Sand Dollars: అమెరికా సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన సాండ్ డాలర్స్.. అసలు ఏంటివి?

అమెరికా సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన సాండ్ డాలర్స్.. (image credit - facebook)

Sand Dollars: మనం ఇప్పటివరకూ తెలుసుకోని ప్రత్యేక జీవులు ఇప్పుడు సముద్రం నుంచి తీరానికి వస్తున్నాయి. ఆ జీవుల ప్రత్యేకతేంటో, వాటిని శాండ్ డాలర్లుగా ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకుందాం.

  • Share this:
అమెరికాలోని బీచ్​లకు వేల సంఖ్యలో సాండ్ డాలర్లు కొట్టుకొస్తున్నాయి. నీటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇవి ప్రాణాలు విడుస్తున్నాయి. దీంతో సముద్ర నిపుణులు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇవి ఎందుకు ఒడ్డుకు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అసలు సాండ్ డాలర్స్ అంటే ఏంటంటే.. ఇవేమీ కరెన్సీ కాదు. ఇసుకతో చేసిన కరెన్సీ అసలు కాదు. సాండ్ డాలర్స్ అనేవి ఒక రకమైన సముద్రపు జీవులు. సముద్రం ఉపరితలంలో ఉండే చిన్నపాటి ప్రాణులు ఇవి. వీటిని సీ కుకీస్, స్నాపర్ బిస్కెట్స్ అని కూడా పిలుస్తారు. రూపం, పరిమాణం కారణంగా వీటికి సాండ్ డాలర్స్ అనే పేరు వచ్చింది. క్లిపెస్టెరోడియా జాతికి చెందిన సాండ్​డాలర్లు సైజులో చాలా చిన్నగా ఉంటాయి. సగటున దాదాపు నాలుగు అంగుళాల పరిమాణంలో ఉంటాయి.

మధ్య, దక్షిణ అమెరికా సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా వేడిగా ఉండే నీటిలో ఈ సాండ్ డాలర్లు జీవిస్తాయి. అలాగే అమెరికా తూర్పు తీరంలోనూ కనిపిస్తాయి. సముద్రంలో తీవ్రమైన అలలు, ఆటుపోట్ల కారణంగా సాండ్​డాలర్లు ఒడ్డుకు కొట్టుకువస్తున్నట్టు సమాచారం. సముద్రం బయటికి వచ్చాక సాండ్​డాలర్లు నిమిషాలకు మించి జీవించలేవు. నీళ్లు లేకుండా వీటి శరీరం త్వరగా పొడిగా మారి, చనిపోతాయి.

వెస్ట్​కోస్ట్‌లో పురాతన ఆక్వేరియం అయిన సీసైడ్ ఆక్వేరియం... సాండ్ డాలర్లు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వీడియోను ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేసింది. అసలు బీచ్​లోకి ఇంత పెద్ద సంఖ్యలో సాండ్ డాలర్లు కొట్టుకొచ్చేందుకు గల కారణాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నామని సీసైడ్​వెల్లడించింది. ఆటుపోట్ల కారణాలను కూడా కచ్చితంగా గుర్తించలేకపోతున్నట్టు చెప్పింది.

“సీసైడ్ బీచ్​దక్షిణ ప్రాంతానికి జీవంతో ఉన్న వేల సాండ్ డాలర్లు కొట్టుకొస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా వస్తున్న ఆటుపోట్ల వల్ల ఇవి ఒడ్డుకు వస్తున్నాయనుకుంటున్నాం. అలాగే తీరం వెంట చాలా చిక్కుకుపోయాయి. ఒడ్డుకు వచ్చాక జీవంతో ఉన్నా అవి మళ్లీ నీటిలోకి వెళ్లలేకపోతున్నాయి. అయితే ఇవి ఒడ్డుకు ఎందుకు కొట్టుకు వస్తున్నాయనే విషయం తెలియదు. చాలా కారణాల వల్లే ఇలా జరుగుతుండవచ్చు. అసలు ఎన్ని సాండ్ డాలర్లు కొట్టుకువస్తున్నాయో కూడా చెప్పడం కష్టంగా మారింది” అని సీసైడ్​ఆక్వేరియం పోస్ట్ చేసింది.

ఇది కూడా చదవండి: Zodiac Signs: ఏ రాశుల వారికి ఏ హాబీలు ఉంటాయి?

బీచ్​లకు వచ్చే వారు కొన ప్రాణంతో ఉన్న సాండ్ డాలర్లను తమతో తీసుకువెళ్లవద్దని సీసైడ్ సూచించింది. “సాండ్ డాలర్లు కొన ప్రాణంతో ఉంటే వాటిని వదిలేయండి. తీసుకెళ్లవద్దని మేం సూచిస్తున్నాం. వాటిని బీచ్​లోనే వదిలేయండి. ఒకవేళ ఇంటికి తీసుకువెళితే అవి దుర్వాసన వస్తాయి” అని తెలిపింది. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పుల వల్ల సముద్ర జీవులు ఇటీవల తీవ్రంగా నష్టపోతున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ పరోక్షంగా పర్యావరణంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published by:Krishna Kumar N
First published: