంతో కాస్త కంగారు పడిందని చెప్పుకొచ్చాడు. హెలికాప్టర్ డోర్‌ ఓపెన్‌ అవ్వగానే ఆ శబ్దానికి భయపడిందట. అయితే ఆ శునకాన్ని హ్యాండిల్‌ చేసే వ్యక్తి చాలా నేర్పుగా శునకంతో ల్యాండ్‌ చేయించాడని చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రయోగం 13 వేల అడుగుల ఎత్తు నుంచి జరిగింది. అయితే దీనిని ఎనిమిది వేల మీటర్లకు పెంచాలని భావిస్తున్నారట. అంటే ప్రస్తుతం దూకిన దాని కంటే రెండింతలు అని చెప్పొచ్చు. ఈ ప్రయోగాన్ని ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి చేస్తారట. అంటే వచ్చే ఏడాది రష్యా సైన్యంలో సర్వీసు శునకాలు కూడా ఆకాశం నుంచి పారాచ్యూట్‌ వేసుకొని నేల మీదకు దిగి అవసరమైన వారికి సాయం చేస్తాయన్నమాట.
Published by:Shiva Kumar Addula
First published: