SASIKALA RAWAL OF UJJAIN HAS BEEN AWARDED A PHD IN SANSKRIT AT THE AGE OF 80 GH SSR
Viral: రిటైర్ అయిన 20 ఏళ్లకు ఆ ఘనత సాధించిన అవ్వ.. ప్రశంసల్లో ముంచెత్తుతున్న జనం..
పీహెచ్డీ పట్టాను అందుకుంటున్న శశికళ రావల్
శశికళ రావల్.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. సంస్కృతంలో పరిశోధన పూర్తి చేసిన శశికళ డాక్టరేట్ సంపాదించి అందరి దృష్టిని ఆకర్షించారు. అదేంటి ఆమె పీహెచ్ డీ పూర్తి చేసింది అంతే కదా అని అనుకోకండి.. ఆమె డాక్టరేట్ సంపాదించింది ఎనిమిది పదుల వయసులో...
శశికళ రావల్.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. సంస్కృతంలో పరిశోధన పూర్తి చేసిన శశికళ డాక్టరేట్ సంపాదించి అందరి దృష్టిని ఆకర్షించారు. అదేంటి ఆమె పీహెచ్ డీ పూర్తి చేసింది అంతే కదా అని అనుకోకండి.. ఆమె డాక్టరేట్ సంపాదించింది ఎనిమిది పదుల వయసులో అని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అయినా మన పెద్దలు చెప్పినట్టు చదువు, సంధ్యలకు వయసుతో పనేమిటి? జీవితకాలం పాటు నిత్య విద్యార్థిగా ఉన్నవారు ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటారు కదా. లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయిన శశికళ పదవీ విరమణ తరువాత ఉన్నత విద్యపై ఫోకస్ పెట్టారు.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నగరంలో నివసించే శశికళ ఎంఏ ఆస్ట్రాలజీ చేసి ఆ తరువాత వరాహమిరుడి సంస్కృత రచన "బృహత్ సంహిత"పై పరిశోధన పూర్తిచేశారు. ఇది పూర్తిగా జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన పుస్తకం. "బృహత్ సంహిత" కోణంలో వ్యక్తుల సాంఘీక జీవనం అనే అంశంపై ఆమె డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ విజయవంతంగా పూర్తి చేయటం ఇప్పుడు వైరల్ అవుతోంది. పీహెచ్ డీ డిగ్రీ ప్రదాన కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ శశికళను చూసి ఆశ్చర్యపోతూ, ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు.
జ్యోతిష్యం ఎందుకు?
రిటైర్ అయిన తరువాత హ్యాపీగా విశ్రాంతి తీసుకుని ఉండకుండా పై చదువులెందుకు ..అది కూడా జ్యోతిష్య శాస్త్రమే ఎందుకన్న ప్రశ్నకు డాక్టర్ శశికళ ఇచ్చిన సమాధానం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆస్ట్రాలజీ అంటే తనకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని, దీంతో ముందు ఆస్ట్రాలజీలో ఎంఏ కోసం అడ్మిషన్ తీసుకుని పూర్తి చేసి ఆతరువాత పీహెచ్ డీ వైపు అడుగులు వేసినట్టు వివరించారు. మ్యాపులను ఉపయోగించి మనం గమ్యస్థానం చేరినట్టే జ్యోతిష్య శాస్త్రంతో మనం మన గమ్యస్థానాన్ని సులువుగా, తొందరగా చేరుకోవచ్చని ఆమె వివరిస్తున్నారు. ఆస్ట్రాలజీ సంజ్ఞలతో మనం ఎన్నో సమస్యలను సునాయాసంగా అధిగమించగలం అని డాక్టర్ శశికళ తమ ప్రియమైన సబ్జెక్ట్ ఎంత గొప్పదో సింపుల్ గా చెబుతున్నారు. మనం ఎదుర్కోబోయే సమస్యలను జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనం ముందే అంచనా వేయటంతో సమస్యల సుడిగుండాల నుంచి గట్టెక్కేలా చేస్తుందని అందుకే తనకున్న జ్యోతిష్య పరిజ్ఞానాన్ని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలని తాను భావిస్తున్నట్టు చెప్పారు.
నడి వయసు తరువాతే అసలు జీవితం..
"లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ 40” అన్న నానుడి ఆమెకు అతికినట్టు సరిపోతుంది. పండు ముసలి వయసులో ఆమె చదువుపై ధ్యాస పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పై చదువులు చదవాలన్న కోరిక తీరని వారు రిటైర్ అయ్యాక ఇంటి పట్టున ఉండి ఇలా ఉన్నత చదువులు చదివి తమ కోరికను తీర్చుకోవటం ఇటీవల కాలంలో కామన్ గా మారుతోంది.