గబ్బిలం అంటే సాధారణంగా నల్లగా ఉంటుంది. మరి వేరే రంగుల్లో కూడా గబ్బిలాలు ఉంటాయా అంటే చాలా అరుదుగా ఇలాంటివి కనిపిస్తుంటాయి. అలాంటిదే జరిగింది వెస్ట్ ఆఫ్రికాలో. వెస్ట్ ఆఫ్రికాలోని (West Africa) గినియా (Guinea) ప్రాంతంలోని నింబా పర్వతాల్లో (Nimba mountains) లేత నారింజ రంగులో ఉన్న గబ్బిలం ఒకదాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికన్ మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీ అండ్ బ్యాట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ సంస్థ .. 2018లో ఇక్కడి నింబా పర్వతాల్లో సర్వే చేస్తుండగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఇవి అంతరించిపోతున్న గబ్బిలాల జాతిలో అతి ముఖ్యమైనదే కావటమే ఇందుకు కారణం. సుమారు 2 ఏళ్లపాటు ఈ గబ్బిలంపై ప్రత్యేకంగా దృష్టినిలిపాక కానీ ఈ అరుదైన జాతి విషయం పూర్తిగా శాస్త్రజ్ఞులకు బోధపడలేదు.
తొలుత దీని రంగు వేరుగా ఉందని మాత్రమే భావించినప్పటికీ పరిశోధనల్లో మాత్రం ఇది అరుదైన జాతికి చెందినదిగా తేలింది. ఈ సరికొత్త జాతి గబ్బిలాన్ని 'Myotis Nimbaensis'గా పిలుస్తారు. నింబా పర్వతశ్రేణుల్లో ఉండే జాతి కనుక దీని పేరులో నింబాన్సిస్ అనే పదాన్ని చేర్చారు. American Museum Novitates అనే జర్నల్లో ఈ గబ్బిలంను కనుగొన్న విషయాన్ని తాజాగా ప్రచురించటంతో ఆలస్యంగా ప్రపంచానికి ఆరెంజ్ గబ్బిలంపై వివరాలు తెలిసాయి.
కొత్త జాతి గబ్బిలాలు..
ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా కనీసం 20 కొత్త గబ్బిలాల జాతులను శాస్త్రజ్ఞులు గుర్తిస్తుంటారు. కానీ గతంలో గుర్తించిన ఏ గబ్బిలమూ ఈ ఆరెంజ్ గబ్బిలం అంత ప్రత్యేకమైనది కాదని వీరు వెల్లడిస్తుండటం విశేషం. గబ్బిలం వేళ్లు నారింజ రంగులో ఉండగా, దాని రెక్కలు మాత్రం నల్లగా ఉన్నాయని, ప్రపంచంలో వీటి సంఖ్య వేళ్లమీద లెక్కించేన్ని కూడా ఉండవని పరిశోధకులు వివరిస్తున్నారు. మీకు తెలుసా బంగారు రంగున్న గబ్బిలాలు కూడా ఉంటాయి. ఈ అరుదైన క్షీరద జాతి దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. డిస్కవరీ టీవీలో కూడా బంగారు గబ్బిలాలపై ప్రత్యేక కథనాలు ప్రసారం కాగా అవి బాగా ఆకట్టుకున్నాయి. సాధారణంగా గబ్బిలాలు గుహల్లోనే ఉంటాయి. ఇవి సూర్యాస్తమయం కాగానే చీకట్లో బయటికి వచ్చి వేగంగా ఎగురుతూ భయంకరమైన శబ్దాలు చేస్తుంటాయి. తలకిందలుగా వేలాడే గబ్బిలాలు పగటి వెలుగులో కంటి చూపు కోల్పోయి అలాగే ఒకచోట నక్కి ఉండిపోతాయి.
కరోనా, నిఫా..
కరోనా (corona) వైరస్ వచ్చింది గబ్బిలాల ద్వారానే అని భావిస్తున్న నేపథ్యంలో గబ్బిలాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేరళను (Kerala) వణికించిన నిఫా వైరస్ (Nipah virus) వ్యాధి కూడా గబ్బిలాల వల్లే సోకింది. సాధారణంగా గబ్బిలం అంటేనే మనవారు ఎక్కువ నెగటివ్ గా భావిస్తారు. అంతేకాదు గబ్బిలాలతో బోలెడన్ని వ్యాధులు శరవేగంగా వ్యాపిస్తాయి. గబ్బిలాలు కొరికిన పళ్లను మనం తింటే అవి అత్యంత విషపూరితమైన పళ్లు కనుక తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదముంది. కేరళలో నిఫా వైరస్ ఇలానే వ్యాపించిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:January 19, 2021, 20:07 IST