Viral News: ఎలుగుబంటితో రష్యన్ మహిళ స్నేహం.. వారిది విడదీయరాని బంధం.. ఆమె ఏం చెబుతుందంటే..

ఎలుగుబంటితో రష్యన్ మహిళ స్నేహం

వెరోనికా 2019లో సఫారీ పార్కులో పర్యటనకు వెళ్లినప్పుడు మొదటిసారి ఆ ఎలుగుబంటిని చూసింది. దానితో కాసేపు గడిపిన తరువాత, వారి మధ్య స్నేహం ఏర్పడింది.

  • Share this:
సాధారణంగా పెంపుడు జంతువులు అంటే ఇష్టం ఉన్నవారు కుక్కలు లేదా పిల్లులను పెంచుకుంటారు. మరికొంతమంది పక్షులను సైతం మచ్చిక చేసుకుంటారు. అయితే రష్యాకు చెందిన వెరోనికా డిచ్కా అనే యువతి మాత్రం ఏకంగా ఒక అడవి ఎలుగుబంటితో స్నేహం చేస్తోంది. అసాధారణమైన సహచరుడిగా ఉన్న ఆ పెద్ద అడవి ఎలుగుబంటిని చూసి ఎవరైనా భయపడతారు. కానీ వెరోనికా మాత్రం దాన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. ఆమె దానికి ఆర్చీ అని పేరు పెట్టింది. ఆమె దాన్ని ఒంటరిగా వదిలిపెట్టదు. వారు ఇద్దరూ కలిసి తింటారు. ఇద్దరూ కలిసే రష్యాలోని నోవోసిబిర్స్క్ సరస్సులో ఫిషింగ్, బోటింగ్‌కు వెళ్తారు. పక్కపక్కనే నిద్రపోతారు.

వెరోనికా 2019లో సఫారీ పార్కులో పర్యటనకు వెళ్లినప్పుడు మొదటిసారి ఆ ఎలుగుబంటిని చూసింది. దానితో కాసేపు గడిపిన తరువాత, వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తరువాత వెరోనికా ఆర్చీని ఫిషింగ్ కోసం సరస్సు వద్దకు తీసుకెళ్లడం ప్రారంభించింది. క్రమంగా వారిద్దరి మధ్య ఒక స్నేహం మరింత బలపడింది. ఇప్పుడు ఆర్చీ, వెరోనికా ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా దగ్గరయ్యారు.

తామిద్దరం కలిసి ఉండేందుకు ఇష్టపడతామని చెబుతోంది వెరోనికా. అడవిలో పుట్టి పెరిగిన ఎలుగుబంటి అయినప్పటికీ, ఆర్చీకి వేటాడే స్వభావం లేదని ఆమె చెబుతోంది. మాంసాహారులైన ఎలుగుబంట్లు మనుషులపై దాడి చేసి చంపిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆర్చీ మాత్రం ఏనాడు వెరోనికాపై దాడి చేసేందుకు ప్రయత్నించలేదట. అది తనను ఏమీ చేయదనే భరోసా తనకు ఉందని చెబుతోంది వెరోనికా.

ఆర్చీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతున్న వెరోనికా.. దానితో కలిసి ఫోటోషూట్లు సైతం చేయడం విశేషం. ఇద్దరూ కలిసి ఒక ఫిషింగ్ బోటులో స్వారీ చేసిన ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి. ఆర్చీకి పడవల్లో ప్రయాణించడం ఇష్టమని ఆమె తెలిపింది. ఆ ఎలుగుబంటి తనను తల్లిగా భావిస్తోందని వెరోనికా తెలిపింది. అది భయపడినప్పుడల్లా తన వెనుక దాక్కుంటుందని కూడా ఆమె చెప్పింది. ఎలుగుబంటితో కలిసి చేసిన ఫోటోషూట్లతో వెరోనికా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య సైతం అనూహ్యంగా పెరిగింది. క్రూరమైన అడవి జంతువుతో సైతం ప్రేమగా వ్యవహరిస్తున్న వెరోనికా ధైర్యానికి.. సోషల్ మీడియా ఫాలోవర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
Published by:Sumanth Kanukula
First published: