ఓ పెంపుడు చిలుక కోసం ఒక కుటుంబం పడిన కష్టాలు తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. మూడువేలకు పైగా పోస్టర్లు, సోషల్ మీడియాలో వందలాది పోస్టులు, కాలినడకన చిలుక కోసం వెతుకులాట.. ఇలా సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశారు. ఆఫ్రికన్ గ్రే జాతికి చెందిన ఆ చిలుకను వెతికి పట్టుకునేందుకు 21 రోజులపాటు ప్రయత్నించి, విజయం సాధించింది చెన్నైకి చెందిన ఓ కుటుంబం.వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని నాన్‌గలూరు ప్రాంతంలోని మహేంద్రనాథ్, అతని భార్య శ్రీవిద్య ఒక చిలుక ‘మోజో’ను పెంచుకుంటున్నారు. మే 10న టెర్రస్‌పై మొక్కలకు నీళ్ళు పోస్తున్నప్పుడు, అనుకోకుండా అది ఎగిరిపోయింది. పేరుకే పెంపుడు చిలుక కానీ, ఆ కుటుంబానికి అదంటే ప్రాణం. ఒక పక్షిలా కాకుండా, దాన్ని సొంత కుటుంబసభ్యుడిగా చూసేవారు. కేవలం మూడు నెలల వయసులోనే దాన్ని ఇంటికి తీసుకువచ్చి పెంచుకున్నారు. ఇంతలా ప్రేమించిన చిలుక తప్పిపోవడంతో, ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. మహేంద్ర, శ్రీవిద్య దంపతులు చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ ఎక్కడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులందరూ బృందాలుగా విడిపోయి వెతికే ప్రయత్నం చేశారు. అయితే లాక్‌డౌన్ కావడంతో, దాన్ని గుర్తించే ప్రక్రియలో ఆటంకాలు ఎదురయ్యాయి. కాలినడకన వీలైనంత దూరం తిరిగారు. మోజో తమని గుర్తించడానికి వీలుగా ఓ ప్రత్యేకమైన మ్యూజిక్, విజిల్‌ను బ్లూటూత్ స్పీకర్‌తో ప్లే చేసేవారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
మోజో ఎగిరిపోయిన వైనం సోషల్‌మీడియలో పంచుకోవడంతో, ఆ వార్త వైరల్ అయింది. ఫేస్‌బుక్‌లోని నాగనల్లూర్ రెసిడెంట్స్ పేజీలో మోజో మిస్సింగ్ ను అప్‌డేట్ చేశారు. ఇన్‌స్టాలోనూ ఈ విషయాన్ని పంచుకుంటూ.. చిలుకను గుర్తిస్తే చెప్పాలని కోరారు. నెటిజన్లు అందించే సమాచారాన్నిమహేంద్ర పిల్లలు హ్యాండిల్ చేసేవారు. కానీ ఎన్నిప్రయత్నాలు చేసినా మోజో ఆచూకీ దొరకలేదు. మోజో ఆచూకీ కోసం వందలాది పాంప్లేట్లు పంచారు. దాని ఫోటోతో మిస్సింగ్ పోస్టర్లు వేశారు. దినపత్రికలలో యాడ్‌లు ఇచ్చారు. ఈ క్రమంలో తాము మోజోను చూశామని మహేంద్ర కుటుంబానికి ఫోన్ కాల్స్ వచ్చేవి. అక్కడికి వెళ్లేలోపు అది ఎగిరిపోయిందని చెప్పేవారు. ఇలా ఎన్నిచోట్ల వెతికినా ఉపయోగం లేకపోయింది.
ఇలా 21 రోజులు గడిచిపోయాక, సరిగ్గా ప్రపంచ చిలుకల దినోత్సవం రోజు.. జమీన్ పల్లవరం అనే ప్రాంతంలో మోజోను చూసినట్లు మహేంద్రకు ఫోన్ వచ్చింది. దీంతో ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి వీరి కుటుంబం వాయువేగంతో వెళ్ళింది. అక్కడ ఒక రావి చెట్టుపై కూర్చుని మోజో కూర్చొని ఉంది.
దాన్ని చూడగానే మహేంద్ర కంటతడి పెట్టుకున్నాడు. పిలవగానే ఎగురుకుంటూ వచ్చి మహేంద్ర భుజంపై వాలింది మోజో. వెంటనే వారు దాన్ని ఇంటికి తీసుకెళ్లారు. చిలుక దొరికిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకొని, హర్షం వ్యక్తం చేశారు మహేంద్ర కుటుంబ సభ్యులు. మోజోను కనుగొనే క్రమంలో సాయం చేసిన అందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, VIRAL NEWS